ప్రభువు దేవాలయ ప్రవేశము చేయుట

 దావీదు కీర్తన

24 1.      భూమియు దానిమీదనున్న

                              సమస్త వస్తువులును ప్రభువువే.

               ప్రపంచమును దానియందు వసించు

               ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే.

2.           ఆయన భూమిని

               సముద్రములమీద నిర్మించెను.

               అంతఃప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను.

3.           ప్రభువు పర్వతమునెక్కుటకు అర్హుడెవడు?

               ఆయన పవిత్రస్థలమున

               అడుగిడుటకు యోగ్యుడెవడు?

4.           నిర్దోషమైన చేతులు కలవాడు,

               పవిత్రమైన హృదయము కలవాడు,

               విగ్రహములను ఆరాధింపనివాడు,

               వ్యర్థక్రియలపై మనస్సు పెట్టనివాడు,

               అబద్ద ప్రమాణములు చేయనివాడు

               ఎవడో అతడే యోగ్యుడు.

5.           అతడు ప్రభువునుండి దీవెనలుబడయును.

               అతని రక్షకుడైన ప్రభువు

               అతనిని నీతిమంతునిగా గణించును.

6.           ప్రభువును వెదకుకొనుచు వచ్చెడివారు,

               యాకోబు దేవునిసన్నిధిలోనికి

               వచ్చెడివారు ఇి్టవారే.

7.            మందిర ద్వారములారా!

               మీ తలలను పైకెత్తుకొనుడు.

               పురాతనములైన తలుపులారా! మీరు పైకిలెండు.

               మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు.

8.           ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు?

               ఆయన మహాబలవంతుడు,

               మహావీరుడునైన ప్రభువు,

               యుద్ధరంగమున యోధానుయోధుడైన ప్రభువు.

9.           మందిర ద్వారములారా!

               మీ తలుపులను పైకెత్తుకొనుడు.

               పురాతనములైన తలుపులారా! మీరు పైకిలెండు.

               మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు.

10.         ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు?

               ఆయన సైన్యములకు అధిపతియైన ప్రభువు,

               మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము