కనాను ఎల్లలు

34 1. ప్రభువు మోషేతో ”యిస్రాయేలు ప్రజలను ఇట్లు ఆజ్ఞాపింపుము.

2. మీరు కనానున ప్రవేశించిన తరువాత మీ సీమకు సరిహద్దులివి.

3. మీ సీమ దక్షిణపుభాగము సీను ఎడారినుండి ఎదోము సరిహద్దు మీదుగా పోవును. మీ దక్షిణపుహద్దు మృతసముద్రము చివరిన తూర్పు తీరమువరకు ఉండును.

4. తరువాత అది దక్షిణముగా అక్రాబీము కనుమ వరకు పోయి, సీను ఎడారిగుండ సాగిపోయి కాదేషు బార్నెయా చేరును. అటు తరువాత అది ఉత్తరమునకు తిరిగి హాస్సారు-అద్దారు, ఆస్మోను చేరును.

5. అచినుండి ఐగుప్తు సరిహద్దులలోనున్న ఐగుప్తునదివరకు పోయి సముద్రము చేరుకొనును.

6. మీ పడమిహద్దు మధ్యధరాసముద్రము.

7. మీ ఉత్తరపుహద్దు మధ్యధరాసముద్రము నుండి హోరుకొండ వరకు పోయి 8. హామతు కనుమకు చేరును. అచినుండి సెదాదు మీదుగా పోయి, 9. సీఫ్రోను చేరుకొని, హాసారు ఏనానున ముగియును.

10. మీ తూర్పుహద్దు హాసారు ఏనాను నుండి షేఫాము వరకు పోవును.

11. అచట నుండి రిబ్లాకు దక్షిణమునకు తిరిగి అయీనునకు తూర్పుననున్న కిన్నెరెతు చేరుకొని, కిన్నెరెతు సముద్రము నుండి తూర్పుననున్న కొండలను కలియును.

12. ఆ చోట నుండి యోర్దాను నదిమీదుగా మృతసముద్రము వరకు వ్యాపించి ఉండును. ఈ నాలుగు సరిహద్దులు మధ్య నుండు దేశము మీదగును” అనెను.

13. కనుక మోషే ప్రజలతో ”మీరు చీట్లు వేసికొని పంచుకోవలసిన భూమి ఇదియే. ఈ నేలను ప్రభువు తొమ్మిదిన్నర తెగలకు ఇచ్చెను.

14-15. రూబేను, గాదు, మనష్షే అర్థతెగవారు వారివారి భాగ ములను యోర్దానునకు తూర్పు దిక్కున ఇంతకు పూర్వమే స్వీకరించి వంశములవారిగా పంచుకొనిరి గదా!” అనెను.

నేలను పంచియిచ్చు నాయకులు

16-17. ప్రభువు మోషేతో ”యాజకుడగు ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ భూమిని పంచెదరు.

18. ఈ పనిలో వారికి తోడ్పడుటకై ప్రతి తెగనుండి ఒక నాయకునిగూడ ఎన్నుకొనుము.

19-28. వారి పేర్లివి: యూదా తెగనుండి యెఫున్నె కుమారుడగు కాలేబు, షిమ్యోనుతెగనుండి అమ్మీహూదు కుమారుడగు షెలుమీయేలు, బెన్యామీను తెగనుండి ఖీస్లోను కుమారుడగు ఎలీదాదు, దాను తెగనుండి యోగ్లి కుమారుడగు బుక్కి, మనష్షే తెగనుండి ఎఫోదు కుమారుడగు హన్నీయేలు, ఎఫ్రాయీము తెగనుండి షిఫ్టాను కుమారుడగు కెమూవేలు. సెబూలూను తెగనుండి పార్నాఖు కుమారుడగు యెలిస్సాఫాను, యిస్సాఖారు తెగనుండి ఆస్సాను కుమారుడగు పల్టీయేలు, ఆషేరు తెగనుండి షెలోమి కుమారుడగు అహీహూదు, నఫ్తాలి తెగనుండి అమ్మీహూదు పుత్రుడగు పెదహేలు నాయకులుగా నుందురు” అనెను.

29. కనాను మండలమున యిస్రాయేలీయులకు భూమిని పంచియిచ్చుటకు ప్రభువు నిర్ణయించిన నాయకులు వీరే.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము