యోనా ప్రభువుమాట మీరుట

1 1. ప్రభువువాణి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, 2. ”నీవు ఆ పెద్దనగరమైన నీనెవెకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌష్ట్యము నా దృష్టికి ఘోరమాయెనని చెప్పుము” అని పలికెను.

3. కాని యోనా ప్రభువు చెంతనుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకోనెంచెను. అతడు యొప్పేకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్షీషునకు వెళ్ళు టకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కెను. ప్రయాణీకులతో పాటు తర్షీషు చేరుకొని, ప్రభువు చెంతనుండి తప్పించుకోవచ్చునని అతని తలంపు.

4. కాని ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బ్రద్దలగునట్లు ఉండెను.

5. నావికులు భయపడి ఒక్కొక్కడు తనతన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు  దానిలోని సరకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను.

6. ఓడ అధిపతి అతనిని చూచి ”ఓయి! నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశ, నీ దేవుడు నీ మొరనాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును” అనెను.

7. నావికులు మనము చీట్లువేసి ఈ దురదృష్ట మునకు కారకులెవరో తెలిసికొందము అనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను.

8. కావున వారతనిని చూచి ”ఓయి! ఈ దురదృష్టము మా మీదికి ఎవరివలన వచ్చినదో చెప్పుము. నీవు ఇచటేమి చేయు చున్నావు? ఎచినుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? జాతియేది?” అని ప్రశ్నించిరి.

9. అతడు ”నేను హీబ్రూజాతివాడను. సముద్ర మునకును, భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన ప్రభునియందు భయభక్తులు గలవాడను” అని చెప్పెను.

10. అతడు దేవుని సన్నిధినుండి పారిపో వుచున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికా సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి ‘నీవెంత పని చేసితివి?’  అనిరి.

11. క్షణక్షణము తుఫాను పెరిగిపోవుచుండెను.  ”సముద్రము మామీదకి రాకుండ శాంతించుటకుగాను మేము నిన్నేమి చేయవలయునో చెప్పుము” అనిరి.

12. యోనా ”మీరు నన్ను సముద్ర మున పడవేసి నచో అది శాంతించును. నా మూలము ననే ఈ పెను తుఫాను పట్టుకొనినది” అని అనెను.

13. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్లువేసిరి. కాని తుఫాను ఇంకను అధికమగుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు.

14. కనుక వారు ప్రభువునుద్దేశించి ”ప్రభూ! మేమితని ప్రాణములు తీసినందులకుగాను నీవు మమ్ము నాశ నము చేయవలదు. మేము నిర్దోషిని చంపితిమని మామీద నేరము మోపవలదు. నీవు నీ యిష్టము వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చెయిదము” అని ప్రార్థించిరి.

15. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి.  అది వెంటనే శాంతించెను.

16. ఆ సంఘటననుగాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలిభయపడిరి. ప్రభువునకు బలి నర్పించి మొక్కుబడులు చేసికొనిరి.   

17. ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మ్రింగివేసెను. అతడు మూడు దిన ములు చేప కడుపులోనుండెను.

Previous                                                                                                                                                                                                    Next