19 1. తన ఉపదేశమును ముగించిన పిదప, యేసు గలిలీయ సీమను వీడి, యోర్దాను నదికి ఆవల నున్న యూదయా ప్రాంతమును చేరెను.

2. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచట స్వస్థపరచెను.

విడాకుల సమస్య

(మార్కు 10:1-12)

3. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి ”ఏ కారణము చేతనైన ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా?” అని ప్రశ్నించిరి.

4. ”ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదువలేదా?

5. ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని, విడిచి తన భార్యను హత్తుకొనియుండును. వారు ఇరువురు ఏకశరీరులై యుందురు.

6. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక, ఏకశరీరులైయున్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరుపరాదు” అని యేసు పలికెను.

7. ”అటులైన విడాకుల పత్రము నిచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఏల ఆజ్ఞా పించెను?” అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించిరి.

8. ”మీ హృదయ కాఠిన్యమును బట్టిమీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించెనే కాని, ఆరంభమునుండి ఇట్లు లేదు.

9. వ్యభిచార కారణమున తప్ప, తన భార్యను విడనాడి మరియొకతెను వివాహ మాడువాడు వ్యభిచారియగును” అని యేసు ప్రత్యుత్తర మిచ్చెను.

10. అపుడు శిష్యులు, ”భార్య, భర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడకుండుటయే మేలుతరము” అనిరి. 11. అందుకు యేసు ”దైవానుగ్రహము కలవారికేగాని మరెవ్వరికిని ఇది సాధ్యపడదు.

12. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు. మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు. పరలోకరాజ్యము నిమిత్తమై తమకు తాము నపుంసకులు అయిన వారును కొందరున్నారు. గ్రహింపగలిగినవాడు గ్రహించునుగాక!” అని పలికెను.

పసిబిడ్డలకు దీవెనలు

(మార్కు 10:13-16; లూకా 18:15-17)

13. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్థింపుమని యేసువద్దకు తీసికొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి.

14. ”చిన్న బిడ్డలను నాయొద్దకు రానిండు. వారలను ఆటంక పరుపకుడు. ఏలయన, అట్టివారిదే పరలోక రాజ్యము”  అని  పలికి, 15. వారిమీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను.

ఒక ధనికుడు

(మార్కు 10:17-31; లూకా 18:18-30)

16. అంతట ఒక యువకుడు యేసును సమీపించి, ”బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయ వలసిన మంచిపనియేమి?” అని ప్రశ్నించెను.

17. ”మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు?  మంచివాడు  ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము” అని యేసు సమాధానమిచ్చెను.

18. ”ఆ దైవాజ్ఞలు ఏవి?” అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, ”నరహత్య చేయకుము. వ్యభిచరింప కుము.  దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుక కుము.

19. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము” అనెను.

20. అంతట అతడు యేసుతో ”ఇవియన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?” అని అడిగెను.

21. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్ళి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము” అని ఆయన సమాధానమిచ్చెను.

22. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను.

23. అంతట యేసు తన శిష్యులతో, ”ధనవంతుడు  పరలోకరాజ్యమున  ప్రవేశించుట కష్టము.

24. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటె, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరల మీతో రూఢిగా చెప్పుచున్నాను” అనెను.

25. శిష్యులు ఈ మాటలువిని మిక్కిలి ఆశ్చర్యపడి, ”అట్లయిన ఎవడు రక్షణము పొందగలడు?” అనిరి.

26. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, ”మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తమును సాధ్యమే” అని పలికెను.

27. అపుడు పేతురు యేసుతో, ”మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి. మాకు  ఏమి లభించును?” అనెను. 

28. అందుకు యేసు  వారితో               ”పునఃస్థితిస్థాపన సమయమున మనుష్యకుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడై నపుడు, నన్ను అనుసరించిన మీరును పండ్రెండు ఆసనములపై కూర్చుండి, యిస్రాయేలు పండ్రెండు గోత్రములకు తీర్పుతీర్చెదరు.  

29. నా నిమిత్తము గృహములనుగాని, సోదరులనుగాని, సోదరీలనుగాని, తల్లినిగాని, తండ్రినిగాని,  పిల్లలనుగాని, భూములనుగాని త్యజించిన ప్రతివాడును నూరంతలు పొంది, నిత్య జీవమునకు వారసుడగును, 30. అయినను ‘మొదటి వారు అనేకులు  కడపటివారు అగుదురు, కడపటివారు వారు మొదటిఅగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”’ అనెను.