పౌలు ఆధిక్యము

10 1. పౌలునగు నేను మీకు ఒక విన్నపము చేయు చున్నాను. మీతో ఉన్నప్పుడు సాధువుననియు, సాత్వి కుడననియు, మీకు దూరముగ ఉన్నపుడు ధైర్య శాలిననియు నన్ను గూర్చి చెప్పుచుందురు గదా! కనుక, క్రీస్తు సాత్వికముతోను, మృదుత్వముతోను మిమ్ము ఇట్లు వేడుకొనుచున్నాను.

2. నేను అచటకు వచ్చినపుడు మీతో కఠినముగ ఉండునటుల చేయకుడు. లౌకికమగు తలంపులతో మేము ప్రవర్తించు చున్నామని సందేహించువారితో నేను కఠినముగ ప్రవర్తింపగలననునది నాకు నిశ్చయమే.

3. మేమును ఈ ప్రపంచమున నివసించుచున్నామను మాట నిజమే. కాని మేము ప్రాపంచికమగు తలంపులతో పోరాటమును సలుపుట లేదు.

4. మా పోరాటములో మేము ఉపయోగించు సాధనములు ప్రాపంచికములు కావు. అవి దుర్గములను కూడ ధ్వంసమొనర్చగల శక్తిమంతమగు దేవుని ఆయుధములు. అసత్య వాదములను మేము నాశనము చేయుదుము.

5. మేము వితండవాదములను, దైవజ్ఞానమునకు అడ్డు నిలుచు ప్రతిఆటంకమును త్రోసివేయుదుము. ఆలోచనలను బంధించి క్రీస్తునకు విధేయములుగ చేయుదుము.

6. మీరు మీ సంపూర్ణ విధేయతను నిరూపించిన తరువాత, ఎట్టి అవిధేయతతో కూడిన పనినైనను శిక్షింప సిద్ధమగుదుము.

7. మీ కన్నులఎదుట ఉన్నదానిని చూడుడు. ఎవడైనను తాను క్రీస్తునకు చెందినవాడనని చెప్పు కొనినచో, తనవలె మేమును ఆ క్రీస్తునకు చెందిన వారమని ఎరుగవలెను.

8.ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను, దానికొరకు సిగ్గుపడుటలేదు. ఆ అధికారము మీ ప్రసిద్ధికొరకేకాని, మిమ్ము నాశనము చేయుటకు కాదు.

9. నా లేఖలతో మిమ్ము భయపెట్టుటకు ప్రయత్నించుటలేదు.

10. ”పౌలు జాబులు తీవ్రముగను, కఠినముగను ఉండును. కాని, తానే స్వయముగా మనతో ఉన్నపుడు అతడు బలహీనుడు. అతని మాటలు ఎందులకును కొరగావు!” అని ఎవడైన పలుకవచ్చును.

11. దూరమున ఉన్నప్పుడు మేము ఏమి వ్రాయుదుమో దగ్గర ఉన్నప్పుడు అదియే చేయుదుమని అట్టివాడు గ్రహింపవలెను.

12. నిజమునకు తమను గూర్చి అంత గొప్పగ నెంచుకొను వ్యక్తులతో మమ్ము జతపరచుకొనుటకు గాని, పోల్చుకొనుటకుగాని మేము సాహసింపము.  వారు ఎంత అవివేకులు! తమను ఎంచుకొనుటకు వారు స్వకీయ ప్రమాణములను ఏర్పరచుకొందురు. అి్ట ప్రమాణములతోనే తమను పోల్చుకొందురు.

13. మేము మాత్రము పరిమితిమించి పొగడుకొనము. దేవుడు మాకు నిర్ణయించిన పని పరిమితిలోనే అది నిలిచిపోవును. మేము మీ మధ్య చేయుపనియు అందులోనిదే.

14. మీరు ఆ పరిమితిలోనివారే అగుటచే, క్రీస్తును గూర్చిన సువార్తతో మేము అటకు వచ్చినపుడు మేము ఆ పరిమితులను అతిక్రమింపలేదు.

15.  దేవుడు మాకు నిర్ణయించిన పరిమితులను దాటి ఇతరులు చేసిన పనులను గూర్చి మేము గొప్పలు చెప్పము. అంతేకాక, మీ విశ్వాసము వర్ధిల్లి, మీ మధ్య మేము పనిచేయవలసిన క్షేత్రము పెరగగలదని ఆశించుచున్నాము. ఎట్లయినను సర్వదా మా కార్య ములు అన్నియు దేవుడు విధించిన పరిమితుల లోపలనే ఉండును.

16. అప్పుడే మిమ్ము దాటి దేశాంతరములందు సహితము ఈ సువార్తను బోధింప గలుగుదుము. అందువలన అన్యుల పరిధిలో పూర్వమే సాధింపబడిన పనిని గూర్చి మేము పొగడు కొనవలసిన అవసరము ఉండదు.

17. కాని లేఖనము చెప్పుచున్నట్లు, ”గొప్పలు చెప్పుకొనదలచినవాడు. ప్రభువునందే గొప్పలు చెప్పుకొనవలెను”  

18. దేవుడు అతనిని ఆమోదించిననాడే ఏ వ్యక్తి యైనను నిజముగ ఆమోదింపబడినవాడు అగును. కాని, తనను గూర్చి తాను గొప్పగ తలంచినంత మాత్రమున ఆమోదమును పొందడుగదా!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము