ఉపోద్ఘాతము:

పేరు:‘తిమోతి’ అనగా ”దేవుణ్ణి గౌరవించడం” అని అర్థం. బైబులులో ఈ పేరుగల వారు ఇద్దరు కనబడతారు. ఒకరు మక్కబీయుల కాలంలో (1 మక్క 5:6-8; 2 మక్క 8:30-33), మరొకరు పౌలుకు ప్రీతిపాత్రుడు, ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు (1 కొరి. 4:17; 1 తిమో. 1:2). పౌలు అనుమతితో సున్నతి చేయించుకున్నాడు (అ.కా. 16:1-3). పౌలు లేఖలు రాయడానికి సాయపడ్డాడు (1 తెస్స. 1:1; 2 కొరి. 1:1). పౌలు రాసిన రెండు లేఖలు తిమోతి పేరుమీదనే ఉండడం గమనార్హం. తిమోతి లికోనియాలోని లిస్త్రా గ్రామానికి చెందినవాడు. తల్లి యునిసు, అమ్మమ్మ పేరు లోయి, (ఈమెయే మొదట) క్రైస్తవురాలుగా మారింది (2 తిమో. 1:5). పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన  రాయబారిగా పంపాడు. తిమోతి బానిసగా రోముకు చేరాడు. ఆ పిమ్మట ఎఫేసు, తెస్సలోనిక సంఘాలలో పనిచేశాడు.

కాలము: పౌలు తన మరణానికి ముందు క్రీ.శ. 63-67 లో వ్రాసాడని భావిస్తారు.

రచయిత: పునీత పౌలు.

చారిత్రక నేపథ్యము: పౌలు కారాగారం నుంచి విడుదలయ్యాక తిరిగి ఎఫెసుకు వచ్చి తిమోతితో కొంతకాలం గడిపి, తిమోతిని అచ్చటనే వుంచి తను మాసిడోనియాకు వెళ్లాడు (1 తిమో. 1:3). ఈ సమయంలో కొందరు తప్పుడు బోధలు చేసి గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో నిజమైన విశ్వాస జీవితం పటిష్టం చేయడానికి పౌలు ఈ లేఖను రాశాడు.

ముఖ్యాంశాలు:  సంఘాలలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నాయకత్వం అనే అంశాలపై విభేదాలు తొలగించి క్రైస్తవ విలువలు ఆధారంగా సిద్ధాంతాలు సూచించాడు. ఈ సూచికలు పవిత్రాత్మ ప్రేరణతో చేసినవి. దేవుని సంఘ ప్రజల (3:15) మేలు పౌలు ప్రధాన ఆశయం (4:1-4; 2 తిమో. 3:1-9).

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తి (2:5). క్రీస్తు ఆత్మీయ శక్తి, విశ్వాసము, ప్రేమకు నివాసం (1:12, 14). పాపులను రక్షించడానికి లోకంలో జన్మించారు (1:15). పాపవిమోచనకు క్రీస్తు క్రయ ధనము చెల్లించారు (2:6). క్రీస్తు అందరికి రక్షకుడు (4:10).