మారిన జీవితములు

4 1.  శారీరకముగ  క్రీస్తు  కష్టముల పాలయ్యెను. కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడ ఆత్మ స్థిరత్వమును పొందవలెను. ఏలయన, శారీరకముగ కష్టపడు వాడు పాప జీవితమును విడనాడిన వాడగును.

2. కనుక ఇప్పటినుండి మీ ఐహిక జీవితములను దేవుని సంకల్పమునకు అనుగుణముగ గడపుడు. లౌకిక వ్యామోహములకు  లోనుగాకుండుడు.

3. ఏలయన, గతమున అన్యులవలెనే మీరును ఎంతయో కాలము గడపితిరి. లజ్జా విహీనముగ జీవించితిరి. మోహపరవశులైతిరి. త్రాగుబోతులైతిరి. త్రుళ్ళుచు విందులు చేసితిరి. అసహ్యకరమగు విగ్రహారాధనలు కావించితిరి.

4. మీరు వారితో కలసి విచ్చలవిడిగ నిర్లక్ష్యమైన జీవితమును దైవదూషణమును చేయకుండుటచే వారు ఆశ్చర్యచకితులైరి. 

5. కాని, దేవునియెదుట సమాధానము చెప్పుకోవలసి ఉన్నది. ఆయన సజీవులకును, మృతులకును న్యాయనిర్ణయ మొనర్ప సిద్ధముగా ఉన్నాడు.

6. ఇందువలననే మృతులకు కూడ సువార్త బోధింపబడినది. అందరివలెనే వారి ఐహిక జీవితమున వారును తీర్పునకు గురియైరి. కాని వారి ఆత్మ సంబంధమైన జీవనమునందైనను వారు దేవునివలె జీవింపగలుగుదురని అది వారికి బోధింపబడినది.

దేవుని వరము, ఉత్తమ నిర్వాహకులు

7. అన్నిటికిని తుది సమయము ఆసన్నమైనది. మీరు స్వస్థబుద్ధి గలిగి, మెలకువతో ప్రార్థింపగలిగి ఉండవలెను.

8. అన్నిటికంటె ముఖ్యముగ ఒకరి యెడల ఒకరు ఎక్కువగ ప్రేమకలవారై ఉండుడు. ఏలయన, ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును.

9. సణుగుకొనక, ఒకరికి ఒకరు ఆతిథ్యమొసగుడు.

10. పలురకములైన దేవునివరములకు ఉత్తమ నిర్వాహకులవలె, ప్రతివ్యక్తియు, దేవునినుండి తాను పొందిన విశేష కృపావరమును ఇతరుల మేలుకై ఉపయోగింపవలెను.

11. ఉపదేశించు వాడెవ్వడేని, దేవునివాక్కునే ఉపదేశింపవలెను. సేవయొనర్చు వాడెవ్వడేని, దేవుడాతనికొసగిన శక్తితోనే సేవింపవలెను. అట్లయినచో మనము సర్వ విషయములందును యేసుక్రీస్తుద్వారా దేవుని స్తుతింపగలుగుదుము. ఆయనకు సర్వదా మహిమయు, ప్రభావము కలుగునుగాక! ఆమెన్‌.

క్రీస్తు పేరిట కష్టములు

12. ప్రియ మిత్రులారా! మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురియై కష్టపడుచున్నారు. కాని అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకుడు.

13. అంతేకాక, క్రీస్తు బాధలలో పాలుపంచుకొనుచుంటిమని ఆనందింపుడు. దానివలన ఆయన మహిమ ప్రదర్శింపబడిననాడు మీరు మహానందమును అనుభవింపగలరు.

14. క్రీస్తు అనుచరులని మీరు అవమానింపబడినచో మీరు ధన్యులు. ఏలయన, ఆ మహిమోపేతమగు దేవుని ఆత్మ మీయందు చేరియున్నదని దాని  భావము.

15. హంతకుడిగ, దొంగగ, దోషిగ ఇతరుల వ్యవహారములలో జోక్యమొనర్చుకొనిన వాడుగ, మీలో ఎవ్వడును, బాధపడతగదు.

16. అయినను, క్రైస్తవుడైనంత మాత్రమునకే మీరు కష్టపడవలసి వచ్చినచో దానికి సిగ్గు పడకుడు. అంతేకాదు. మీరు క్రీస్తు నామమును ధరించినందుకు దేవునకు  కృతజ్ఞతలను అర్పింపుడు.

17. తీర్పు ప్రారంభమగుసమయము ఆసన్నమైనది. దైవప్రజలే ముందుగ తీర్పునకు గురియగుదురు. అది మనతోడనే మొదలైనచో దేవుని సువార్తను విధేయింపనివారి గతియేమి?

18.”నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైనచో; భక్తిహీనులు, పాపాత్ములు అగువారి గతిఏమి?”

19. కనుక, దేవుని చిత్తప్రకారము బాధల ననుభవించువారు సత్ప్రవర్తన కలవారై నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము