యోహాను సందేశము

(మత్తయి 3:1-12; లూకా 3:1-20; యోహాను 1:19-28)

1 1. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము.

2. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున:

               ”ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు 

               నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను.

3.           ‘ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు.

               ఆయన త్రోవను తీర్చిదిద్దుడు’

               అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను.”

4. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకించు చుండెను.

5. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చు చుండెను.

6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టీని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను.

7.            ”నాకంటె శక్తిమంతుడొకడు

               నా వెనుక రానున్నాడు.

               నేను వంగి ఆయన పాదరక్షలవారును

               విప్పుటకైనను యోగ్యుడనుకాను.

8.           నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని,

               కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో

               స్నానము చేయించును”

అని యోహాను ప్రకటించుచుండెను.

యోర్దానునదిలో యేసు బప్తిస్మము

(మత్తయి 3:13-17 లూకా 3:21-22; యోహాను 1:29-34)

9. ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మము పొందెను.

10. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువ బడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుట చూచెను.

11. అప్పుడు పరలోకమునుండి ఒక వాణి ”నీవు నా ప్రియమైన కుమారుడవు.  నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను” అని వినిపించెను.

ఎడారిలో శోధన

(మత్తయి. 4:1-11 లూకా 4:1-13)

12. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకొనిపోయెను.

13. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు నలువదిదినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి.

గలిలీయ ప్రాంతము – క్రీస్తు ప్రబోధము

(మత్తయి 4:12-17;లూకా4:14-15; 5:1-11)

14. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలీయసీమకు వచ్చి, 15. ”కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు” అని దేవుని సువార్తను ప్రకటించెను.

బెస్తలను పిలుచుట

16. యేసు గలిలీయ సరస్సు తీరమున వెళ్ళు చుండగా, వలవేసి చేపలనుపట్టు సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూచెను. వారు జాలరులు.

17. ”మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను” అని యేసు వారితో పలికెను, 18. వెంటనే వారు తమవలలను విడిచి పెట్టి, ఆయనను వెంబడించిరి.

19. అచటనుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగుచేసికొనుచున్న జెబదాయి కుమారుడగు యాకోబును, అతని సోదరుడు యోహానును చూచి, 20. వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచి పెట్టి ఆయనను అనుసరించిరి.

దయ్యము పట్టిన వాడు

(లూకా 4:31-37)

21. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతిదినమున ప్రార్థనామందిరమున ప్రవేశించి బోధింపసాగెను. 22. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన, ధర్మశాస్త్రబోధకుల వలెగాక,  అధికార పూర్వకముగ ఆయన బోధించెను.

23. అప్పుడు ఆ ప్రార్థనామందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, 24. ”నజరేతు నివాసియగు యేసూ! మాతో నీ కేమిపని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి” అని అరచెను.

25. ”నోరు మూసికొని వీనినుండి వెడలిపొమ్ము” అని యేసు దానిని గద్దింపగా, 26. అది వానిని విలవిలలాడించి, బిగ్గరగా అరచి వదలిపోయెను.

27. అంతట అచ్చటి వారందరును ఆశ్చర్యపడి, ”ఇది యేమి? ఈ నూతన బోధయేమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి!” అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. 28. ఆయన కీర్తి గలిలీయ ప్రాంతమంతట వ్యాపించెను.

ఆరోగ్య ప్రదానము

(మత్తయి 8:14-17; లూకా 4:38-41)

29. పిదప యేసు ఆ ప్రార్థనామందిరమునుండి యాకోబు, యోహానులతో తిన్నగా సీమోను, అంద్రెయల ఇంటికి పోయెను.

30. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచముపట్టియుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి.

31. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతినిపట్టి లేపగా, జ్వరము వీడిపోయెను. అంతట ఆమె వారికి పరిచర్యచేయ సాగెను.

32. సాయంసమయమున ప్రజలు సకలవ్యాధి గ్రస్తులను, దయ్యము పట్టినవారిని యేసు వద్దకు తీసికొని వచ్చిరి. 33. ఆ పురవాసులందరు ఆ ఇంటి వాకిట గుమిగూడిరి.

34. అపుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరిని యేసు స్వస్థపరచి, పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగియుండుట వలన ఆయన ఆ దయ్యములను మాటాడనీయలేదు.

వేద ప్రచారము

(మత్తయి 4:23-25 లూకా 4:42-44)

35. ఆయన వేకువ జాముననే లేచి, ఒక నిర్జన ప్రదేశమునకు పోయి, ప్రార్థనచేయనారంభించెను.

36. సీమోను, అతని సహచరులును, ప్రభువును   వెదకుచు వెళ్ళి, 37. ఆయనను కనుగొని, ”అందరు మిమ్ము వెదకుచున్నారు” అని చెప్పిరి.

38. ”మనము పరిసర గ్రామములకు పోవుదమురండు. అచట కూడ నేను సువార్తను ప్రకటింపవలయును. ఇందు కొరకే  నేను బయలుదేరి వచ్చితిని” అని ఆయన వారితో చెప్పెను.

39. ఆయన ప్రార్థనామందిరములలో సువార్తనుప్రకటించుచు, దయ్యములను వెడలగొట్టుచు, గలిలీయ సీమయందంతట పర్యటించెను.

కుష్ఠరోగికి స్వస్థత

(మత్తయి 8:1-4; లూకా 5:12-16)

40. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువుఎదుట మోకరించి, ”నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు” అని ప్రాధేయపడెను.

41. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి ”నాకు ఇష్టమే శుద్ధిపొందుము” అనెను.

42. వెంటనే అతని కుష్ఠరోగము తొలగి పోయెను. అతడు శుద్ధుడయ్యెను.

43. యేసు అపుడు ”నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు” అనిగట్టిగా ఆజ్ఞాపించి, 44. ”నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా  మోషే ఆజ్ఞానుసారము  కానుకలను చెల్లించుకొనుము” అని వానిని పంపివేసెను.

45. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందు వలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జనప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చు చుండిరి.