ఉపోద్ఘాతము:
పేరు: ‘గలతి’ ఆసియాలో ఒక తెగ పేరు. ఇది ఒక వ్యక్తి పేరై కూడా వుండవచ్చును. గలతి రోమా సామ్రాజ్యంలో పెద్ద పట్టణం. ఇది నేటి టర్కి దేశంలో వున్నది. పౌలు తన మొదటి సువార్త ప్రేషిత కార్యంలో బర్నబాతో కలిసి గలతిలో గడిపాడు (1:2; అ.కా. 13:13-14; 1 పేతు. 1:1; 2 తిమో. 4:10).
కాలము: క్రీ.శ. 52-56.
రచయిత: పౌలు (1:1). రచయిత గలతి క్రైస్తవ సంఘంతో బాగా పరిచయం వున్నవాడు (2:1-10; 3:1; 4:12-20; 6:17). తాను అపోస్తలుడనని పౌలు చెప్పుకున్నాడు (1:15-16). గలతిలోని క్రైస్తవ సంఘాలకు పునాదులు వేసినవాడు (1:8-9; 4:19).
చారిత్రక నేపథ్యము: ఏ జాతియైనా తన వారసత్వ సంపద, పుణ్యకార్యాలవల్లనే కాక, క్రీస్తు ప్రభువును విశ్వసించడంవల్ల రక్షింపబడుతుందని పౌలు నిత్యం బోధించేవాడు. కాని యూదాక్రైస్తవులు మాత్రం అన్యులు క్రైస్తవ విశ్వాసాన్ని పొందాలంటే సున్నతి ప్రక్రియ తప్పనిసరియని వాదించారు (5:2-3; 6:12-13). ధర్మశాస్త్రాన్ని పాటించడం వలననే రక్షణ పొందుతారని చెప్పనారంభించారు (అ.కా. 15:1,5). ఈ వాదోపవాదాల వలన గలతి సంఘంలో కలవరం కలిగింది (1:7; 5:10-12). ఈ యూదయ వాదులు క్రీస్తునే మార్చడానికి పూనుకున్నారు. పౌలు గురించి కూడా కొంత వ్యతిరేక ప్రచారం సాగింది. వీటన్నిటికి పౌలు సమాధానాలిచ్చాడు.
ముఖ్యాంశములు: పౌలు ఈ లేఖ ద్వారా క్రైస్తవత్వంలోని నూతనత్వం, వ్యక్తిగత విశ్వాస ప్రాధాన్యత, దేవుని ప్రజల సభ్యత్వం, సామూహిక విశ్వాస సాక్ష్యం, సంఘంలో వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాలను బోధించాడు. సువార్త అనేది ఒక్కటే (1:6-24). ధర్మశాస్త్రం – విశ్వాసం, వాగ్దానం (3:1-29), ఆత్మ-శరీరం (4:1-7; 5:16-26), స్వేచ్ఛా సంరక్షణ (5:1-15) మరియు పరస్పర సహాయము (6:1-10) అనే అంశాలు.
క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు ఈ గ్రంథంలో చూపినట్టుగా విశ్వాసులను ధర్మశాస్త్రము, పాపపుదాస్యము నుండి రక్షించి స్వతంత్రులనుగా చేస్తారు. క్రీస్తు సిలువబలి పాపము, స్వార్థము వంటి శాపాల నుండి విమోచిస్తుంది (1:4; 2:20; 3:13; 4:3; 5:24; 6:14).