శత్రువులమీద ఫిర్యాదు చేయుచు దేవునికి ప్రార్థన

ప్రధాన గాయకునికి

దావీదు కీర్తన

109  1.   దేవా! నేను నిన్ను స్తుతింతును.

                              నీవు ఇక మౌనముగా ఉండవలదు.

2.           దుష్టులు, కల్లలాడువారు నన్ను నిందించుచున్నారు

               నామీద చాడీలు చెప్పుచున్నారు.

3.           వారు నన్నుగూర్చి చెడ్డగా మ్లాడుచున్నారు.

               నిష్కారణముగా నా మీదికి వచ్చుచున్నారు.

4.           నేను వారిని ప్రేమించి వారికొరకు ప్రార్థన చేసినను

               వారు నన్ను ద్వేషించుచున్నారు.

5.           నేను వారికి మేలు చేయగా

               వారు నాకు కీడు చేయుచున్నారు.

               నేను వారిని ప్రేమింపగా

               వారు నన్ను ద్వేషించుచున్నారు.

6.           వానిమీద దుష్టుని అధికారిగానుంచుము.

               ఎవడైన ఒకడు అతనిమీద నేరము

               మోపునట్లు చేయుము.

7.            అతనికి తీర్పుచెప్పు వారు అతనిని

               దోషినిగా నిర్ణయింతురుగాక!

               అతని ప్రార్థనకూడ నేరముగా గణింపబడునుగాక!

8.           అతడు అకాల మృత్యువువాత పడునుగాక!

               అతని ఉద్యోగము మరియొకనికి దక్కునుగాక!

9.           అతని బిడ్డలు అనాథలగుదురుగాక!

               అతని భార్య వితంతువగునుగాక!

10.         అతని బిడ్డలు దేశదిమ్మరులు,

               బిచ్చగాండ్రు అగుదురుగాక!

               వారు వసించు పాడువడిన కొంపలనుండి

               వారిని తరిమివేయుదురుగాక!

11.           అప్పులవారు అతని ఆస్తిని

               ఆక్రమించుకొందురుగాక!

               అతడు కష్టించి ఆర్జించిన సొత్తును

               అన్యులు దోచుకొందురుగాక!

12.          ఎవడును అతనికి దయచూపకుండునుగాక!

               అతని అనాథ సంతానమునెవడును

               ఆదుకొనకుండునుగాక!

13.          అతని సంతతి నాశనమగునుగాక!

               ఒక్క తరములోనే అతని పేరు మాసిపోవునుగాక!

14.          ప్రభువు అతని పితరుల పాపములను

               జ్ఞాపకముంచుకొనునుగాక!

               అతని తల్లి అపరాధములను

               మన్నింపకుండునుగాక!

15.          ప్రభువు వారి తప్పులను ఎల్లవేళల

               జ్ఞాపకముంచుకొనునుగాక!

               వారి పేరును భూమి మీదనుండి

               తుడిచివేయునుగాక!

16.          అతడేనాడును దయాపరుడుగా మెలగలేదు.

               పేదలను, ఆర్తులను, నిస్సహాయులను

               హింసించి చంపెను.

17.          శాపవచనములు అతనికి ఇష్టము.

               అతనికి శాపము కలుగునుగాక!

               అతడు దీవించుటకు ఇష్టపడలేదు,

               అతనికి దీవెనలు ప్రాప్తింపకుండునుగాక!

18.          అతడు శాపములను అంగీవలె తొడుగుకొనెను.

               ఆ శాపములు నీివలె

               అతని దేహములోనికి చొచ్చుకొనిపోవునుగాక!

               తైలమువలె అతని ఎముకలలోనికి

               ప్రవేశించునుగాక!

19.          ఆ శాపములను అతడు బట్టలవలె

               కప్పుకొనునుగాక!

               నిత్యము నడికట్టువలె ధరించునుగాక!

20.        నా శత్రువులకు,

               నన్నుగూర్చి చెడుగా మ్లాడువారికి

               ప్రభువు ఇట్లు శాస్తిచేయునుగాక!

21.          నా దేవుడవైన ప్రభూ!

               నీ నామము నిమిత్తము నన్ను ఆదుకొనుము.

               నీ స్థిరమైన కృప మంచిది కనుక నన్ను కాపాడుము

22.         నేను బలహీనుడను, దరిద్రుడను.

               నా హృదయము గాఢసంతాపమున

               మునిగియున్నది.

23.         నేను సాయంకాలపు నీడవలె గతింపనున్నాను.

               నన్ను మిడుతనువలె ఎగురగ్టొిరి.

24.         ఉపవాసముచేత నా మోకాళ్ళు బలమును

               కోల్పోయినవి, నేను చిక్కిసగమైతిని.

25.         నేను నవ్వులపాలయితిని.

               జనులు నన్ను గేలిచేయుచు తల ఆడించుచున్నారు

26.        నా దేవుడవైన ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుము.

               నీవు కృపామయుడవు గాన నన్ను రక్షింపుము.

27.         అది నీ హస్తమువలననే చేయబడినదని

               వారు తెలుసుకొందురు. 

               ఓ ప్రభూ! ఇది నీవే చేసితివి.

28.        వారి శాపములకు బదులుగా

               నీవు నాకు దీవెనలిత్తువు.

               నన్ను హింసించువారు ఓడిపోవుదురుగాక!

               నీ దాసుడనైన నేను సంతసింతునుగాక!

29.        నా శత్రువులు నగుబాట్లు తెచ్చుకొందురుగాక!

               అవమానమును బట్టనువలె తాల్తురు గాక!

30.        నేను ప్రభువును పెద్దగా స్తుతింతును.

               భక్తసమాజమున ఆయనను కీర్తింతును.

31.          ఆయన పేద నరుని కోపు తీసికొని మరణశిక్ష

               విధించు వారినుండి అతనిని కాపాడును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము