దాన విధానము

6 1. ”మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తికార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టిబహుమానమును పొందలేరు.

2. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను, వీధులలోను డాంబికులు  చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయ వలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను.

3. నీవు దానము చేయునపుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమచేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము.

4. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొస గును.

ప్రార్థనా విధానము (లూకా 11:2-4)

5. ”కపట భక్తులవలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనామందిరములలో, వీధులమలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్థనలుచేయుట వారికి ప్రీతి. వారికి తగినఫలము లభించెనని మీతో వక్కా ణించుచున్నాను.

6. ప్రార్థన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడై యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును.

7. అన్యులవలె అనేక వ్యర్థపదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు.

8. కాబట్టివారివలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఎరిగియున్నాడు.

9. మీరిట్లు ప్రార్థింపుడు: ‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పవిత్రపరుపబడునుగాక!

10. నీ రాజ్యము వచ్చునుగాక! నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక! 11. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము.

12. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పు లను క్షమింపుము.

13. మమ్ము శోధనలో చిక్కు కొననీయక, దుష్టునినుండి రక్షింపుము’.

14. పరులు చేసిన దోషములను మీరు క్షమించినయెడల, పరలోక మందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును.

15. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు.

ఉపవాస విధానము

16. ”మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై  విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను.

17. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము.

18. అందువలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు  నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును.

స్వర్గ సంపదలు (లూకా 12:33-34)

19.  ”ఈ లోకములోసంపదలు కూడబెట్టు కొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తిని వేయును. దొంగలు కన్నమువేసి దోచుకొందురు.

20. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టు కొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నమువేసి దోచుకొనరు.

21. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును.

వెలుగునీడలు (లూకా 11:34-36)

22. ”నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను తేటగానున్నచో, నీ దేహమంతయు కాంతి మంతమైయుండును.

23. నీ కన్ను దుష్టమైనచో, నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో, ఆ చీకటిమహాఘోరమైనది!”

దైవము ధనము (లూకా 16:13; 12:22-31)

24. ”ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును. మరియొకనిని ప్రేమించును, ఒకనిని నమ్ముకొని,  మరియొకనిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును, ధనమును సేవింపజాలవు.

చింతలు వంతలు (లూకా 12:22-31)

25. ”కావున వినుడు. ఏమి తినెదమా? ఏమి త్రాగెదమా? ఏమి ధరించెదమా? అని మీ ప్రాణమును గూర్చి వెతచెందకుడు. మీ ప్రాణము ఆహారముకంటె, మీ దేహము వస్త్రములకంటె  విలువయైనవికావా?

26. ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు. నూర్పిడులు చేయుటలేదు. గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షులకంటె మీరు విలువైన వారు కారా?

27. మీలో ఎవరైన ఆందోళనతో ఆయువును మూరెడైనను పెంపొందింపజేసికొన గలరా?

28. మీరు వస్త్రములకై తహతహపడనేల? లిల్లీ పుష్పములు పెరుగురీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుట లేదు. వస్త్రములను వడుకుకొనుటలేదు గదా!

29. సకల వైభవసమేతుడగు సొలోమోను సైతము వీనిలో ఒక్కదానివలెనైనను అలంకరింపబడ లేదు.

30. అల్పవిశ్వాసులారా! నేడుపుట్టి, రేపు పొయ్యిమంటలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా, అంతకంటె ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా?

31. కావున, ఏమి  తినెదమా?  ఏమి  త్రాగెదమా?  ఏమి ధరించెదమా? అని మీరు కలత చెందకుడు.

32. వీనినన్నింటిని అన్యులు కాంక్షింతురు. ఏలయన, పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్ల గుర్తించును.

33. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును.

34. రేపటినిగూర్చి మీరు విచారింపవలదు. ఎందుకనరేపటికి విచారములు రేపికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును.