చిత్తశుద్ధిలేని పశ్చాత్తాపము
6 1. ప్రజలిట్లందురు:
”మనము మరల ప్రభువునొద్దకు పోవుదము.
అతడు మనలను చీల్చివేసెను,
కాని ఇపుడు మనలను బాగుచేయును.
అతడు మనలను గాయపరచెను.
కాని ఇపుడు మన గాయములకు కట్టుకట్టును.
2. రెండు దినములయిన తరువాత
ఆయన మనకు తిరిగి జీవమును దయచేయును.
మూడవరోజున ఆయన
మనలను తిరిగి నిలబెట్టును.
మనము ఆయన సముఖమునందు
బ్రతుక గలుగుదుము.
3. మనము ప్రభువును
తెలిసికొనుయత్నము చేయుదము.
వేకువవచ్చునంత నిశ్చయముగా,
వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా
ఆయన మనచెంతకు వచ్చును”.
4. కాని ప్రభువు ఇట్లనుచున్నాడు:
ఎఫ్రాయీమూ! నేను మిమ్మేమి చేయుదును?
యూదా ప్రజలారా!
నేను మిమ్ము ఏమి చేయుదును?
మీకు నాపట్ల గల ప్రేమ
ఉదయకాలపు మంచువలెను,
వేకువన విచ్చిపోవు
పొగమంచువలెను క్షణికమైనది.
5. కావుననే నేను నా ప్రవక్తలను
మీ చెంతకు పంపితిని.
నేను విధించు తీర్పునుగూర్చియు,
నేనుపంపు శిక్షనుగూర్చియు,
వారిచే మీకు సందేశము చెప్పించితిని.
6. నేను మీనుండి కోరునది
కారుణ్యమునేగాని, బలులు కాదు. దేవునిగూర్చిన జ్ఞానమునేగాని,
దహనబలులు కాదు.
యిస్రాయేలీయుల పూర్వ, ప్రస్తుత పాపములు
7. ఆదాము నిబంధనము మీరినట్లే,
ఆ ప్రజలును నాయెడల నమ్మకద్రోహులై
నా నిబంధనము మీరియున్నారు.
8. గిలాదు నగరము దుష్టవర్తనులతోను
నరహంతకులతోను నిండిపోయెను.
9. యాజకులు దాగియున్న దొంగలగుంపువలె
యాత్రికుల కొరకు పొంచియున్నారు.
షెకెమునకు పోవుమార్గముననే
వారు హత్యలు చేయుచున్నారు.
బుద్ధిపూర్వకముగనే వారు
ఈ దుష్కార్యములు చేయుచున్నారు.
10. నేను యిస్రాయేలు దేశమున
ఘోరకార్యమును చూచితిని.
ఎఫ్రాయీము విగ్రహములను
కొలిచి అపవిత్రులైరి.
11. యూదాప్రజలారా! చెరలోనికి వెళ్ళిన
నా ప్రజలను నేను తిరిగి రప్పించినపుడు,
ఆయన నీకు కోతకాలము నిర్ణయించును.