యేసు – నికోదేము

3 1. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను.

2. అతడు ఒకరాత్రి యేసు వద్దకు వచ్చి ”బోధకుడా! నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయన, దేవునితోడు లేనియెడల నీవు చేయుచున్న అద్బుత సూచకక్రియలను ఎవడును చేయలేడు”  అని పలికెను.

3. యేసు అందుకు అతనితో, ”మనుష్యుడు నూతన ముగా జన్మించిననే తప్ప దేవునిరాజ్యమును చూడ జాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని పలికెను.

4. అందుకు నికోదేము, ”వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింపగలడు? అతడు తల్లిగర్భమున రెండవపర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని  అడిగెను. 

5. అపుడు యేసు,  ”ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీరమూలముగ జన్మించినది శరీరమును, ఆత్మమూలముగ జన్మించినది ఆత్మయునై యున్నది.

7. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు.

8. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును” అనెను.

9. ”ఇది ఎటుల సాధ్యమగును?”  అని నికోదేము అడిగెను.

10. అందులకు యేసు: ”నీవు యిస్రాయేలు బోధకుడవై యుండియు దీనిని ఎరుగవా?

11. మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా  సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో  నిశ్చయ ముగా చెప్పుచున్నాను.

12. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన మీరు నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పినయెడల ఎట్లు నమ్మెదరు.

13. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు.

14. ”మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో 15. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము  పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్తబడ వలెను.

16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనముచెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను.

17. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు.

18. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన, దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు.

19.ఆ తీర్పు ఏమన, లోకమున వెలుగు అవతరించి నది. కాని మనుష్యులు దుష్క్రియలు చేయుచు, వెలుగు కంటె చీకటినే ఎక్కువగ ప్రేమించిరి.

20. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీ పింపడు.

21. కాని, సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తాను సారముగ చేయబడినవని ప్రత్యక్ష మగుటకు వెలుగును సమీపించును” అని సమాధాన మిచ్చెను.

యేసు – యోహాను

22.ఆ పిదప యేసు తనశిష్యులతో యూదయా సీమకు వెళ్ళి, వారితో కొంతకాలము గడపుచు జ్ఞాన స్నానమిచ్చుచుండెను.

23. నీరు పుష్కలముగా ఉండు టచే ‘సలీము’ సమీపమున ఉన్న ‘ఐనోను’ వద్ద యోహాను కూడ బప్తిస్మమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మము పొందుచుండిరి.

24. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు.

25. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి.

26. వారు యోహాను వద్దకు వెళ్ళి, ”బోధకుడా! యోర్దాను నది ఆవలితీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరు ఆయన యొద్దకు వెళ్ళుచున్నారు” అని చెప్పిరి.

27. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను: ”పరలోకమునుండి అను గ్రహింపబడిననే తప్ప ఎవడును ఏమియు పొంద నేరడు.

28. నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాకక్షులు.

29. పెండ్లికుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లికుమారుని మిత్రుడు అతని చెంతనుండి అతడు చెప్పినట్లుచేయును. అతని స్వర మును  వినినపుడు  మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది.

30. ఆయన హెచ్చింపబడవలెను. నేను తగ్గింపబడవలెను.

31.పైనుండి వచ్చువాడు అందరికంటె అధికుడు. భూలోకమునుండి వచ్చువాడు, భూలోకమునకు చెంది నవాడు. అతడు భూలోకవిషయములను గూర్చి మాట్లాడును. పరలోకమునుండి వచ్చువాడు అందరి కంటె అధికుడు.

32. ఆయన తాను చూచిన, వినిన విషయ ములను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కాని, ఎవరును ఆయన  సాక్ష్యమును అంగీకరింపరు.

33. ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్య సంధుడని నిరూపించును.

34. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములు గూర్చి చెప్పును. ఏలయన, దేవుడు ఆయనకు తనఆత్మను సమృద్ధిగా ఒసగును.

35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించియున్నాడు.

36. కుమారునివిశ్వసించువాడునిత్యజీవమునుపొందును. ఆయనకు విధేయించనివాడు జీవమును చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలిచిఉండును.