ధర్మశాస్త్రము – విశ్వాసము

3 1. అవివేకులగు గలతీయులారా! మీరు ఎవని మాయకు లోనైతిరి? సిలువపై యేసు క్రీస్తు మరణము మీ కన్నులయెదుట ప్రత్యక్షము చేయబడినదిగదా!

2. ఈ ఒక్క విషయము మీనుండి నేర్చుకొనగోరు చున్నాను. ధర్మశాస్త్రము ఆజ్ఞాపించుదానిని చేయుట వలన మీరు దేవునిఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో సువార్తను వినుటవలననా?

3. మీరు ఇంతటి మూర్ఖులా! మీరు దేవునిఆత్మతో ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా?

4. నిష్ప్రయోజనము గనే ఇన్ని కష్టములు అనుభవించితిరా? నిశ్చయముగ అవి వ్యర్ధమగునా?

5. దేవుడు మీకు ఆత్మనొసగి, మీ మధ్యలో అద్భుతములుచేయుట మీరు ధర్మశాస్త్ర మును అనుసరించుట చేతనేనా? లేక విశ్వాసముతో వినుటవలననా?

6.           ”అతడు దేవుని విశ్వసించెను.

               ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను.”

అని అబ్రహామును గూర్చి లేఖనము చెప్పుచున్నది.

7. కనుక, విశ్వాసముగలవారే అబ్రహాముయొక్క నిజమైన సంతతియని మీరు గ్రహింపవలెను.

8. విశ్వాసమువలన అన్యజనులను నీతిమంతులుగ దేవుడు చేసికొనునని లేఖనము ముందే చెప్పుచున్నది. కనుకనే అది

               ”భువియందలి ప్రజలందరిని

               దేవుడు నీ ద్వారా దీవించును”

అను శుభసందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది.

9. అబ్రహాము విశ్వసించెను. కనుకనే దీవింపబడెను. అతనివలెనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు.

10. ధర్మశాస్త్రము విధించిన క్రియ లపై అధారపడియుండువారు శాపగ్రస్తులు అగుదురు. ఏలయన, లేఖనము చెప్పుచున్నట్లు,

               ”ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడిన

               నియమములన్నిటికి సర్వదా

               విధేయుడుకాని వ్యక్తి శాపగ్రస్తుడగును”.

11. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తియైనను నీతి మంతుడు కాజాలడు అనుట ఇపుడు స్పష్టమే కదా! ఏలయన,

               ”విశ్వాసము ద్వారా నీతిమంతుడు

               జీవించును”

12. కాని ధర్మశాస్త్రము విశ్వాసముపై ఆధారపడి యుండలేదు. ఏలయన,

               ”ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వానివలన జీవించును.”

13. క్రీస్తు, మనకొరకు ఒక శాపమై, ధర్మ శాస్త్రము తెచ్చిపెట్టిన శాపమునుండి మనలను విముక్తు లను చేసెను. లేఖనము చెప్పుచున్నట్లు,

               ”చెట్టుకు వ్రేలాడవేయబడిన

               ప్రతివ్యక్తియు శాపగ్రస్తుడు.”

14. దేవుడు అబ్రహామునకు ఒసగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును, విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఒనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అటుల చేసెను.

ధర్మశాస్త్రము – వాగ్దానము

15. సోదరులారా!  నేను  మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మానవునిదైనను ఒక ఒప్పందము ఏర్పడిన పిదప దానిని రద్దుచేయుటగాని, మార్పు చేయుటగాని జరుగదు.

16. వాగ్దానములను దేవుడు అబ్రహామునకును అతని కుమారునకును చేసెను.  ”అతని కుమారులకు” అని పెక్కుమందిని సూచించుచు బహువచనములో అచట చెప్పబడలేదు. కాని ”కుమారునకు” అని ఒకనిని సూచించుచు ఏకవచన ములో చెప్పబడినది. ఆ కుమారుడు క్రీస్తు.

17. నా భావము ఏమన, వాగ్దానము వ్యర్థమగునట్లు నాలుగు వందల ముప్పది సంవత్సరముల తదుపరి వచ్చిన ధర్మశాస్త్రము దేవునిచే ధ్రువీకరింపబడిన నిబంధనను రద్దుచేయదు.

18. ఏలయన, వారసత్వపు హక్కు ధర్మశాస్త్రముపై ఆధారపడిఉన్నచో, ఇక ఆయన వాగ్దాన ముపై ఆధారపడి ఉండదు. కాని దేవుడు దానిని అబ్రహామునకు వాగ్దానము చేతనే ప్రసాదించెను.

19. అటులైనచో ధర్మశాస్త్రము ఏల ఒసగబడెను? తప్పు అన ఎట్టిదో చూపుటకు వాగ్దానమును పొందిన కుమారుడు వచ్చువరకే అది చేర్చబడెను. ధర్మ శాస్త్రము, ఒక మధ్యవర్తిద్వారా దేవదూతలచే నియమింప బడెను. 20. మధ్యవర్తిత్వము అనగా ఒకరికన్నా ఎక్కువగా ఉందురు. కాని దేవుడు ఒక్కడే.

ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము

21. అయినచో దేవుని వాగ్దానములకు ధర్మ శాస్త్రము విరుద్ధమా? ఎంత మాత్రమును కాదు!  ఏలయన, మానవులకు ప్రాణము పోయగలిగిన ఏదైన ఒక చట్టము ఒసగబడియున్నచో, అప్పుడు ఆ చట్టముద్వారా దేవుని నీతి లభించియుండును.

22. కాని లేఖనము సమస్తమును పాపమునకు గురి చేసినది. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన  వాగ్దానము  విశ్వసించువారికి ఇయ్యబడినది.

23. కాని విశ్వాస సమయము ఆసన్నముకాక పూర్వము, విశ్వాసము ప్రత్యక్షమగువరకు, ధర్మ శాస్త్రము మనలను బందీలనుగా చేసినది.

24. కాబట్టి మనమువిశ్వాసమూలమున నీతిమంతులుగ తీర్చబడునట్లు క్రీస్తువద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

25. విశ్వాస సమయము వచ్చినందువలన, ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యములేదు.

26. ఏలయన, క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరును దేవుని పుత్రులు.

27. ఏలయన, క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించియున్నారు.

28. కావున, యూదుడని, అన్యు డని లేదు. బానిసని, స్వతంత్రుడని లేదు. స్త్రీయని, పురుషుడని లేదు. ఏలయన, క్రీస్తు యేసునందు మీరందరును ఒక్కరే.

29. మీరు క్రీస్తునకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతికూడ అగుదురు. కనుక దేవుని వాగ్దానమునుబట్టి మీరును వారసులే.