యిస్రాయేలు కాపరులు

34 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! యిస్రాయేలు రాజులను ఖండింపుము.  యావే  ప్రభుడనైన  నా పలుకులను ప్రవచనరూపమున వారితో ఇట్లు చెప్పుము: యిస్రాయేలు కాపరులారా! మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొను చున్నారేగాని గొఱ్ఱెలమందలను మేపుటలేదు.

3. మీరు గొఱ్ఱెల పాలు త్రాగుచున్నారు. వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు. వానిలో మంచివానిని చంపి తినుచున్నారు. కాని మందను మాత్రము మేపుట లేదు.

4. మీరు గొఱ్ఱెలలో దుర్బలమైన వానిని ప్టించుకొనుట లేదు. రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు. గాయపడిన వానికి కట్టు కట్టుట లేదు. ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొనివచ్చుటలేదు. తప్పిపోయినవానిని వెదకి తోలు కొని వచ్చుటలేదు. పైగా వారిపట్ల క్రూరముగా, కఠినముగా ప్రవర్తించుచున్నారు.

5. కాపరి లేనందున గొఱ్ఱెలు చెల్లాచెదరయ్యెను. వన్యమృగములు వానిని చంపి తినివేసెను.

6. నా గొఱ్ఱెలు ఎత్తయిన కొండల న్నిమీదను, ప్రతి తిప్పమీదను తిరుగాడెను. భూమి యందు అంతటను చెల్లాచెదరయ్యెను. వానిని ప్టించుకొను వారుగాని, వెదకువారుగాని లేరు.

7. కాపరులారా! మీరు ప్రభుడనైన నా పలుకు లాలింపుడు: 8. నా జీవముతోడు, యావేప్రభుడనైన నేను ఆనప్టిె చెప్పుచున్నాను. కాపరిలేడు కనుక వన్యమృగములు నా గొఱ్ఱెల మీదపడి వానిని చంపి తినివేసెను. నా కాపరులు మందను వెదకలేదు. వారు తమ కడుపు నింపుకొనుచున్నారేగాని నా మందను మేపలేదు.

9. కావున కాపరులారా! మీరు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు.

10. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధినగుదును. నేను మీనుండి నా గొఱ్ఱెలను తీసికొందును. మీరిక మీదట వానిని మేపజాలరు. నేను మీనుండి నా గొఱ్ఱెలను కాపాడుదును. మీరు వానిని మ్రింగివేయ జాలరు.

మంచికాపరి

11. యావేప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను.

12. కాపరి చెదరిపోయిన గొఱ్ఱెలను గూర్చి జాగ్రత్తపడి వానిని మరల ప్రోగుజేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొఱ్ఱెలు చెల్లాచెదరైన తావులనుండి వానిని మరల తోలుకొని వత్తును.

13. నేను వానిని పర దేశములనుండి ప్రోగుజేసి స్వీయదేశమునకు గొని వత్తును. వానిని యిస్రాయేలు కొండలకును, వాగుల కును తోడ్కొనివచ్చి మంచి గడ్డిబీడులలో మేపుదును.

14. వానిని యిస్రాయేలు దేశములోని కొండలమీది పచ్చికపట్టులలోను, లోయలలోను, పచ్చనిగడ్డిబీళ్ళ లోను మేపుదును.

15. నేనే నా గొఱ్ఱెలను మేపుదును. వానికి విశ్రమస్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. 16. నేను తప్పిపోయిన గొఱ్ఱెలను, ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుకట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్విన వాిని,  బలముగలవాిని శిక్షయను మేతప్టిె లయపరుతును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని.

17. నా మందా! ప్రభుడనైన నేను చెప్పున దేమనగా, గొఱ్ఱెకును గొఱ్ఱెకునుమధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్ళకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను బేధము కనుగొని నేను తీర్పుతీర్తును.

18. విస్తారముగా మేతమేసి, మిగిలినదానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా?

19. మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలుషితము చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20. కనుక యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను: నేను బలిసిన గొఱ్ఱెలకును, బక్కచిక్కిన గొఱ్ఱెలకును మధ్య తీర్పు తీర్తును.

21. మీరు బక్కచిక్కిన వానిని మీ భుజము లతో త్రోసి, మీ కొమ్ములతో పొడిచి మందనుండి గిెంవేసితిరి. 

22. కాని నేను నా మందను కాపాడి దానికి హాని కలుగకుండునట్లు చేయుదును. నేను నా గొఱ్ఱెలలో ప్రతిదానికి తీర్పుతీర్తును.

23. నా సేవకుడైన దావీదును వానిమీద ఒక్క కాపరినిగా నియమింతును. అతడు వానిని పోషించును.

24. ప్రభుడనైన నేను వానికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వానికి పాలకుడగును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

25. నేను వానితో భద్రతా యుతమైన నిబంధనము చేసికొందును. దేశములోని వన్యమృగములనెల్ల తొలగింతును. కావున నా గొఱ్ఱెలు సురక్షితముగా పొలమునవసించి, అడవిలో నిద్రించును.

26. నేను వానిని దీవించి నా పవిత్ర పర్వతము చెంత వసింపనిత్తును. అచట వానికి సకాల వర్షములు అను దీవెననిత్తును.

27. చెట్లు పండ్లుకాయును. పొలములు పండును. ప్రతివాడును సురక్షితముగా తన పొలమున వసించును. నేను నా ప్రజల శృంఖలాలను చేధించి, వారిని బానిసలుగా చేసిన వారినుండి వారిని విడిపించినపుడు, వారు నేను ప్రభుడనని గుర్తింతురు.

28. అటుపిమ్మట అన్య జాతులు వారిని దోచుకొనవు. వన్యమృగములు వారిని చంపవు. వారు భద్రముగా జీవింతురు. ఎవరును వారిని భయపెట్టజాలరు.

29. నేను వారికి బాగుగా పంటలు పండుపొలముల నిత్తును. దేశమున కరువు ఉండబోదు. అన్యజాతులు వారిని గేలిచేయ జాలవు.

30. నేను యిస్రాయేలునకు తోడుగానుందు ననియు, వారు నా ప్రజలనియు ఎల్లరును గుర్తింతురు.  ఇది  ప్రభుడనైన  నా  వాక్కు.”

31. ”నా గొఱ్ఱెలారా! మీరు, నేను మేపుమంద. నా ప్రజలు. నేను మీ దేవుడను. ఇది ప్రభుడనైన నా వాక్కు.”