ఉపోద్ఘాతము:

పేరు, కాలం, రచయిత: తిమోతి మొదటి లేఖ వివరణ చూడుము.

చారిత్రకనేపథ్యము: పౌలు రోము చెరసాలలో రెండవమారు వున్నప్పుడు ఈ రెండవ ఉత్తరం తిమోతికి వ్రాయడమైనది.  అది చెరనుండి విడుదల కొరకు ఎదురుచూస్తున్న సమయము క్రీ.శ. 62లో రోము నగరములో పెద్ద అగ్నిప్రమాదం జరిగినది. అది నాటి చక్రవర్తి నీరో పనియేనని అనుమానములున్నను, అట్టి దుర్మార్గమునకు క్రైస్తవులే ఒడిగట్టిరన్న తప్పుడు ప్రచారము మాత్రము జరిగినది. అందులకు  క్రైస్తవులే శిక్షార్హులని తీర్పు విధించడమైనది. ఆ తీర్పును అనుసరించి  క్రైస్తవులలో అనేకులను క్రూరహింసలకు గురిచేసి చంపడమైనది.  ఈ సందర్భంలోనే పౌలుగూడ చెర వేయబడినాడు.  పౌలు సోదరులైన పుగెల్లు (1:15), దేమా, క్రెస్కే, తీతు (4:10) అతనిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తన శిష్యుడు తిమోతికి తన కర్తవ్యదీక్షను గుర్తుచేస్తూ, సువార్తయందును, దానిని బోధించుటయందును, తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు (4:6). పౌలు తన భౌతిక జీవితం అంతం తొందరలోనే వుందని గ్రహించి, మరణానికి ముందు ఈ లేఖను వ్రాసియుండునని చెప్పగలము.

ముఖ్యాంశములు: పౌలు తన వ్యక్తిగత జీవితం ద్వారా కష్ట సమయాల్లో విశ్వాస జీవితాన్ని ఎలా నిలబెట్టుకోగలమో నిరూపించాడు (4:7-8). పవిత్ర జీవితం, నమ్మకమైన సేవ, పవిత్రాత్మ గల వారెవరును నిరుత్సాహము చెందరని తెలిపాడు.

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు ఈ లోకంలో తన పుట్టుక ద్వారా మరణాన్ని నిరర్థకం చేశాడు (1:10). సువార్త ద్వారా జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. క్రీస్తు తన మరణ, పునరుత్థానముల ద్వారా రక్షణను, నిత్య మహిమను అనుగ్రహించాడు (2:8, 10). మరణించినను క్రీస్తుతో జీవించి వుంటాం (2:11). సహనం చూపించే వారు క్రీస్తుతో పాటు నీతి కిరీటాన్ని పొందుతారు, ఆయనతో పరిపాలన చేస్తారు (2:12).