శతాధిపతి సేవకుని స్వస్థత
(మత్తయి 8:5-13)
7 1. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను.
2. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను.
3. ఆ శతాధిపతి యేసునుగూర్చి విని యూదుల పెద్దలను ఆయనయొద్దకు పంపి, తన దాసుని స్వస్థపరుపరమ్మని కోరెను.
4. వారు యేసును సమీపించి, ”ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు.
5. అతడు మన జాతిని ప్రేమించువాడు, మనకొరకు స్వయముగా ప్రార్థనామందిరము నిర్మించినవాడు” అని అనేకవిధముల ప్రాధేయపడిరి.
6. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగనే అతడు తనమిత్రులను పంపి ”ప్రభూ! మీరు శ్రమపడవలదు. మీరు నా ఇంట అడుగిడుటకు నేను యోగ్యుడను కాను.
7. అందువలన మీయొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన చాలును. నా దాసుడు స్వస్థుడగును.
8. నేనును అధికారమునకు లోబడినవాడను. నా చేతిక్రింద కూడ సైనికులు ఉన్నారు. ఒకనిని ‘రమ్ము’ అనిన వచ్చును. మరియొకనిని ‘పొమ్ము’ అనిన పోవును. నా దాసునితో ‘ఇది చేయుము’ అని చెప్పిన వాడు దానిని చేయును” అని మనవి చేసికొనెను.
9. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంటవచ్చు ప్రజా సమూహమును చూచి ”ఇంత విశ్వాసమును నేను యిస్రాయేలీయులలోసైతముచూడలేదు”అని పలికెను.
10. పంపబడినవారు ఇంటికివచ్చి దాసుడు స్వస్థుడై ఉండుటను చూచిరి.
నాయినులో వితంతువు కుమారుడు
11. అటుపిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండగా, శిష్యులును, గొప్ప జనసమూహములును ఆయన వెంట వెళ్ళుచుండిరి.
12. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించునప్పటికి జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసికొనిపోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులుగుంపులుగా వెంట నుండిరి.
13. ఆ తల్లిని చూచి యేసు కనికరించి, ఆమెతో ”ఏడువవద్దమ్మా” అని పలికి, 14. ముందుకు సాగి, పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్న వారు నిలిచిపోయిరి. అపుడు యేసు ”చిన్నవాడా! లెమ్ము అని నీతో చెప్పుచున్నాను” అనెను.
15. వెంటనే ఆ మరణించినవాడు లేచి కూర్చుండి మాట్లాడ సాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను.
16. అందరు భయభ్రాంతులై ”మనమధ్య ఒక గొప్పప్రవక్త వెలసెను. దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను” అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి.
17. యేసును గురించిన ఈ వర్తమానము యూదయా ప్రాంతము అంతటను, పరిసరప్రాంతములందును అంతటను వ్యాపించెను.
యోహాను శిష్యులు – యేసు సమాధానము
(మత్తయి 11:2-19)
18. ఈ విషయములను అన్నింటిని గురించి యోహాను శిష్యులు అతనికి తెలియపరచిరి.
19. అంతట యోహాను తనశిష్యులలో ఇద్దరను పిలిచి, ”మీరు ప్రభువువద్దకు వెళ్ళి ‘రానున్నవాడవు నీవేనా? లేక మేము మరియొకని కొరకు నిరీక్షింపవలయునా?’ అని అడిగిరండు” అని పంపెను.
20. వారు అట్లే యేసువద్దకు వచ్చి ” ‘రానున్నవాడవు నీవేనా? లేక మేము మరియొకని కొరకు నిరీక్షింపవలయునా?’ అని మిమ్ము అడిగిరమ్మని బప్తిస్మ యోహాను పంపెను” అని చెప్పిరి.
21. యేసు ఆ సమయముననే రోగముల నుండి, బాధలనుండి, అపవిత్రాత్మలనుండి అనేకులకు స్వస్థత చేకూర్చుచు, గ్రుడ్డివారికి చూపునిచ్చుచుండెను.
22. అపుడు యేసు వారితో, ”మీరు చూచినవానిని, వినినవానిని యోహానుతో చెప్పుడు. గ్రుడ్డివారు చూచు చున్నారు, కుంటివారు నడచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు,చెవిటివారువినుచున్నారు,మరణించినవారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింప బడుచున్నది.
23. నన్ను గూర్చి అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని పలికెను.
24. ఆ శిష్యులు వెళ్ళిపోయిన పిదప యేసు జనసమూహముతో యోహానును గూర్చి ఇట్లనెను: ”మీరు ఎడారిలో ఏమి చూడబోయితిరి? గాలికి కదలాడురెల్లునా?
