ఉపోద్ఘాతము:

పేరు:  అబ్రాహాము సంతతిని హెబ్రీయులని పిలిచారు. ఈ లేఖలో సంబోధించిన హెబ్రీయులు యూదయ నేపథ్యం గల క్రైస్తవులు.  వీరు పాలస్తీనాలో లేదా అన్య ప్రాంతాలలో (ఉదా: రోము) జీవిస్తున్న యూదులు.

కాలం: ఈ లేఖలో జంతువుల బలి యర్పణలను గూర్చి ప్రస్తావించబడినందున, ఇది క్రీ.శ 70లో యెరుషలేము దేవాలయ పతనముకు ముందు వ్రాయబడినది.

రచయిత: పౌలు మాత్రం తాను ఈ గ్రంథకర్తనని లేఖలో చెప్పుకోలేదు. పౌలుగారి ఇతర లేఖలకు ఈ లేఖకు భాష, శైలి, భావవ్యత్యాసములుండుట వలన వేరొకరు వ్రాసి వుంటారని పండితుల అభిప్రాయం.

చారిత్రక నేపథ్యము: ఆది క్రైస్తవ సంఘం మొదట్లో విపరీతంగా వ్యాప్తిచెందింది. కాని తొందరలోనే అనేక వేదహింసలకు గురైంది. దీని కారణంగా కొంతమంది వారి విశ్వాసాన్నే వదులుకునే స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రోత్సహించడానికి ఈ లేఖను రాశారు. ఈ లేఖ గ్రీకు సంస్కృతిని, గ్రీకు తత్వాన్ని మేళవిస్తూ క్రైస్తవ విశ్వాసం గూర్చి వివరిస్తుంది. మతాభిలాష గల యూదులకు ఆది క్రైస్తవుల ఆచార పద్ధతులు వింతగాను, ప్రశ్నార్థకంగాను కనిపించాయి.  దీనికి వివరణగా క్రైస్తవ మతానికి పునాది యూద మతమేనని వివరిస్తూ, ఆ రెండు మతాలకు మధ్యనున్న వ్యత్యాసాలను గూడ తెలియచేసింది ఈ లేఖ.

ముఖ్యాంశములు:క్రీస్తు ప్రధాన ప్రాతిపదికగారాసిన లేఖ యిది. క్రీస్తుమానవులందరి పాపాలకు ప్రధానయాజకుడుగా, సంపూర్ణబలిగా తన ప్రాణాన్నర్పించి (9:23-10:18), తన పునరుత్థానం ద్వారా మానవాళిని దేవునితో అనుసంధానం చేశాడు (4:14-15; 7:1-8). క్రీస్తు సృష్టిలో అందరికంటె ప్రథముడు (1:5-14). ప్రవక్తలు, మోషే, యెహోషువల కంటె కూడా (2:1-4:13) అని చూపిస్తాడు. క్రీస్తు అనుగ్రహించిన పాపక్షమాపణ, నిరీక్షణ, నూతన జీవానికి మూలం (11:1)

క్రీస్తుచిత్రీకరణ: క్రీస్తు మెల్కీసెదెకు ప్రకారం ప్రధానయాజకుడు. క్రీస్తు ప్రవక్త,యాజకుడు, రాజు. క్రీస్తు మనుష్యత్వమును (2:9, 14, 17, 18), దైవత్వమును (1:1-3)  ప్రదర్శించారు. విశ్వాసం అనే పందెంలో క్రైస్తవులు క్రీస్తుపై దృష్టిపెట్టాలి. క్రీస్తు అన్నిటికన్నా, అందరికన్నా ”శ్రేష్ఠమైన వాడు” (1:4; 7:9, 22; 8:6; 9:23; 10:34; 11:16, 35, 40; 12:24). క్రీస్తుపై నమ్మకం ప్రధానం. దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడారు. కావున క్రీస్తునందు విశ్వాసమే ప్రధానం (11:1-40).