బూటకపు బోధకులు

4 1. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలను అనుసరించి, విశ్వాసభ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్ట పరచినది.

2. అసత్యవాదుల మోసపు మాటలనుండి ఇట్టి బోధనలు పుట్టును. కాల్చినకడ్డీతో వాతవేయబడినట్లు వారి అంతఃకరణములు నిర్జీవములైనవి గదా!

3. వివాహమాడుటయు, కొన్ని పదార్థములను తినుటయు దోషమని అట్టివారు బోధింతురు.  కాని సత్యమును గ్రహించిన విశ్వాసులు కృతజ్ఞతా పూర్వకముగ తినుటకుగాను ఈ పదార్థములను దేవుడు సృజించెను.

4. దేవుడు సృజించినది ఏదియైనను మంచిదే. మీరు దేనిని నిరాకరింపక కృతజ్ఞతా పూర్వకముగా స్వీకరింపవలెను.

5. దేవుని వాక్కు వలనను, ప్రార్థనవలనను అది పవిత్రపరుపబడినది.

క్రీస్తుయొక్క ఉత్తమ సేవకుడు

6. నీవు ఈ ఉత్తరువులను సోదరులకు అందించిన యెడల, క్రీస్తుయేసుయొక్క ఉత్తమ సేవకుడవు కాగలవు. అంతేకాక, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమగు బోధనచేతను, మంచి సిద్ధాంతము చేతను నిన్నునీవు పోషించుకొనుచున్నావని నీవు చూపగలవు.

7. ముసలమ్మలు చెప్పు అయోగ్యమైన గాథలకు దూరముగ ఉండుము. పవిత్ర జీవితమును అభ్యసింపుము.

8. శారీరక వ్యాయామము కొంత విలువైనదే. కాని, ఆధ్యాత్మిక వ్యాయామము ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగ విలువకలది.

9. ఈ మాట నమ్మదగినది. సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది.

10. కనుకనే, సర్వమానవులకు, అందును విశేషించి, విశ్వాసము కలవారికిని, రక్షకుడగు సజీవదేవునియందు మన నమ్మికను నిలిపి వుంచుకొని ప్రయాసపడుచు గట్టి కృషి చేయుచున్నాము.

11.ఈ విషయములనుశాసించి బోధింపుము.

12. నీవు వయసున చిన్నవాడవని ఎవరును నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగ ఉండుము.

13. నేను వచ్చువరకును నీవు పరిశుద్ధగ్రంథ పఠనము నందును, ప్రసంగములయందును, బోధనయందును శ్రద్ధ కలిగిఉండుము.

14. ప్రవచనమువలన పెద్దల హస్తనిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడియున్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము.

15. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము.

16. నిన్ను గూర్చియు, నీ ఉపదేశమును గూర్చియు జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను, నీ బోధనలను వినువారిని కూడ నీవు రక్షింప గలవు. ఇట్లే చేయుచుండుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము