ఫిలిస్తీయాకు ప్రతికూలముగా ప్రవచనము
47 1. ఐగుప్తురాజు గాజాను ముట్టడింపక ముందు ఫిలిస్తీయాను గూర్చి ప్రభువు నాతో ఇట్లనెను:
2. ”అదిగో! ఉత్తరదిక్కున నీళ్ళు ఉబుకుచున్నవి.
అవి నదివలె పొంగిపారును.
అవి దేశమును, దానిలోని వస్తుజాలమును,
నగరములను, పౌరులను ముంచివేయును.
ప్రజలు ఆర్తనాదము చేయుదురు.
నేలమీది నరులెల్లరును శోకింతురు.
3. వారు గుఱ్ఱముల డెక్కలచప్పుడు విందురు.
రథముల ధ్వానమును,
రథచక్రముల నాదము నాలింతురు.
తండ్రులు తమ బిడ్డలవైపు తిరిగిచూడరు.
వారి చేతులు చచ్చుపడును.
4. ఫిలిస్తీయాను నాశనముచేయు సమయము,
తూరు సీదోనుల నుండి సాయమందకుండ
చేయుకాలము ఆసన్నమైనది.
ప్రభుడనైన నేను ఫిలిస్తీయాను
నాశనము చేయుదును.
కఫ్తారు ద్వీపమునుండి వచ్చినవారిని తెగార్తును.
5. గాజా పౌరులు శోకమున మునిగిరి.
అష్కెలోను ప్రజలు నాశనమైరి.
ఫిలిస్తీయాలో మిగిలినవారు,
ఇంకా ఎంత కాలము దుఃఖింతురు?
6. ప్రభువు ఖడ్గమా! నీవెంతకాలము
మమ్ము నరుకుదువు? నీవు నీ ఒరలోనికి దూరి,
అచట విశ్రమింపుము అని మీరు పలుకుచున్నారు.
7. కాని నేను దానికి పని ఒప్పచెప్పగా
అదెట్లు విశ్రమింపగలదు?
అష్కెలోనున, సముద్రతీరమున వసించువారిని
శిక్షింపుమని నేను దానికాజ్ఞయిచ్చితిని.”