జలోదర పీడితునికి స్వస్థత

14 1. యేసు ఒక విశ్రాంతిదినమున పరిసయ్యుల అధికారులలో ఒకని యింట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి.

2. అప్పుడు జలోదర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను.

3. ”విశ్రాంతిదినమున స్వస్థపరచుట ధర్మమా? కాదా?” అని యేసు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ప్రశ్నించెను.

4. దానికి వారు ప్రత్యుత్తరమీయక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరచి, పంపివేసి 5. వారితో, ”మీ కుమారుడుగాని, మీ ఎద్దుగాని, బావిలో పడినపుడు విశ్రాంతిదినమైనను వెంటనే దానిని బయటకు తీయనివారు మీలో ఎవరున్నారు?” అనెను.

6. వారు అందుకు సమాధానము ఈయజాలక పోయిరి.

విందునకు ఆహ్వానము

7. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను: 8. ”ఎవరైనను నిన్ను పెండ్లివిందుకు పిలిచినపుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీ కంటె గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును.

9. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ‘ఇతనికి చోటు ఇమ్ము’ అనును. అపుడు నీవు సిగ్గుతో కడపటిచోటున కూర్చుండవలసివచ్చును.

10. అందుచేత నీవు పిలువబడినపుడు అందరికంటె కడపటి చోటున కూర్చుండుము. అపుడు మిమ్ము పిలిచినవాడు వచ్చినీతో’స్నేహితుడా!ముందుకువెళ్ళి కూర్చుండుము’  అని చెప్పును. అపుడు అతిథులందరియెదుట నీకు గౌరవము కలుగును.

11. తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తననుతాను తగ్గించు కొనువాడు హెచ్చింపబడును” అనెను.

12. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, ”నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనముకైనను, విందునకైనను  నీ  మిత్రులను,  సోదరులను, బంధువులను, ఇరుగుపొరుగు ధనికులను పిలువవలదు.

13. నీవు విందు చేయునపుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము.

14. వారు నీకు ప్రతిఫలమును ఈయలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును” అనెను.

విందు – పరమ రాజ్యము

(మత్తయి 22:1-14)

15. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు ”దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు!” అనెను.

16. అందుకు యేసు అతనితో, ”ఒకమారు ఒకడు గొప్ప విందుచేసి అనేకులను పిలిచెను.

17. విందువేళకు అతడు, ఆహ్వానించిన వారికి ‘అన్నియు సిద్ధమైనవి, బయలుదేరి రండు’ అని సేవకునిద్వార వార్తను పంపెను.

18. కాని వారందరు సాకులు చెప్పసాగిరి. మొదటివాడు ‘నేనొక పొలమును కొంటిని. దానిని చూచిరావలయును. కనుక నన్ను క్షమింపుము’ అని మనవి చేసికొనెను.

19. రెండవవాడు ‘నేను ఐదు జతల ఎడ్లనుకొంటిని. వాటిని పరీక్షింప పోవుచున్నాను.కనుక నన్ను క్షమింపుము’ అని అర్థించెను.

20. మరియొకడు ‘నేను వివాహము చేసికొంటిని. కనుక రాలేను’ అని చెప్పెను.

21. సేవకుడు తిరిగివచ్చి, ఈ విషయమును యజమానునికి తెలియజేయగా ఆ యజమానుడు మండిపడి, తన సేవకునితో ‘నీవు వెంటనే నగరవీధులకు పేటలకు వెళ్ళి, పేదలను, అవి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసికొనిరమ్ము’ అని ఆజ్ఞాపించెను.

22. అంతట సేవకుడు ‘అయ్యా! నీవు ఆజ్ఞాపించినట్లు  చేసితిని.  కాని,  ఇంకను స్థలమున్నది’ అని చెప్పెను.

23. అందుకు ఆ యజమానుడు సేవకునితో ”రాజ మార్గములందును వీధిసందులందును వెదకి, అక్కడ కనబడిన వారిని బలవంతముగ తీసికొని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము.

24. ఏలయన, ఆహ్వా నింపబడిన వారు ఎవ్వరును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను” అనెను.

శిష్య లక్షణములు

(మత్తయి 10:34-38)

25. అపుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: 26. ”నన్ను వెంబడింపగోరి, తన తల్లి దండ్రులను, భార్యను, బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు.

27. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు.

28. గోపురము కట్టదలచినవాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తిచేయు సాధనసంపత్తి తనవద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?

29. అటులకాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తి చేయజాలనియెడల చూచువారు, 30. ‘ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను’ అని పరిహసించెదరు.

31. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు, ఇరువదివేలసేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా?

32. అంత బలములేనియెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధిచర్చలు జరుపును.

33. కనుక తన సమస్తము త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు.”

సారము లేని ఉప్పు

(మత్తయి 5:13; మార్కు 9:50)

34. ”ఉప్పు శ్రేష్ఠమైనదే. కాని అది ఉప్పదనమును కోల్పోయినయెడల, దానిని తిరిగి ఎట్లు పొందగలదు?

35. ఆ ఉప్పు భూమికిగాని, ఎరువునకుగాని ఉపయోగపడదు. ప్రజలు దానిని బయట పారవేయుదురు. వినుటకు వీనులున్నవాడు వినును గాక!” అని వారితో చెప్పెను.