తల్లిదండ్రులపట్ల ఆదరము

3 1.         బిడ్డలారా! మీ తండ్రినైన

                              నా పలుకులు ఆలింపుడు.

                              నేను చెప్పినట్లు చేసినచో

                              మీకు భద్రత కలుగును.

2.           ప్రభువు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను.

               ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను.

3.           తండ్రిని గౌరవించువాడు తన పాపములకు

               ప్రాయశ్చిత్తము చేసికొనినట్లే.

4.           తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే.

5.           తండ్రిని సన్మానించు పుత్రుని,

               అతని పుత్రులు సంతోషపెట్టుదురు.

               అతని ప్రార్థనను దేవుడు ఆలించును.

6.           తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

               తల్లిని సంతోషపెట్టువాడు

               దేవునికి విధేయుడైనట్లే.

7.            పిల్లలు తల్లిదండ్రులకు బానిసలవలె

               లొంగియుండవలెను.

8.           నీవు వాక్కుక్రియలలోను

               నీ తండ్రిని గౌరవింపుము.

               అప్పుడు నీవతని దీవెనలు పొందుదువు.

9.           తండ్రి ఆశీస్సులవలన బిడ్డల గృహములు

               వృద్ధిచెందును.

               తల్లి శాపమువలన పిల్లల కొంపలు

               కూలిపోవును.

10.         నీవు కీర్తిని పొందుటకుగాను

               నీ తండ్రిని అవమానపరపరాదు.

               తండ్రికి అవమానము కలిగినపుడు

               పుత్రునికి గౌరవము కలుగదు.

11.           తండ్రిని సన్మానించుట వలన

               తనయుడు గౌరవము పొందును.

               తల్లిని అవమానపరచు సంతానము

               నిందలు తెచ్చుకొనును.

12.          నాయనా! వృద్ధుడైన నీ తండ్రిని

               బాగుగా చూచుకొనుము.

               అతడు జీవించియున్నంత వరకు కష్టపెట్టకుము.

13.          అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో

               చూడవలెను.

               నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు

               గనుక అతనిని అలక్ష్యము చేయరాదు.

14. నీవు నీ జనకునిపై చూపిన

               కరుణను దేవుడు విస్మరింపడు.

               ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము

               చేసిపెట్టును.

15. నీవు ఇక్కట్టులలో ఉన్నపుడు ప్రభువు నిన్ను జ్ఞప్తికి

               తెచ్చుకొనును.

               ఎండవేడిమికి మంచువలె,

               నీ పాపములెల్ల కరిగిపోవును.

16.          తండ్రిని పరిత్యజించువాడు

               దైవదూషకుని వింవాడు.

               తల్లికి కోపము రప్పించువాడు

               దైవశాపమునకు గురియగును.

వినయము

17. కుమారా! నీవు చేయుపనులన్నిట

               వినయముతో మెలగుము.

               బహుమతులిచ్చు వానికంటెగూడ

               వినయవర్తనుని నరులు

               అధికముగా మెచ్చుకొందురు.

18. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము.

               అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు.

19.          గొప్పవారు, పేరు ప్రసిద్ధులుకలవారు

               చాలమంది కలరు.

               కాని  ప్రభువు  వినయాత్ములకు

               తన రహస్యములను ఎరిగించును.

20.        ప్రభువు మహాప్రభావము కలవాడయినను

               వినమ్రుల పూజలందుకొనును.

21.          నీ శక్తికి మించిన కార్యములను అర్థము

               చేసికోవలెనని యత్నము  చేయకుము.

               నీకు అందని విషయములను పరిశీలింపవలెనని

               ప్రయాసపడకుము.

22. నీకనుగ్రహింపబడిన ధర్మశాస్త్రముమీద

               మనసు నిలుపుము.

               దేవుడు రహస్యముగా ఉంచినవానిని

               నీవు తెలిసికోనక్కరలేదు.

23.        కనుక నీకు మించిన విషయముల

               జోలికిపోవలదు.

               అసలు నీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమే

               నరులబుద్ధికి మించినది.

24.         స్వీయ అభిప్రాయమువలన చాలమంది

               అపమార్గము ప్టిరి.

               వారి తప్పుడు భావములు

               వారి ఆలోచనలను మందగింప జేసినవి.

25. కన్నులు లేనివాడు చూడలేడు.

               జ్ఞానశూన్యుడు తనకు జ్ఞానమున్నట్లు

               వాదము చేయకూడదు.

గర్వము

26. మొండితనము కలవాడు కడన

               ఆపద తెచ్చుకొనును.

               అపాయముతో చెలగాటమాడు వానిని

               ఆ అపాయమే, నాశనము చేయును.  

27.         పెడసరపుబుద్ధి కలవానికి

               అనేక ఆపదలు వచ్చును.

               పాపి పాపముమీద పాపము మూట కట్టుకొనును.

28.        గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందులేదు

               దుష్టత్వము వానిలో లోతుగా

               వ్రేళ్ళుపాతుకొన్నది. 

29. తెలివికలవాడు సూక్తులనుండి విజ్ఞానమును పొందును.

               నేర్చుకోవలెనను కోరిక కలదు కనుక,

               అతడు శ్రద్ధతో వినును.

పేదలకు ధానధర్మములు

30.        జలములు మంటను చల్లార్చును.

               దానధర్మములు పాపములకు

               ప్రాయశ్చిత్తము చేయును.

31.          పరులకు ఉపకారము చేయువాడు

               తన భావిజీవితమును భద్రము చేసికొనినట్లే.

               కష్టములు వచ్చినపుడు

               అతనికి సహాయము లభించును.