ఉపోద్ఘాతము:

పేరు: నూతన నిబంధనలోని రెండు గ్రంథముల (లూకాసువార్త, అపోస్తలుల కార్యములు) రచయిత లూకా సువార్తీకుడు. లూకా గూర్చి పవిత్ర గ్రంథములలో మూడు ప్రస్తావనలే కనబడును. (కొలొస్సీ 4:14; 2 తిమోతి 4:11; ఫిలేమోను వచ.-24). లూకా పౌలుగారి అనుచరులలోనొకడు, పౌలుతో కారాగారవాసం చేశాడు. లూకా పూర్వ నిబంధన, నూతన నిబంధనలతో విస్పష్టమైన పరిచయం కలవాడు, యూదయేతరుడు.

కాలం: క్రీ.శ. 80-90. 

రచయిత: లూకా, తాను క్రీస్తు సువార్తను రాశానని స్వయంగా చెప్పుకున్నాడు (1:1-4; అ.కా. 1:1).

చారిత్రక నేపథ్యం: యూదుల చరిత్రకారుడు యోసేఫుస్‌ ప్లావియస్‌ రాసిన చరిత్ర గ్రంథంలో క్రీ.శ. మొదటిశతాబ్దంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను పేర్కొన్నాడు. వాటి ద్వారా నాటి ఆర్థిక, రాజకీయ, మత స్థితిగతులను తెలుసుకుంటాం. వీటి ఛాయలు లూకా రాసిన క్రీస్తు సువార్తలో చూడవచ్చును. యూద  క్రైస్తవుల సంప్రదాయ నిధియైన క్రీస్తు చరిత్ర మానవ రక్షణ చరిత్రగా రూపుదిద్దుకుంది.

ముఖ్యాంశాలు: లూకా క్రీస్తును సమాజంలోని అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడుగా చిత్రించాడు.  క్రీస్తు ప్రేషిత కార్య ప్రణాళిక పత్రంలో ఈ అంశాన్ని తెలుపుతాడు (4:18-19; యెషయా 61:1-2). క్రీస్తు చరిత్ర ప్రవక్తల ప్రవచనాన్ని పూర్తి చేసింది. క్రీస్తు పలుకులు, బోధలు, కార్యాలు, అద్భుత స్వస్థతలు, ఉపదేశాలు, ఉపమానాలు, శ్రమలు, మరణం, పునరుత్థానం, మోక్షారోహణం అన్నీ  దీనిలో భాగాలేనని లూకా వివరిస్తాడు. క్రీస్తు దేవునికి మానవునికి మధ్య అనుసంధాన కర్త. క్రీస్తు దైవాంశ సంభూతుడు, చారిత్రక పురుషుడు.

క్రీస్తు చిత్రీకరణ: లూకా క్రీస్తును సంపూర్ణ మానవుడుగా, అభాగ్యుల, అణగారిన ప్రజల పాలిట దేవుడుగా చిత్రిస్తాడు. సర్వమానవాళి ఆత్మల రక్షణకై సిలువలో మరణించిన దేవుని గొఱ్ఱెపిల్లగా, మానవమూర్తిగా చిత్రించాడు. క్రీస్తు మానవుల శ్రమలలోను బాధలలోను పాలుపంచుకుంటాడు.