25. మరి ఏమి చూడ బోయితిరి? మృదువస్త్రములను ధరించిన మనుష్యుడినా? మృదువస్త్రములను ధరించినవారు, విలాస జీవితములను గడుపువారు రాజభవనములలో ఉందురు గదా!
26. మరి ఇంకేమి చూడబోయితిరి? ప్రవక్తనా? ప్రవక్తకంటె గొప్పవానిని అని నేను మీతో చెప్పుచున్నాను. 27. ఇతనిని గురించి ఇట్లు వ్రాయబడి యున్నది:
‘ఇదిగో! నీకు ముందుగా
నా దూతను పంపుచున్నాను,
అతడు నీ మార్గమును సిద్ధపరచును.’
28. స్త్రీల సంతానములో బప్తిస్త యోహాను కంటె అధికుడగు వాడెవడులేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యమున మిక్కిలి తక్కువయైనవాడు అతనికంటె అధికుడు.”
యూద ప్రజలు – యేసు విమర్శ
29. అది వినినవెంటనే సుంకరులతో గూడ ప్రజలెల్లరు దేవునిస్తుతించిరి. ఏలయన, వారు యోహాను బప్తిస్మమును స్వీకరించియుండిరి.
30. కాని పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు స్నాపక యోహానుచేత బప్తిస్మము పొందక తమ విషయమున దేవుని సంకల్పమును నిరాకరించిరి.
31.”ఈ తరమువారిని నేను ఎవరితో పోల్తును? వారెవరిని పోలియుందురు?
32. వారు అంగడి వీథులలో కూర్చుండియున్న పిల్లలవలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు ‘మేము మీకొరకు వాద్యములు మ్రోగించితిమి. కాని, మీరు నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి. కాని, మీరు ఏడ్వరైతిరి’ అని అనుచుందురు.
33. యోహాను అన్నపానీయములు పుచ్చు కొనకపోవుటచే అతనికి దయ్యముపట్టినదని మీరు చెప్పుచున్నారు. 34. మనుష్యకుమారుడు అన్న పానీయములను పుచ్చుకొన్నచో ఆయన భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు.
35. జ్ఞానము దానిని స్వీకరించువారివలన నిరూపింప డుచున్నది” అని యేసు పలికెను.
సీమోను ఇంటిలో యేసు
36. పరిసయ్యులలో ఒకడు తనఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి, పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను.
37. ఆ పట్టణములోని ఒక స్త్రీ, పాపాత్మురాలు యేసు పరిసయ్యునిఇంట భోజనమునకు వెళ్ళెనని తెలిసికొని, చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసికొనివచ్చి, 38. ఆయన పాదములు వెనుకగా నిలువబడి, ఏడ్చుచు, తన కన్నీటితో ఆ పాదములను తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, ముద్దుపెట్టుకొనుచు, పరిమళద్రవ్యమును పూసెను.
39. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి ”ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించెడివాడే. ఆమె పాపాత్మురాలుకదా!” అని తనలోతాను అనుకొనెను.
40. యేసు అతనితో ”సీమోనూ! నీకు ఒక విషయము చెప్పదలచితిని” అనగా, ”బోధకుడా, చెప్పుము!” అని సీమోను పలికెను.
41. అపుడు యేసు ”ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు ఋణస్థులు ఉండిరి. వారిలో ఒకడు అయిదువందల దీనారములు, రెండవ వాడు ఏబది దీనారములు అతనికి ఋణపడి ఉండిరి.
42. ఋణము తీర్చుటకు వారికి శక్తిలేనందున అతడు వారిద్దరని క్షమించెను. ఇపుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము” అని ప్రశ్నించెను.
43. అందుకు సీమోను ”అధికముగ ఋణపడి క్షమింపబడినవాడే అని నాకు తోచుచున్నది” అని జవాబు ఇచ్చెను. ”నీవు సరిగా సమాధానము ఇచ్చితివి” అని యేసు పలికెను.
44. పిదప, యేసు ఆ స్త్రీని చూపుచు, సీమోనుతో ”ఈమెను చూచు చుంటివికదా! నేను నీ ఇంటికి వచ్చితిని. నీవు కాళ్ళకు నీళ్ళు ఈయలేదు. కాని ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తలవెంట్రుకలతో వానిని తుడిచినది.
45. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగిడినప్పటినుండియు ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుటమానలేదు.
46. నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా పాదములకు పరిమళద్రవ్యములు పూసినది.
47. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగనే ప్రేమించును అని నీతో చెప్పు చున్నాను” అని, 48. ఆ స్త్రీతో ”నీ పాపములు క్షమింప బడినవి” అని పలికెను.
49. అపుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు ”పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు?” అని అనుకొనసాగిరి.
50. యేసు ఆమెతో ”నీ విశ్వాసము నిన్ను రక్షించినది. సమాధానముతో వెళ్ళుము” అని పలికెను.