ప్రవాసవాసులకు యిర్మీయా జాబు
29 1. నెబుకద్నెసరు యెరూషలేము నుండి బబులోనియాకు బందీలనుగా గొనిపోయిన యాజకు లకు, ప్రవక్తలకు, నాయకులకు, ఇతర జనులకు నేను యెరూషలేమునుండి లేఖను పంపితిని.
2. యెహోయా కీము రాజు, అతనితల్లి, ప్రాసాదాధికారులు, యూదా యెరూషలేము అధిపతులు, కళాకారులు, చేతివృత్తుల వారు ప్రవాసమునకు పోయిన తరువాత ఈ లేఖను పంపితిని.
3. యూదారాజగు సిద్కియా షాపాను కుమారుడైన ఎలాసాను, హిల్కియా కుమారుడైన గెమర్యాను బబులోనియా రాజగు నెబుకద్నెసరునొద్దకు పంపుచుండెను. నేను వారిద్వారా ఈ లేఖనుపంపితిని. దానిలోని సంగతులివి:
4. ”సైన్యములకుఅధిపతియు, యిస్రాయేలు దేవుడునైౖన ప్రభువు తాను యెరూషలేము నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన వారికందరి కిని ఇట్లు చెప్పుచున్నాడు: 5. మీరు ఇండ్లు కట్టుకొని కాపురముండుడు. తోటలువేసి వానిలో పండు పంటను భుజింపుడు.
6. పెండ్లియాడి సంతతిని బడయుడు. మీ పుత్రులు పెండ్లిండ్లుచేసికొని బిడ్డలను కనుదురుగాక! మీ సంఖ్య పెరుగవలెనే కాని తరుగకూడదు. మీ కుమార్తెలకు వరులను సంపాదించుడి.
7. నేను మిమ్ము ప్రవాసమునకు పంపిన నగరముల క్షేమము కొరకు కృషిచేయుడు. ఆ పట్టణముల మేలుకొరకు నాకు ప్రార్థనచేయుడు. వారి క్షేమమే మీ క్షేమము.
8. సైన్యములకధిపతియు, యిస్రాయేలు దేవుడ నైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. మీరు మీ నడుమ నున్న ప్రవక్తలవలన కాని, సోదె చెప్పువారి వలనకాని మోసపోకుడు. వారి కలలను నమ్మకుడు.
9. వారు నా పేరు మీదుగా మీకు అబద్ధములు చెప్పుచున్నారు. నేను వారిని పంపలేదు. ఇవి ప్రభుడనైన నా పలుకులు.
10. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: బబులోనియాకు ఈయబడిన డెబ్బదియేండ్లు ముగిసినతోడనే నేను మిమ్ము సందర్శింతును. నేను ప్రమాణము చేసినట్లే మిమ్ము ఈ తావునకు తీసికొనివత్తును.
11. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని.
12. అప్పుడు మీరు నాకు మొరప్టిె ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి నాలింతును.
13. మీరు పూర్ణహృదయముతో నన్ను వెదకుదురు. నేను మీకు దొరకుదును.
14. ఇవి ప్రభుడనైన నా మాటలు. నేను మీకు తప్పక దొరకుదును. నేను మిమ్ము చెరనుండి విడిపింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశములనుండియు, తావుల నుండియు మిమ్ము తోడ్కొనివత్తును. ఏ దేశము నుండి మిమ్ము ప్రవాసమునకు కొనిపోయిరో, ఆ దేశమునకు మిమ్ము చేర్తును. ఇవి ప్రభుడనైన నా మాటలు.
15. బబులోనియాలో ప్రభువు మీకు ప్రవక్తల నొసగెనని మీరు చెప్పుచున్నారు.
16. ఇపుడు దావీదు సింహాసనమున కూర్చుని పరిపాలనముచేయు రాజు గూర్చియు మీతోపాటు ప్రవాసమునకుపోక ఈ నగరమున వసించు మీ బంధువులను గూర్చియు ప్రభువు చెప్పు మాటలు వినుడు.
17. ‘సైన్యములకు అధిపతియైన ప్రభువు వాక్కిది. నేను వారి మీదికి యుద్ధమును, ఆకలిని, అంటురోగములను గొనివత్తును. వారిని కుళ్ళిపోయి తినుటకు పనికిరాని అంజూరపుపండ్ల విం వారిని చేయుదును.
