అన్యాయపరులైన న్యాయాధిపతులకు శిక్ష
ఆసాపు కీర్తన
82 1. దేవుడు దేవలోకసభకు
అధ్యక్షత వహించియున్నాడు.
దైవముల నడుమనుండి
అతడు తీర్పుచెప్పుచున్నాడు.
2. అన్యాయపు తీర్పుతీర్చుటను,
దుష్టులపై పక్షపాతము చూపుటను
మీరిక మానుకొనుడు.
3. పేదలకును, అనాథలకును
అనుకూలముగా తీర్పుచెప్పుడు.
దీనులకును, దరిద్రులకును
న్యాయము చేకూర్చిపెట్టుడు.
4. బడుగువారిని, అక్కరలోనున్నవారిని ఆదుకొనుడు
వారిని దుర్మార్గుల బారినుండి రక్షింపుడు.
5. మీరు అజ్ఞానులు, మూర్ఖులు,
అంధకారమున నడచువారు
మీరు నేలపునాదులుకూడ
ధ్వంసము చేయుచున్నారు.
6. ”మీరును దైవములే” అనియు
”మీరెల్లరును యావే పుత్రులే” అనియు
నేను వచించితిని.
7. అయినను అందరు నరులవలె మీరును చత్తురు. అందరు అధికారులవలె మీరును కూలుదురు.
8. దేవా! లెమ్ము. భూమికి తీర్పు చెప్పుము.
అన్యజనులందరు నీకే భుక్తముగా ఉందురు.