తండ్రియొద్దకు మార్గము

14 1. యేసు వారితో ”మీ హృదయములను కలవరపడనీయకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును  విశ్వసింపుడు.

2. నా తండ్రి గృహమున అనేక నివాస ములు కలవు. లేకున్నచో నేను మీతో అటులచెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్ధము చేయబోవు చున్నాను.

3. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును.

4. నేను వెళ్లు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు” అనెను.

5. తోమా ఆయనతో ”ప్రభూ! మీరు వెళ్లు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము?” అనెను. 6. అందుకు యేసు, ”నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు.

7. మీరు నన్ను ఎరిగియున్నచో, నా తండ్రిని కూడ ఎరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు” అని పలికెను.

8. అప్పుడు ఫిలిప్పు ”ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలును” అనెను.

9. అందుకు యేసు ఇట్లనెను: ”ఫిలిప్పు! నేను ఇంతకాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు!

10. నేను తండ్రియందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. కాని, తండ్రి నాయందు నివసించుచు, తన పనులను నెరవేర్చుచున్నాడు.

11. నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు.

12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటె గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

13. తండ్రి కుమారుని యందు మహిమ పరుపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను.

14. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను.

పవిత్రాత్మ – ప్రభు వాగ్దానము

15.”మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు.

16. నేను తండ్రిని ప్రార్థింతును. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహించును.

17. ఆయన సత్యస్వరూపి అగు ఆత్మ. లోకము ఆయనను పొందజాలదు. ఏలయన అది ఆయనను చూడదు, ఎరుగదు. కాని, మీరు ఆయనను ఎరుగుదురు. కనుక, ఆయన మీతో నివసించును. మీయందు ఉండును.

18. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నేను మీయొద్దకు వత్తును.

19. కొలదికాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికిని చూడలేదు. కాని, మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను. కనుక, మీరును జీవింతురు.

20. నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు.

21.” నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి, వానికి నన్ను తెలియపరచుకొందును” అని చెప్పెను.

22. అంతట ఇస్కారియోతు కాని ‘యూదా’ ”ప్రభూ! లోకమునకుకాక మాకు మాత్రము తెలియపరచు కొనుట ఎట్లు సంభవించును?” అని అడిగెను.

23. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను: ”నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము.

24. కాని, నన్ను ప్రేమింపనివాడు నామాట పాటింపడు. మీరు విను చున్న ఈ మాట నాది కాదు. నన్ను పంపిన నా తండ్రిది.

25. మీయొద్ద ఉండగనే నేను ఈ మాటలు మీతో చెప్పితిని.

26. కాని, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ మీకు సమస్తవిషయములను బోధించి, నేను చెప్పినవన్నియు మీకు తలపునకు తెచ్చును.

27. ”శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకమువలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయ కుడు. భయపడనీయకుడు.

28. నేను వెళ్ళి మరల మీయొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారుగదా! తండ్రి నాకంటె గొప్పవాడు. కనుక, మీరు నన్ను ప్రేమించినయెడల నేను  తండ్రియొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు.

29. ఇది సంభవించినపుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపకపూర్వమే ఇపుడు మీతో చెప్పుచు న్నాను.

30. మీతో ఇంక ఎక్కువగ మాట్లాడను. ఏలయన ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి  ప్రభావము లేదు.

31. కాని, నేను తండ్రిని ప్రేమించు చున్నానని లోకము తెలిసికొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు. ఇటనుండి వెళ్ళుదము.