18. పోరు, ఆకలి, అంటు రోగములతో నేను వారిని వెన్నాడుదును. లోకములోని ప్రజలెల్ల వారిని చూచి విభ్రాంతి చెందుదురు. నేను వారిని ఎల్లెడల చెల్లాచెదరు చేయుదును. వారికి ప్టిన దుర్గతిని చూచి ప్రజలు విస్మయమొంది వెరగు చెందు దురు. వారిని గేలిచేయుదురు. వారి నామమును శాపముగా వాడుకొందురు.
19. నేను వేకువనే లేచి నా సేవకులైన ప్రవక్త లను ఎడతెగక వారియొద్దకు పంపినను, వారు నా సందేశమును ఆలింపలేదు. నా మాటలువినలేదు.’
20. నేను యెరూషలేము నుండి బబులోనియాకు పంపిన వారందరును ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు.
21. ‘సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువు తన నామము మీదుగా మీకు అబద్ధప్రవచనములు చెప్పుచున్న కోలాయా కుమారు డగు అహాబును గూర్చియు, మాసెయా కుమారుడగు సిద్కియాను గూర్చియు ఇట్లనుచున్నాడు. నేను వారిని బబులోనియారాజగు నెబుకద్నెసరునకు అప్పగింతును. మీరెల్లరును చూచుచుండగా అతడు వారిని వధించును.
22. యెరూషలేమునుండి బబులోనియాకు బందీ లుగా వెళ్ళిన వారు ఎవరినైన శపింపగోరినచో, ”బబులోనియారాజు నిలువున నిప్పులలో కాల్పించిన సిద్కియా, అహాబులను చూచిన చూపుననే ప్రభువు మిమ్మును చూచునుగాక!’ ” అని పలుకుదురు.
23. వారు ఘోరపాపములు చేసిరి. కనుక ఈ దుర్గతికి గురియగుదురు. వారు వ్యభిచరించిరి. నేను పంప కున్నను నా పేరుమీదుగా ప్రవచనము చెప్పి కల్లలా డిరి. ఆయినను వారి కార్యములు నాకు తెలియును. నేను వారికి ప్రతికూలముగా సాక్ష్యమిత్తును. ఇవి ప్రభుడనైన నా పలుకులు.”
షెమయా జాబు
24. నెహెలాము నగరవాసియైన షెమయాను గూర్చి సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు నాకొక సందేశము చెప్పెను: 25. ”షెమయా యెరూషలేములోని ప్రజలకును, మాసెయా కుమారుడును, యాజకుడునైన జెఫన్యాకును, ఇతర యాజకులకును తనపేరు మీదుగానే లేఖను పంపెను. ఆ లేఖలో జెఫన్యాకిట్లు వ్రాసెను: 26. ‘ప్రభువు యెహోయాదాకు బదులుగా నిన్ను యాజకుని చేసెను. నీవిపుడు దేవాలయమున ప్రధానాధికారివి. ప్రవక్తల వలె నటనచేయు పిచ్చివారిని గొలుసులతో బంధించి, వారి మెడకు ఇనుపవలయమును తొడిగించుట నీ బాధ్యత.
27. మరి నీవు ప్రవక్తవలె నటనచేయు అనాతోతు నగరవాసియైన యిర్మీయాను ఏల అదుపులో పెట్ట వైతివి?
28. తాను ప్రవక్తనన్న ధీమాతోనే అతడు బబులోని యాలో వసించు మాకు సందేశము పంపెను. ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును కనుక మీరు ఇండ్లుకట్టుకొని వానిలో కాపురముండుడు. తోటలువేసి వానిలో పండిన పంటను తినుడని వ్రాసెను.”
29. జెఫన్యా నాకు ఆ లేఖ చదివి విన్పించెను.
30. అపుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు తెలియ చేసెను.
31. ”నీవు బబులోనియాలోని బందీలకు ఈ సందేశమును పంపుము. ‘నెహలాము నగర వాసియైన షెమయానుగూర్చి ప్రభువు ఇట్లు చెప్పు చున్నాడు. నేను పంపకున్నను అతడు మీకు ప్రవచనము చెప్పి, మీచే అనృతములను నమ్మించెను.
32. కనుక ప్రభుడనైన నేను అతనిని, అతని వంశజులను కూడ శిక్షింతును. అతడు జనులచే నా మీద తిరుగుబాటు చేయించెను. కనుక అతని వంశజులెవరు మీ నడుమ కొనసాగరు. నేను నా ప్రజలకు కలుగజేయు శుభము లను అతడు కింతో చూడడు. ఇది ప్రభుడనైన నా వాక్కు.’ ”