దుష్టుడు

2 1. సోదరులారా! మన ప్రభువగు యేసు క్రీస్తు  యొక్క రాకడ విషయమునను, మనము ఆయనను కలిసికొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను.

2. దేవుని దినము వచ్చెనను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు. తబ్బిబ్బు పడరాదు. బహుశ ప్రవచన పూర్వకముగ గాని, లేక బోధన పూర్వకముగగాని ఎవరో అటుల చెప్పియుండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమనియు చెప్పియుండవచ్చును.

3. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చునంతవరకు ఆ దినము రాదు.

4. మానవులు పూజించు సమస్తమును, మానవుడు దైవికముగ భావించు దేనినైనను, ఆ దుష్టుడు వ్యతిరేకించును. అతడు సమస్తమునకు అతీతునిగ, తనను భావించుకొనును. అంతేకాక దేవుని ఆలయమున ప్రవేశించి  కూర్చుండి, తానే దేవుడనని చెప్పుకొనును.

5. మీకు జ్ఞాపకములేదా? నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయములన్నియు చెప్పియుంటిని గదా! 

6. కాని ఇప్పుడు ఇది జరుగకుండ ఆపుచున్నది ఏమియో మీకు తెలియును. కనుక యుక్తసమయమున దుష్టుడు కనిపించును.

7. ఆ తిరుగుబాటు ఇప్పటికే తన పనిని ప్రారంభించినది. కాని అది రహస్యముగా జరుగుచున్నది. తిరుగుబాటుదారుడు బహిరంగముగ రాకముందు దానిని నిరోధించుచున్న వ్యక్తి మొదట తొలగింపబడవలెను. 8. అపుడు దుష్టుడు కనబడును. యేసుప్రభువు వానిని తన నోటిశ్వాసచే సంహరించును. తన మహిమోపేత దర్శనముతోను, రాకడతోను దుష్టుని సర్వనాశనము చేయును.

9. ఆ దుష్టుడు పైశాచికశక్తితో వచ్చి అద్భుతములను, సూచక క్రియలను, మహత్కార్యములను చేయును.

10. నశించువారిని అతడు అన్నివిధములగు దౌష్ట్యముతో మోసగించును. సత్యమును ప్రేమించి రక్షణను పొందుటకు నిరాకరించినందుకుగాను వారు నశింతురు.

11. ఇందువలననే వారు అసత్యమును నమ్మునట్లుగ వారియందు పనిచేయుటకు దేవుడు దోషశక్తిని పంపి యున్నాడు.

12. తత్ఫలితముగ సత్యమును విశ్వసింపక పాపములో ఆనందించినవారు దండింపబడుదురు.

రక్షణకై ఎన్నిక

13. సోదరులారా! ప్రభువుచే  ప్రేమింపబడు మీ కొరకై సర్వదా దేవునకు మేము కృతజ్ఞతలను అర్పింప వలసి ఉన్నది.  ఏలయన,  మిమ్ము పవిత్రపరచుట వలనను,  సత్యమును  మీరు విశ్వసించుటవలనను, మీరు రక్షింపబడుటకుగాను దేవుడు మిమ్ము మొదటనే ఎన్నుకొనెను.

14. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క మహిమలో మీరు భాగము పొందుటకై  ఆయన  మిమ్ము  పిలిచెను.

15. కనుక సోదరులారా! దృఢముగా నిలిచి, మేము మా బోధనలలోను, లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు.

16. మనలను ప్రేమించి, అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రియైన దేవుడును, మన ప్రభువగు యేసు క్రీస్తును 17. మీ హృదయములను ఉత్సాహపరచి, మిమ్ము సమస్త  సత్క్రియలయందును,సద్వాక్కులయందును స్థిరపరతురుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము