పురప్రవేశము

(మత్తయి 21:1-11; లూకా 19:28-40; యోహాను 12:12-19)

11 1. యేసు  తనశిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఓలివుకొండ దగ్గరనున్న బెత్ఫగె, బెతానియా గ్రామములను సమీపించెను. అప్పుడు ఆయన ఇరువురు శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను.

2. ”మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచట కట్టివేయబడియున్న గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఇంతవరకు ఎవరును ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు”.

3. ” ‘ఇదేమి?’ అని ఎవడేని ప్రశ్నించినచో ‘ప్రభువునకు అది అవసరము. త్వరలో తిరిగి పంపగలడు’ అని చెప్పుడు.”

4. వారు వెళ్ళి వీధిప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడియున్న గాడిదపిల్లను చూచిరి. వారు దానిని విప్పుచుండగా,5. అచట నిలిచియున్న వారిలో కొందరు ”ఇదేమి పని?” అని అడిగిరి.

6. అందుకు వారిద్దరు యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినినవారు అందులకు అంగీకరించిరి.

7. వారు గాడిదపిల్లను యేసు వద్దకు తోలుకొనివచ్చి, దానిపై తమవస్త్రములను పరచిరి. ఆయన దానిపై కూర్చుండెను.

8. మార్గమున చాలమంది తమ వస్త్రములను పరచిరి. కొందరు పొలములోని చెట్లరెమ్మలను తెచ్చి, ఆ త్రోవన పరచిరి.

9. ఆయన ముందువెనుక నడచు

   జనసమూహములు:

                              ”హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు

                              స్తుతింపబడునుగాక!

10.                        వచ్చుచున్న మన తండ్రియైన

                              దావీదురాజ్యము స్తుతింపబడునుగాక! 

                              మహోన్నతునకు హోసన్నా!”

అని విజయ ధ్వానములు చేసిరి.

11. యేసు అటుల పయనించి, యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూచెను.     సాయంసమయమగుటచే పండ్రెండుగురు శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరెను.

అంజూరము – యేసు శాపము

(మత్తయి 21:18-19)

12. ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండ, యేసు ఆకలిగొనెను.

13. అప్పుడు ఆయన దూరమున పచ్చనిఆకులతో నిండిన అత్తిచెట్టును చూచి పండు దొరకునేమో అని దాని యొద్దకు వచ్చెను. అది ఫలించుఋతువు కానందున, అందు ఆకులేకాని, పండ్లులేవాయెను.

14. అప్పుడు ఆయన ”ఈ చెట్టు ఎన్నడును ఫలింపకుండునుగాక!” అని శపించెను. ఆ శాప వచనమును శిష్యులు వినిరి.

దేవాలయము – ప్రార్థనాలయము

(మత్తయి 21:12-17; లూకా 19:45-48; యోహాను 2:13-22)

15. అంతట వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచట క్రయవిక్రయములు చేయు వారందరిని వెడలగొట్టెను. రూకలుమార్చువారి బల్లలను, పావురములను అమ్ము వారి పీటలను పడద్రోసెను.

16. దేవాలయపు ఆవరణమునుండి ఎవ్వరిని దేనిని తీసికొనిపోనీయ లేదు.

17. ” ‘నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును’ అని వ్రాయబడియుండలేదా? మీరు అట్టిదానిని దొంగలగుహగా మార్చితిరి” అని యేసు వారిని మందలించెను.

18. ఈ మాటలు వినిన ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లయినను చంపవలయును అని ఆలోచన చేయుచుండిరి. కాని, జనులందరు ఆయన బోధలకు ఆశ్చర్యచకితులగుటచే ఆయనకు భయపడిరి.

19. సాయంసమయమున ఆయన శిష్యులతో కూడ ఆ పట్టణమును వీడిపోయెను.

అంజూరము – గుణపాఠము

(మత్తయి 21:20-22)

20. మరునాడు ప్రాతఃకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి.

21. అపుడు పేతురు ”బోధకుడా! ఇదిగో, నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది” అనెను.

22. అందులకు యేసు ”మీరు దేవునియందు విశ్వాసము ఉంచుడు.

23. ఎవరైనను ఈ పర్వతముతో ‘నీవు లేచి సముద్రమునపడుము’ అని చెప్పి, తన హృదయములో సందేహింపక, తాను చెప్పినది జరుగునని విశ్వసించినయెడల అతను చెప్పినట్లుగనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24. కనుక మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు.

25. నీవు ప్రార్థించునపుడు నీ సోదరునిపై నీకు ఏమైన మనస్పర్థఉన్నచో వానిని క్షమింపుము. అపుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును.

26. కాని నీవు నీ సోదరుని క్షమింపని యెడల, పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పి దములను క్షమింపడు” అనెను.

క్రీస్తు అధికారము

(మత్తయి 21:23-27; లూకా 20:1-8)

27. అటు తరువాత వారు యెరూషలేమునకు తిరిగివచ్చిరి. యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, 28, ”ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు?  వీిని చేయుటకు  నీకు అధికారము ఇచ్చినది ఎవరు?” అని ఆయనను ప్రశ్నించిరి. 29. అందుకు యేసు, ”నేను కూడ మిమ్ము ఒక మాట అడిగెదను. దానికి సమాధానము  ఇచ్చినయెడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకును తెలిపెదను.

30. యోహాను బప్తిస్మము ఎచటనుండి వచ్చినది? పరలోకము నుండియా? లేక మానవుని నుండియా? నాకు సమాధానమిండు.” అనెను.

31. అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి. ”పరలోకమునుండి అని మనము చెప్పినయెడల ఆయన అట్లయిన మీరెందుకు యోహానును నమ్మలేదు అని అడుగును.

32. లేదా మానవులనుండి అని చెప్పితిమా! ప్రజలందరును యోహానును నిజమైనప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పుకలుగునో!” అని భయపడిరి.

33. ”మాకు తెలియదు” అని ఆయనతో చెప్పిరి. అపుడు ఆయన వారితో ”ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేనును చెప్పను” అనెను.