పెయోరు సంఘటన

25 1. యిస్రాయేలీయులు షిత్తీమున విడిదిచేసిరి. అచట వారు మోవాబీయుల స్త్రీలతో వ్యభిచారము చేసిరి.

2. ఆ స్త్రీలు వారి దేవతలకు బలులర్పించుచు యిస్రాయేలీయులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవ ములో పాల్గొని నైవేద్యములు భుజించిరి. వారి దేవత లను ఆరాధించిరి.

3. ఈ విధముగా యిస్రాయేలు మోవాబీయులు కొలుచు పెయోరుబాలు దేవతను ఆరాధింపగా ప్రభువు మహోగ్రుడయ్యెను.

4. ప్రభువు మోషేతో ”యిస్రాయేలు నాయకులను పట్టుకొని బహిరంగముగా పట్టపగలు ఉరితీయుము. అప్పుడుగాని నా కోపము చల్లారదు” అని చెప్పెను.

5. కనుక మోషే న్యాయాధిపతులను చూచి ”మీరు మీ మీ తెగలలో పెయోరుబాలును ఆరాధించిన వారినందరిని వధింపుడు” అని ఆజ్ఞ యిచ్చెను.

6. మోషే మరియు యిస్రాయేలు సమాజమువారు సాన్నిధ్యపుగుడార ద్వారము ముందట ప్రోగై బహుగ పరితపించుచుండిరి. అంతట వారందరు చూచు చుండగానే ఒక యిస్రాయేలీయుడు  తన సహోదరుల యొద్దకు మిద్యాను స్త్రీ నొకతెను తోడుకొనివచ్చెను.

7. అది చూచి అహరోను మనుమడును ఎలియెజెరు కుమారుడునగు యాజకుడైన ఫీనెహాసు, యిస్రాయేలు సమావేశము నుండి కదలి వచ్చెను.

8. అతడు ఈటెను చేతగొని ఆ స్త్రీ పురుషులను వెంబడించెను. వారి శయనస్థలమున ప్రవేశించి ఈటెతో వారిరువురిని అనగా ఆ యిస్రాయేలీయుని, ఆ స్త్రీని కడుపు గుండా దూసుకుపోవునట్లు ఒక్కపోటుతో పొడిచెను. దానితో యిస్రాయేలీయులను పీడించు జాడ్యము ఆగిపోయెను.

9. కాని ఆ జాడ్యమున చిక్కి మరణించిన వారు ఇరువదినాలుగువేల మంది.

10-11. ప్రభువు మోషేకు ఇట్లు చెప్పెను, ”యాజకుడైన అహరోను మనుమడును, ఎలియెజెరు కుమారుడునైన ఫీనెహాసు యిస్రాయేలీయుల మధ్య నేను ఓర్వలేని దానిని, తానును ఓర్వలేకపోవుట వలన వారిమీదినుండి నా కోపము మళ్ళించెను కనుక నేను ఓర్వలేకయుండియు యిస్రాయేలీయులను నశింప జేయలేదు.

12. అతనితో నేను శాంతినిబంధనము చేసికొనుచున్నానని చెప్పుము.

13. ఫీనెహాసు అతని తరువాత అతని సంతతివారు కలకాలము నాకు యాజకులు అగుదురు. అతడు నన్నుకాదని అన్య దైవతములను కొలువనీయలేదు కనుక, ప్రజల పాపమునకు పరిహారము చేసెను  కనుక ఈ నిత్యమైన యాజకనిబంధనను బహుమానముగా బడయును”  అని చెప్పెను.

14. మిద్యాను స్త్రీతో చంపబడిన యిస్రాయేలీ యుడు సాలు కుమారుడు సిమ్రీ. అతడు షిమ్యోను తెగలోని కొన్ని కుటుంబములకు నాయకుడు.

15. ఆ స్త్రీ పేరు కోస్బీ. ఆమె తండ్రి సూరు. అతడు మిద్యానీయులలో ఒక తెగకును, తన పితరుల కుటుంబమునకును నాయకుడు.

16-17. ప్రభువు మోషేతో ”మిద్యానీయులను ముట్టడించి మొదలంట నాశనము చేయుము.

18. వారు పెయోరువద్ద మిమ్మును దుర్బుద్ధితో మోసగించిరి. పెయోరు అంటురోగము మీకు సోకిననాడు, హత్య చేయబడిన మిద్యానీయుల ఆడుపడుచును, మిద్యాను నాయకుడి కుమార్తెయుయైన కోస్బీవలన మీరు భ్రష్టులై పోతిరి” అని చెప్పెను.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము