మన తండ్రియగు దేవుడు

12 1. ఈ మహాసాక్షీ సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసికొని ఉన్న పాపములను వదల్చుకొని, మనయెదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము.

2. మన విశ్వాసమునకు కారకుడును, పరిపూర్ణతను ఒసగువాడును అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడిప్రక్కన కూర్చుండియున్నాడు.

3. ఆయన ఎట్టి పాట్లుపడెనో, పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు! కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు. నీరసపడి పోవలదు.

4. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. 5. పుత్రులుగ మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా?

               ”కుమారుడా!

               ప్రభువు నిన్ను శిక్షించినపుడు శ్రద్ధవహింపుము.

               ఆయన నిన్ను మందలించినపుడు

               నీవు నిరుత్సాహపడకుము.

6.           ఏలయన,

               దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును.

               తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.”

7. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించ వలయును. ఏలయన దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు.  తండ్రి  శిక్షింపని  కుమారుడు ఎవడు?

8. ఆయన పుత్రులందరి వలెనే మీరు శిక్షింపబడక పోయినచో, మీరు నిజమైన కుమారులు కారు. అక్రమ పుత్రులు మాత్రమే.

9. మన తండ్రులు మానవులే అయినను వారు మనలను శిక్షించిరి. మనము వారిని గౌరవించితిమి. అయినచో మన ఆధ్యాత్మిక పితకు మనము ఎంత విధేయులమై జీవించవలెనో కదా!

10. వారికి మంచిదని తోచిన విధమున మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితమునకై మనలనుశిక్షించిరి. కాని ఆయన పవిత్రత యందు మనము పాలుపంచుకొనుటకై మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించును.

11. మనము శిక్షింపబడినపుడు మనకది దుఃఖకరముగనే తోచునుకాని, సంతోషకరము కాదు. కాని తదనంతరము, అట్టి దండనచే క్రమశిక్షణ పొందినవారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు.

ఉత్తరువులు, హెచ్చరికలు

12. కుంటువడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్ళను దృఢముగ నిలబెట్టుడు.

13. కుంటు వడిన కాలు శక్తివిహీనము కాకుండ స్వస్థతపొందుటకు ఋజుమార్గములనే అనుసరింపుడు.

14. తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు.

15. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకుండునట్లు జాగ్రత్తవహింపుడు. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోకుండునట్లు జాగ్రత్తపడుడు.

16. ఒక్కపూట తిండికొరకు జేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏసావువలె ఎవరును వ్యభిచారియును, భ్రష్టుడును కాకుండ శ్రద్ధ వహింపుడు.

17. తరువాత అతడు తన తండ్రి దీవెనలను పొందగోరినను నిరసింపబడెనని మీకు తెలియును. తానొనర్చిన వానిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదకినను అతడు మార్గమును కనుగొనలేక  పోవుటయే దానికి కారణము.

18. స్పర్శచే గ్రహింపగలిగినట్టియు, మంటలను ఎగజిమ్ముచున్నట్టి కొండకును, అగ్నికి, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుఫానునకును, 19. బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక్క మాట యైనను వినవలసిన అవసరములేకుండ చేయుమని వేడుకొనిరి. 20. ఏలయన, ”ఒక జంతువైనను సరే, ఆ పర్వతమును తాకినచో రాళ్ళతో కొట్టి చంపబడవలెను” అను ఆజ్ఞనువారు భరింపలేకపోయిరి.

21. ఆ దృశ్యము మహాదారుణముగ ఉండుట చేతనే ”నేను భయముతో వణకుచున్నాను” అని మోషే పలికెను.

22. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకును, వేలకొలది దేవదూతలతో కూడిన సజీవ దేవునియొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి.

23. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకును తీర్పరి అగు దేవునివద్దకును, పరిపూర్ణులుగ చేయబడిన నీతిమంతులైనవారి ఆత్మల వద్దకును మీరు వచ్చితిరి.

24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు వద్దకును, హేబెలు రక్తముకంటె ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణరక్తము వద్దకు మీరు వచ్చితిరి.

25. కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు నిరాకరింపకుడు. భూమి మీదనుండి హెచ్చరించిన వానిని వినుటకునిరాకరించినవారు తప్పించుకొనలేక పోయిరి. ఇక పరలోకమునుండి హెచ్చరించువానిని మనము తిరస్కరించినచో మనము మాత్రము ఎంతగ తప్పించుకొనగలము?

26. అప్పుడు ఆయన స్వరము భూమిని కంపింపజేసెను. కాని ఇపుడు, ”నేను ఇంకొకసారి భూమినే కాక పరలోకమునుకూడ కంపింపచేయుదును” అని ఆయన వాగ్దానమొనర్చియున్నాడు.

27. సృష్టించబడిన వాటిలో కంపింపబడినవి తొలగించబడి, కంపింపబడనివి మాత్రమే నిలకడగానుండునని, ”ఇంకొక సారి” అను మాట స్పష్టముగా నిరూపించుచున్నది.

28. సుస్థిరమైన రాజ్యమును పొందుచున్న మనము కృతజ్ఞులమైయుందుము, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగ ఆయనను పూజింతము.

29. ఏలయన, మన దేవుడు దహించు అగ్నియై ఉన్నాడు.