వివిధ ఉపదేశములు

7 1.         నీవు దుష్కార్యములను చేయకుందువేని

                              అవియు నీక్టిె కీడును చేయవు.

2.           అధర్మమును విడనాడెదవేని అదియు 

               నిన్ను విడనాడును.   

3.           అధర్మము అను నాగిచాళ్ళలో

               విత్తనములు విత్తకుము.

               విత్తెదవేని ఏడురెట్లుగా పండిన

               చెడ్డపంటను కోసికోవలసివచ్చును.

4.           దేవునినుండి ఉన్నతమైన పదవిని కోరుకొనకుము.

               రాజునుండి గౌరవప్రదమైన

               ఉద్యోగమును అర్థింపకుము.

5.           దేవునిముందు నీపుణ్యమును

               ఏకరువు పెట్టవద్దు.

               రాజునెదుట నీ విజ్ఞతను ప్రదర్శింపవద్దు.

6.           అన్యాయమును తొలగించు సామర్థ్యము లేనపుడు 

               న్యాయాధిపతివి  కావలెనని ఉబలాటపడకుము.

               నీవు ఎవడైన పేరు ప్రఖ్యాతులు కలవానికి

               లొంగిపోయి న్యాయము చెరచి

               అపఖ్యాతి తెచ్చుకోవచ్చును.

7.            పౌరులకు అపకారముచేసి

               లోకము ఎదుట నగుబాట్లు తెచ్చుకొనకుము.

8.           ఒకసారి చేసిన తప్పు మరల చేయవద్దు.

               అసలు ఒక తప్పుకే శిక్ష పడవలెను.

9.           ”నేను  ఉదారబుద్ధితో సమర్పించిన కానుకలను

               మహోన్నతుడైన ప్రభువు అంగీకరించునులే,

               నేనేమిచ్చినా ఆయన చేకొనునులే”

               అని తలపకుము.     

10.         విసుగుచెందక ప్రార్థింపుము.

               దానధర్మములు చేయటలో వెనుకాడకుము.

11.           భంగపాటునకు గురియైన నరుని పరిహాసము

               చేయకుము.

               నరుని తగ్గించుటకుగాని హెచ్చించుటకుగాని

               ప్రభువే సమర్థుడు.

12.          నీ సోదరునిమీద చాడీలు

               చెప్పవలెనని తలపకుము.

               నీ మిత్రుని మీద కొండెములు తలపెట్టకుము.

13.          అసలు కొండెములు చెప్పకుము.

               వాని వలన ఏ ప్రయోజనము లేదు.

14.          పెద్దలున్న సభలో దీర్ఘోపన్యాసములు చేయకుము.

               ప్రార్థన చేయునపుడు చెప్పిన సంగతులనే

               చెప్పుకొనుచు పోవలదు.

15.          వ్యవసాయముగాని, ఇతరములైన

               కాయకష్టములనుగాని తప్పించుకోవలదు.

               మహోన్నతుడైన ప్రభువే వానిని నియమించెను.

16.          పాపులపక్షమున చేరకుము.

               పాపులు దేవుని శిక్షను తప్పించుకోజాలరు.

17.          వినయమును ప్రదర్శింపుము.

               అగ్నికిని, క్రిములకును ఆహుతియగుటయే

               దుర్మార్గులకు శిక్ష.

18.          డబ్బు కొరకు మిత్రుని వదలుకోవలదు.

               మేలిమి బంగారముకొరకు

               సోదరుని విడనాడవలదు.

19.          యోగ్యురాలు, వివేకవతియైన వధువు

               దొరికినపుడు ఆమెను పెండ్లియాడుటకు

               సంసిద్ధముగా ఉండవలెను.

               మనోహరియైన భార్య బంగారముకంటెను

               విలువకలది.  

20.        చిత్తశుద్ధితో  పనిచేయు సేవకునికిగాని, 

               పూర్ణహృదయముతో శ్రమచేయు

               కూలివానికి గాని హానిచేయరాదు.

21.          బుద్ధిమంతుడైన బానిసను

               ఆత్మీయునిగా ఎంచి అభిమానింపుము.

               అతనికి స్వాతంత్య్రము దయచేయుము.

తల్లిదండ్రులు

22. నీకు గల పశువులను జాగ్రత్తగా మేపుకొనుము.

               ఆదాయము లభించెనేని వానిని ఉంచుకొనుము.

23.        నీకు పుత్రులుకలరేని వారికి విద్యాబుద్దులు నేర్పుము

               చిన్నప్రాయము నుండియే క్రమశిక్షణ గరపుము.

24.         పుత్రికలు కలరేని

               వారిని శీలవతులనుగా తీర్చిదిద్దుము.

               వారిపట్ల ఎక్కువ గారాబము చూపవలదు.

25.        కుమార్తెకు పెండ్లిచేయువాడు దొడ్డకార్యము

               చేసినట్లగును.

               కాని ఆమెను వివేకముకల యువకునికిమ్ము.

26.        నీ భార్య నీకు ప్రీతి కలిగించునదైనచో

               విడాకులీయవద్దు.

               కాని నీ కిష్టముకానిదైనచో, నమ్మవద్దు.

బిడ్డలు

27.         పూర్ణహృదయముతో నీ తండ్రిని గౌరవింపుము.

               నిన్నుగన్న తల్లి పురినొప్పులను

               మరిచిపోవలదు.

28.        నీకు ప్రాణమిచ్చినవారు నీ జననీజనకులు.

               వారి ఋణమును నీవెట్లు తీర్చుకోగలవు?

యాజకులు

29.        పూర్ణహృదయముతో ప్రభువుపట్ల

               భయభక్తులు చూపుము.

               ఆయన యాజకులను గౌరవింపుము.

30. నీ పూర్ణబలముతో నీ సృష్టికర్తను ప్రేమింపుము. ఆయన యాజకులను ఆదుకొనుము.

31.          దేవునికి భయపడి యాజకులను గౌరవింపుము.

               విధిగా వారికీయ వలసిన కానుకలనిమ్ము.

               ప్రథమఫలములు, పాపపరిహారబలి అర్పణములు

               బలిపశువు జబ్బ, బలిఅర్పణములు,

               పవిత్రార్పణలనిమ్ము.

దరిద్రులు, బాధార్తులు

32.        పేదసాదలకు దానధర్మములు చేయుము.

               అప్పుడు దేవుడు నిన్ను నిండుగా దీవించును.

33.        బ్రతికియున్న వారికందరికి దానధర్మములు

               చేయుము.

               చనిపోయినవారినికూడ నెనరుతో

               స్మరించుకొనుము

34.         శోకతప్తులకు సానుభూతి చూపుము.

               బాధార్తుల బాధలలో పాలుపంచుకొనుము.

35.        వ్యాధిగ్రస్తులను సందర్శించుటలో

               అశ్రద్ధ చూపవలదు.

               అి్ట సత్కార్యములద్వారా

               ప్రజల మన్నన పొందుదువు

36.        ఒక దినమున నీవు మరణించి తీరుదువని

               నీవు చేయు కార్యములన్నింటను

               గుర్తుంచుకొనుము.

               అప్పుడెన్నడు పాపము కట్టుకొనవు.