నిందలు మోపువారిమీద ప్రతీకారము

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

64 1.      దేవా! నేను ఆపదలో చిక్కి

                              నీకు మొరపెట్టుకొనుచున్నాను, వినుము.

                              శత్రుభయము నుండి నన్ను సంరక్షింపుము.

2.           దుర్మార్గుల పన్నాగమునుండి నన్ను కాపాడుము.

               దుష్టబృందముల నుండి నన్ను రక్షింపుము.

3.           వారు తమ వాక్కులకు

               కత్తులకువలె పదును పెట్టుచున్నారు.

               క్రూరమైన పలుకులను,

               బాణములవలె గుప్పించుచున్నారు.

4.           చాటున దాగియుండి, భయము

               ఏ మాత్రములేక, నిర్దోషులమీద దిడీలున

               అంబులు రువ్వుచున్నారు.

5.           తమ దుష్కార్యములను గూర్చి ఒకరి నొకరు

               హెచ్చరించుకొనుచున్నారు.

               మోసపూరితమైన కుట్రలను

               ఎక్కడ పన్నుదమాయని

               తమలో తాము చర్చించుకొనుచున్నారు.

               ”మనలను ఎవ్వరు చూచెదరు?

6.           చెడుపన్నాగములు పన్ని మనము

               బాగుగా కుతంత్రములు పన్నితిమి”

               అని చెప్పుకొనుచున్నారు.

               మనిషి హృదయము మరియు 

               మనస్సు చాలా లోతైనవికదా!

7.            కాని దేవుడు వారిమీద తన బాణములు రువ్వును.

               వారు హఠాత్తుగా గాయపడుదురు.

8.           వారి పలుకులకుగాను

               దేవుడు వారిని నాశనము చేయును.

               వారిని చూచువారెల్ల

               ఆశ్చర్యముతో తల ఊపుదురు.

9.           అపుడు అందరు భయపడుదురు.

               దేవుని కార్యములను గూర్చి మ్లాడుదురు.

               అతని కార్యములను తలపోయుదురు.

10.         పుణ్యపురుషులు దేవుని తలంచుకొని

               ఆనందింతురు, అతనిని ఆశ్రయింతురు.

               సత్పురుషులు అతనిని స్తుతింతురు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము