నెబుకద్నెసరు రెండవకల, అతడు ఉన్మత్తుడగుట
4 1. నెబుకద్నెసరురాజు సకలదేశములకును, జాతు లకును, భాషలకును చెందిన ప్రజలకు ఈ సందేశము పంపెను: ”మీకు పరిపూర్ణశుభములు కలుగునుగాక!
2. మహోన్నతుడైన దేవుడు నాకు చేసిన మహాక్రియ లను, అద్భుతకార్యములను నేను మీకు ఎరిగింప గోరెదను.
3. దేవుని అద్భుతకార్యములు ఎంతగొప్పవి!
ఆయన ఆశ్చర్యకార్యములు ఎంత
మహత్తరమైనవి!
ఆయన సదా రాజుగా పరిపాలనము చేయును.
ఆయన రాజ్యము ఎల్లకాలమునుండును.
4.నేను సకల ఐశ్వర్యములతో నా రాజభవనమున సుఖముగా జీవించుచుింని.
5. కాని నేనొక భయంకర స్వప్నమును గాంచితిని. నిద్రలో భీకర దృశ్యములను చూచి కలతచెందితిని.
6. కనుక నేను బబులోనియా జ్ఞానులెల్లరును నా చెంతకువచ్చి ఆ కల భావమును వివరింపవలెనని ఆజ్ఞాపించితిని.
7. అట్లే మాంత్రికు లును, శాకునికులును, కల్దీయులును, సోదెగాండ్రును నా దగ్గరకురాగా నేను వారికి స్వప్నమును తెలియ జేసితిని. కాని వారు దాని అర్థమును వివరింపజా లరైరి.
8. అంతట ‘బెల్తెషాజరు’ అను నా దేవత పేరును బిరుదుగా పొందిన దానియేలు అనువాడు నా సమక్షమునకు వచ్చెను. పవిత్రదేవతల ఆత్మ అతనియందుండెను. నేను అతనికి నా కలను ఇట్లు ఎరిగించితిని:
9. ”బెల్తెషాజరూ! నీవు మాంత్రికుల కందరికిని నాయకుడవు. పవిత్ర దేవతల ఆత్మ నీలో ఉన్నదనియు, నీకు రహస్యములెల్ల తెలియుననియు నేనెరుగుదును. నా స్వప్నమిది, నీవు దీనిభావమును నాకు తెలియజెప్పుము.
10. నేను పడుకపై నిద్రించుచు ఈ దృశ్యము గాంచితిని. నేను చూచుచుండగా భూలోకమధ్యమున అత్యున్నతమైన వృక్షము కనిపించెను.
11. అది అంతకంతకుపెద్దదై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరును దానిని చూడగలిగిరి.
12. దాని ఆకులు అందమైనవి. అది లోకములోని జనులెల్లరికిని సరి పోవునన్ని పండ్లుకాసెను. వన్యమృగములు దాని నీడలో పరుండెను. పకక్షులు దానికొమ్మలలో గూళ్ళు కట్టెను. ఎల్లప్రాణులును దాని ఫలములనారగించెను. 13. నేను పడుకపైపరుండి, ఆ దృశ్యమును గూర్చి తలంచుచుండగా దేవదూత1 ఆకాశమునుండి దిగి వచ్చి, 14. పెద్ద స్వరముతో ఇట్లు పలికెను:
ఈ చెట్టును పడగ్టొి దాని కొమ్మలను నరుకుడు.
దాని ఆకులను దులిపి
పండ్లను ఆవల పారవేయుడు. పశువులను దానినీడనుండి తరిమివేయుడు.
పకక్షులను దానికొమ్మలనుండి పారద్రోలుడు.
15. దాని మొద్దును మాత్రము
నేలలో మిగిలియుండనిండు.
దానిచుట్టు ఇనుముకంచు కట్టుక్టి,
గడ్డిపాలగునట్లు దానిని పొలముననుండనిండు.
ఈ నరుడు మంచులో తడియునుగాక!
ఇతడు గడ్డిమేయుచు
పశువులమధ్య వసించునుగాక!
16. ఏడేండ్లపాటు ఇతనికి
మనుష్యుల మనస్సు తొలగిపోయి,
పశువుల మనస్సు అలవడునుగాక!
17. దేవదూతలు ప్రకించు నిర్ణయమిది:
కావున మహోన్నతుడైన దేవునికి నరుల
రాజ్యములపై అధికారము కలదనియు,
ఆయన ఆ రాజ్యములను
తనకిష్టము వచ్చినవారికి ఇచ్చుననియు,
ఊరుపేరు లేనివారికిగూడ
వానిని దయచేయుననియు
ఎల్లజనులు గ్రహింతురుగాక!
18. నేను గాంచిన కలయిది. బెల్తెషాజరూ! నీవు దీని భావమేమిో తెలియజెప్పుము. నా రాజ్యములోని జ్ఞానులెవరును దీని అర్థమును ఎరిగింపజాలరైరి. కాని పవిత్రులైన దేవతల ఆత్మ నీలోనున్నది కనుక నీవు దీని భావమును తెలియజేయగలవు.”
దానియేలు స్వప్నార్థమును వివరించుట
19. ఆ మాటలకు బెల్తెషాజరు అను మారు పేరు కల దానియేలు భయముతో నోరు విప్పజాల డయ్యెను. రాజు ”ఓయి! నీవు స్వప్నమును దాని భావమును గూర్చి భయపడవలదు” అని అనెను. బెల్తెషాజరు ఇట్లనెను: ”ఈ కలయు దీని భావమును ప్రభువునకుగాక అతని విరోధులకు అన్వయించిన ఎడల బాగుండెడిది.
20. నీవు చూచిన చెట్టు అంతకంతకు పెద్దదై పై ఆకాశమును తాకెను. లోకములోని నరులెల్లరును దానిని చూడగలిగిరి.
21. దాని ఆకులందమైనవి. అది లోకములోని జీవకోికి చాలినంత ఆహారమును కలిగియుండెను. వన్యమృగ ములు దానినీడలో పరుండినవి. పకక్షులు దాని కొమ్మ లలో గూళ్ళు కట్టుకొనినవి.
22. రాజా! ఆచెట్టు బలముగను, ఉన్నతముగను ఎదిగిన నీవే. నీవు బ్రహ్మాండముగా ఎదిగి ఆకాశము ను తాకుచున్నావు. భూమియందంతట నీ ప్రాభవము చెల్లుచున్నది.
23. తమరు చూచుచుండగనే దేవదూత ఆకాశము నుండి క్రిందికి దిగివచ్చి ‘ఈ చెట్టును నరికి నాశనము చేయుడు. దాని మొద్దును మాత్రము నేలలో మిగిలియుండనిండు. దానికి ఇనుముకంచు కట్టు కట్టుడు. గడ్డితోపాటు దానిని పొలమున ఉండనిండు. ఈ నరుడు మంచులో తడియునుగాక! ఇతడు ఏడేండ్ల పాటు మృగములతో కలిసి వసించునుగాక!’ అని పలికెను.
24. రాజా! దీని భావమిది. మహోన్నతుడైన దేవుడు నీకు నిర్ణయించిన కార్యమిది.
25. నిన్ను మనుష్యుల చెంతనుండి తరిమివేయుదురు. నీవు వన్య మృగముల నడుమవసింతువు. ఏడేండ్లపాటు ఎద్దువలె గడ్డిమేయుచు బయి పొలముననే నిద్రింతువు. మంచులో తడియుదువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిపైన అధికారియై యున్నాడనియు, ఆయన వానిని తనకు ఇష్టమొచ్చిన వారికిచ్చుననియు గ్రహింతువు.
26. చెట్టుమొద్దును నేలలోనే వదలివేయుడని దేవదూతలు ఆజ్ఞాపించిరి. దానిభావమిది. నీవు మహోన్నతుడైన దేవుడు ప్రపంచ మంతికిని అధిపతియని అంగీకరించిన పిదప నీ రాజ్యమును మరల స్వీకరింతువు.
27. రాజా! నా సలహా మీకు అంగీకారమగునుగాక! నీవు పాపములను మాని, నీతిన్యాయమును అనుసరించుచు, నీవు బాధప్టిెనవారియందు కరుణచూపినయెడల నీవు దీర్ఘకాలము క్షేమముగా జీవింతువు.”
కల నెరవేరుట
28. ఈ సంగతులన్నియు నెబుకద్నెసరు రాజు నకు జరిగినవి.
29. పండ్రెండునెలల తర్వాత అతడు బబులోనియాలోని రాజభవనము మీద పచార్లు చేయుచు, 30. ”బబులోనియా ఎంత పెద్దది! నేనే దీనిని నా రాజధాని నగరముగా నిర్మించితిని. నాశక్తి సామర్థ్యములను కీర్తి ప్రాభవములను ప్రకించితిని” అని పలికెను.
31. ఆ మాటలతని నోటనుండగనే ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను: ”నెబుకద్నెసరు రాజా! నా పలుకులాలింపుము: నేను నీరాజ్యమును నీనుండి తొలగించితిని.
32. నిన్ను మనుష్యులచెంత నుండి తరిమివేయుదురు. నీవు ఏడేండ్లపాటు ఎద్దు వలె గడ్డితిందువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యములన్నిని అధికారియై యున్నా డనియు, వానిని తన కిష్టమువచ్చిన వానికి ఇచ్చున నియు అంగీకరింతువు.”
33. ఆ పలుకులు వెంటనే నెరవేరెను. నెబుకద్నెసరును నరులచెంతనుండి తరిమివేసిరి. అతడు ఎద్దువలె గడ్డితినెను. అతని దేహము మంచులో తడిసెను. అతని వెంట్రుకలు గరుడపక్షి ఈకలంత పొడవుగను, గోళ్ళు పక్షిగోళ్లంత పొడవుగా పెరిగెను.
నెబుకద్నెసరు దేవుని స్తుతించుట
34. ఆ రాజు ఇట్లనెను: ”ఏడేండ్లు కడచిన తరువాత నేను ఆకాశమువైపు చూచితిని. నాకు మరల వివేకము కలిగెను. నేను మహోన్నతుడైన దేవుని స్తుతించితిని. సదాజీవించు దేవునికీర్తించి స్తుతించితిని.
ఆయన నిత్యము పరిపాలనము చేయును. ఆయన రాజ్యము శాశ్వతముగా నుండును.
35. ఆయనకు భూమిమీదినున్న నరులు
శూన్యముతో సమానము.
పరమండలములోని దేవదూతలను,
భూమిమీది నరులను
ఆయన తన యిష్టము వచ్చినట్లు చేయును.
ఆయన చేయిపట్టుకొని ‘నీవు చేయునదేమి?’
అని ఎవరును ఆయనను
ఆపజాలరు, ప్రశ్నింపజాలరు.
36. నాకు వివేకముకలిగిన తరువాత నా రాజ్యము, వైభవము, గౌరవము నాకు మరలదక్కెను. నా మంత్రు లును ప్రముఖులైన నా ప్రజలును నన్ను ఆహ్వానించిరి. నా రాజ్యము నాకు లభించెను. నేను పూర్వముకంటెను అధికవైభవమును బడసితిని.
37. ఇప్పుడు నెబుకద్నెసరునైన నేను పరలోక రాజును స్తుతించి, కీర్తించి, కొనియాడుచున్నాను. ఆయన కార్యములెల్లయుక్తమైనవి. న్యాయమైనవి. ఆయన గర్వాత్ముల గర్వమును అణచును.”