స్తుతిగీతము

25 1.      ప్రభూ! నీవే నాకు దేవుడవు.

                              నేను నిన్ను హెచ్చించి కీర్తింతును.

                              నీవు పూర్వమే చేసిన నిర్ణయములనెల్ల

                              నమ్మదగినతనముతో నెరవేర్చితివి.

2.           నీవు నగరములను శిథిలముగావించితివి.

               సురక్షితనగరములను దిబ్బలు చేసితివి.

               గర్వాత్ములు నిర్మించిన ప్రాసాదములు

               నాశనమయ్యెను, వానిని మరల కట్టబోరు.     

3.           బలాఢ్యులైన ప్రజలు నిన్ను కీర్తింతురు.

               క్రూరులపట్టణములు  నిన్ను చూచి భయపడును.

4.           పేదలు నీ మరుగుజొత్తురు.

               ఆపదలోనున్నవారు నిన్ను ఆశ్రయింతురు

               గాలివానలో నీవు ఆశ్రయణీయుడవు,

               ఎండవేడిమిలో నీవు నీడవు.

               శీతకాలమునవచ్చు గాలివానవలెను,

               ఎండియున్న దేశమునకు తగిలిన బెట్టవలెను 

               క్రూరులు మమ్ము బాధించిరి.

5.           కాని నీవు మా విరోధులను అణగద్రొక్కితివి.

               మబ్బు ఎండవేడిమిని నాశనము చేసినట్లుగా,

               నీవు గర్వాత్ముల సంతోషనాదములు

               అణచివేసితివి.

అభిషిక్తుడు వేంచేయు కాలమున

జరుగు విందు

6.           సైన్యములకధిపతియైన ప్రభువు

               ఈ పర్వతముమీద సకలజాతులకును

               విందు సిద్ధముచేయును.

               అది ప్రశస్త మాంసభక్ష్యములతోను, 

               మధువుతోను  కూడియుండును.

               క్రొవ్విన పశువుల మాంసముతోను

               తేరుకొనిన ద్రాక్షరసముతోను నిండియుండును.

7.            సకల జాతిజనులు విచారముతో

               కప్పుకొనిన ముసుగును,

               సకలప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను,

               ఈ పర్వతముమీద ఆయన తొలగించును.

8.           ప్రభువైన యావే,

               మృత్యువును సదా నాశనము చేయును.

               ఎల్లరి కన్నీళ్ళను తుడిచివేయును.

               భూమిమీద సకల స్థలములలో

               తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించును.

               ప్రభువు స్వయముగా పలికిన పలుకిది.

9.           ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు:

               ”ఈయన మన ప్రభువు.

               మనము ఈయనను నమ్మితిమి.

               ఈయన మనలను కాపాడెను.

               ఈయన ప్రభువు,

               మనము ఈయనను విశ్వసించితిమి.

               ఈయన మనలను రక్షించెను.

               కనుక మనము ప్రమోదము చెందుదము.

10.         ప్రభువు ఈ కొండను కాపాడును.

               కాని మోవాబును మాత్రము

               ఎరువుదిబ్బలో చెత్తనువలె త్రొక్కివేయును.

11.           ఈతకొట్టువాడు చేతులుచాచినట్లుగా

               మోవాబీయులును చేతులు చాతురు.

               వారెన్ని తంత్రములు పన్నినను,

               ప్రభువు వారి పొగరు అణగించును.

12.          ప్రభువు

               ఉన్నత ప్రాకారములుగల మోవాబీయుల

               కోటలు కూల్చివేసి మ్టిపాలు చేయును.