ద్రాక్షతీగ ఉపమానము
15 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:
2. ”నరపుత్రుడా!
అడవిలోని చెట్లకొయ్యతో పోల్చినచో,
ద్రాక్షకొయ్య ఎందుకైన పనికి వచ్చునా?
3. దాని కొయ్యతో ఏ పరికరమునైన చేయుదురా?
అది వస్తువులను తగిలించుటకు
కనీసము మేకుగానైన ఉపయోగపడునా?
4. అది పొయ్యికే సరిపడునుకదా!
రెండుకొనలును కాలి మధ్యభాగము
మాడిపోయినపుడు అది ఎందుకును పనికిరాదు.
5. అది కాలకముందే నిరుపయోగమైనది.
అగ్గి దానిని కాల్చిమాడ్చిన తరువాత
అది దేనికి పనికివచ్చును?
6. యావే ప్రభువు పలుకులివి:
నరులు అడవిలోని ద్రాక్షకొయ్యను కాల్చివేసినట్లే,
నేను యెరూషలేము ప్రజలను దండింతును.
7. వారొక అగ్గిని తప్పించుకొనిరి.
కాని ఇపుడు నూతన అగ్ని వారిని దహించును.
నేను వారిని శిక్షించినపుడు
నేను ప్రభుడనని మీరు గ్రహింతురు.
8. వారు నాకు ద్రోహముచేసిరి.
కనుక నేను వారి దేశమును ఎడారి చేయుదును.
ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”