11 1. యేసు పండ్రెండుమంది శిష్యులకు తన ఆదేశములను ఒసగిన పిదప, ఆయా పట్టణములలో బోధించుటకును, ప్రసంగించుటకును బయలుదేరెను.

యోహాను శిష్యులు (లూకా 7:18-35)

2. చెరసాలలోనున్న యోహాను, క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని, శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను.

3. ”రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా?” అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి.

4. వారితో యేసు, ”పోయి, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు.

5. గ్రుడ్డి వారు దృష్టిని పొందుచున్నారు. కుంటివారు నడుచు చున్నారు. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. చెవి వారు వినుచున్నారు. మృతులు పునరుత్థానులగు చున్నారు. పేదలకు సువార్త ప్రకింపబడుచున్నది.

6. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు” అని ప్రత్యుత్తరమిచ్చెను.       

7. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, ”మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా?

8. మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదువస్త్రములను ధరించు వారు రాజభవనములలో నుందురుగదా!

9. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటకా? అవును, ప్రవక్తకంటె గొప్పవాడిని” అని నేను మీతో నుడువు చున్నాను.

10. ఇతనిని గురించి:

‘ఇదిగో! నీకు ముందుగా

నా దూతను పంపుచున్నాను.

అతడు నీ మార్గమును  సిద్ధపరచును’

అని వ్రాయబడినది.

11.”మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటె అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతనికంటె గొప్పవాడు.

12. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోకరాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు.

13. యోహాను కాలమువరకు ప్రవక్తలందరు దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను.

14. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో, రాబోవు ఏలియా ఇతడే.

15. వీనులున్నవాడు వినునుగాక!

16. ఈ తరము వారిని ఎవ్వరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పసిపిల్లల వలె ఉన్నారు.

17. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు ‘మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి; కాని మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి; కాని  మీ రొమ్ములను బాదుకొనరైతిరి’ అనుచుందురు. 

18. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే, అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు.

19. మనుష్యకుమారుడు అన్నపానీయములు పుచ్చు కొనుటచే ‘అతడు భోజనప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు’ అని అనుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలనుబట్టి నిరూపింపబడును.”

అవిశ్వాస పట్టణములు (లూకా 10:13-15)

20.  అపుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయన, ఆ పట్టణవాసులలో  పరివర్తన   కలుగలేదు.

21. ”అయ్యో! ఓ కొరాజీను పురమా! అయ్యో! బెత్సయిదా పురమా! మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు, సీదోను పట్టణములలో జరిగి యుండినచో, ఆ పురజనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిదపూసికొని హృదయపరివర్తనమును పొంది యుండెడివారే!

22. కాని నేను మీతో చెప్పునదేమనగా, తీర్పుదినమున మీ స్థితికంటె   తూరు, సీదోను వాసుల స్థితియే మేలైనదిగానుండును. 

23. ఓ కఫర్నాము పురమా! నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింప లేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడియున్నచో, అది నేటి వరకును  నిలచియుండెడిది.

24. కాని నేను నీతో చెప్పున దేమనగా, తీర్పుదినమున నీ స్థితి కంటె, సొదొమ వాసుల  స్థితియే మేలైనదిగా ఉండును.”

విశ్రాంతి నిలయము (లూకా 10:21-22)

25. ఆ సమయమున యేసు ఇట్లనెను: ”పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ! విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను.

26. అవును తండ్రీ! ఇది నీ అభీష్టము.”

27. ”నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు  కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.”

28. ”భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను.

29. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీలుడననియు, వినమ్రహృదయుడననియు మీరు  నా  నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు.

30. ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది.”

 

 

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము