ఉపోద్ఘాతము:

పేరు: తెస్సలోనిక మాసిడోనియాలో ఉన్న పెద్ద పట్టణం. ఈ పట్టణాన్ని అలెగ్జాండరు చక్రవర్తి సోదరి, కసాండోమహారాజు భార్య ‘తెస్సలోనిక’ పేర నిర్మించారు.  క్రీ.పూ. 167-168 నుండి రోమీయుల అధీనంలో ఉన్న మాసిడోనియాలో రెండవ పట్టణంగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం సలోనిక పేరుతోనున్న తెరమాయి తీర ప్రాంతంలో ఉంది. కాలం: క్రీ.శ. 51. పౌలు రాసిన మొదటి లేఖలలో ఇదొకటి.

రచయిత: పౌలు.

చారిత్రక నేపథ్యము: పౌలు తెస్సలోనికలో ఉన్నప్పుడు యూదుల వలన చాలా ఇబ్బందు లెదుర్కొన్నాడు.  ప్రతికూల వాతావరణంలో అనేక నిందలు మోశాడు.  యూదులు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేశారు (1 తెస్స. 2:3-7). చక్రవర్తికి విరోధి అని కూడా ప్రచారం చేశారు (అ.కా. 17:5-9). ఈ నేపథ్యంలో తెస్సలోనిక క్రైస్తవులకు నిజ దేవుని గురించిన సత్యాలను మరొకమారు రూఢిపరచడానికి ఈ లేఖను రాశాడు (1 తెస్స. 2:14-16). క్రీస్తు రెండవ రాకడనుగూర్చి తలెత్తిన అపోహలను నివృత్తి చేశాడు. అన్య దేవతల ఆరాధనలను ఖండించాడు.

ముఖ్యాంశములు: పౌలు తెస్సలోనికలో తలెత్తిన సమస్యలకు పరిష్కారాలు చూపించాడు. వాటిల్లో ముఖ్యమైనవి: 1) పునరుత్థానం  (4:13-18); 2)  ప్రభువు రాకడ  (5:1-11); 3)  ప్రభువు దినము (5:2); 4) కడరా దినము; 5) దైవరక్షణ ప్రణాళిక; 6) మతాచరణకు మంచి సలహాలు; 7) నైతిక జీవనము – సలహాలు (5:12-22) . గ్రంథంలోని ప్రేరణాత్మక అంశాలు: వేదహింసలలో ధైర్యం, ఆదర్శవంతమైన దైవసేవ.

క్రీస్తు చిత్రీకరణ: సమస్యలు, సందేహాలకు క్రీస్తే సమాధానం, ఆధారం. క్రీస్తు రక్షణ (1:10; 5:4-11), ప్రతిఫలము నిచ్చువాడు (1:9); పరిపూర్ణం చేయువాడు (3:13); పునరుత్థానులను చేయువాడు (4:13-19). సంపూర్ణ పరిశుద్ధతను ప్రసాదించువాడు (5:23).