సాయంకాల ప్రార్థన

ప్రధానగాయకునికి తంత్రివాద్యములతో పాడదగిన

దావీదు కీర్తన

4 1.         నా నీతికి ఆధారమైన ప్రభూ!

                              నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్నాదుకొనుము.

                              నేను ఆపదలో ఉన్నపుడు

                              నీవు నన్ను కాపాడితివి.

               కనుక ఇపుడు కరుణతో

               నా వేడికోలు ఆలింపుము.

2.           నరులారా! మీరెంతకాలము

               నన్ను అవమానింతురు?

               ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు

               మీ హృదయమర్పించి,

               అబద్ధములకు పూనుకొందురు?

3.           ప్రభువు తాను ప్రేమించువారికి

               ఉపకారములు చేయును.

               అతడు నా మొరవిని నన్ను ఆదుకొనును.

4.           కోపముగానున్నపుడు పాపమును చేయకుడు.

               మీరు పడకలమీద ఉండగా

               మీ హృదయములలో ధ్యానము చేసికొనుడు,

               మౌనముగా ఉండుడు.

5.           దేవునికి నీతియుక్తమైన బలులర్పించి,

               అతనిని విశ్వసింపుడు.

6.           ”మాకు మేలు చేయువారెవరు?

               అని అనేకులు పలుకుదురు.

               ప్రభూ! నీ ముఖకాంతిని

               మామీద ప్రసరింపనిమ్ము”.

7.            అన్యులు ధాన్యము, ద్రాక్షాసారాయము

               సమృద్ధిగా లభించుటవలన

               పొందెడు సంతోషముకంటె,

               అధికమైన సంతోషము నాలో కలిగించితివి.

8.           నేను పరుండిన వెంటనే

               ప్రశాంతముగా నిద్రింతును.

               నేను సురక్షితముగా

               జీవించునట్లు చేయువాడవు నీవే.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము