చక్రవర్తికి పౌలు అభ్యర్థన

25 1. ఫెస్తు దేశాధికారమునకు వచ్చిన మూడు దినముల పిమ్మట కైసరియా నుండి యెరూషలేము నకు వెళ్ళెను.

2. అక్కడ ప్రధానార్చకులు, యూదుల నాయకులు పౌలుకు విరుద్ధముగా ఫిర్యాదులు తీసికొని వచ్చిరి.

3. వారు ఒక కుట్ర పన్ని పౌలును దారిలోనే చంపదలంచినందున, పౌలును యెరూషలేమునకు పంపి తమకు ఉపకారము చేయవలెనని వారు ఫెస్తును బతిమాలిరి.

4. అప్పుడు ఫెస్తు, ”పౌలు కైసరియాలోనే ఖైదీగా ఉంచబడినవాడు. మరి నేను కూడ త్వరలోనే అచటకు వెళ్ళుచున్నాను.

5. మీ నాయకులు నాతో కూడ కైసరియాకు వచ్చి అతడు ఏదైనా నేరముచేసి ఉండినచో వానిని గూర్చి నిందా రోపణము చేయవచ్చును” అని వారికి సమాధాన మిచ్చెను.

6. ఫెస్తు వారితో ఇంకను ఎనిమిది లేక పది దినములు గడిపి కైసరియాకు వెళ్ళెను. ఆ మరుసి దినము అతడు న్యాయసభలో కూర్చుండి పౌలును లోనికి తీసికొనిరండని ఆజ్ఞాపించెను.

7. పౌలు సభలోనికి వచ్చినపుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టును చేరి, అతనికి వ్యతిరేకముగ పెక్కు తీవ్రమైన నేరములను మోపిరి. కాని, వానిని రుజువు చేయలేకపోయిరి.

8. పౌలు, ”నేను యూదుల చట్టమునకుగాని, దేవాలయమునకుగాని, రోము చక్రవర్తికిగాని విరుద్ధముగా ఏ నేరమును చేసియుండ లేదు” అని చెప్పి తన తరపున వాదించెను.

9. ఫెస్తు యూదుల అభిమానమును పొందగోరి, ”యెరూషలేములో నా యెదుటనే, ఈ నేరములు విచారింపబడుట నీకు ఇష్టమేనా?” అని పౌలును ప్రశ్నించెను.

10. అందుకు పౌలు, ”నేను చక్రవర్తి న్యాయస్థానములోనే నిలబడి ఉన్నాను. ఇచ్చటనే నేను విచారింపబడవలెను. నేను యూదులయెడల ఏ నేరమును చేయలేదు. అది మీకు బాగుగా తెలియును.

11. నేను చట్టమును ఉల్లంఘించి గాని, లేక మరణశిక్షకు తగిన నేరము చేసిగాని, నన్ను రక్షింపుమని మిమ్ములను బతిమాలుటలేదు. కాని నాపై మోపబడిన నేరములలో సత్యము లేకపోయి నచో నన్ను ఎవరును వారికి అప్పగింపలేరు. నేను ఈ విషయమును చక్రవర్తికి విన్నవించుకొందును” అని పలికెను.

12. అప్పుడు ఫెస్తు అతని సలహాదారు లతో సంప్రతించిన పిమ్మట, ”నీవు చక్రవర్తికి చెప్పుకొన దలచితివిగాన నిన్ను చక్రవర్తి యొద్దకే పంపెదము” అని బదులు పలికెను.

అగ్రిప్ప, బెర్నీసుల యెదుట పౌలు

13. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు, బెర్నీసు, కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. 14. అక్కడ వారు చాల దినములు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను: ”ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడినవాడు ఒకడున్నాడు. 

15.   నేను యెరూషలేమునకు వెళ్ళినపుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి, అతనిని శిక్షింపుడని కోరిరి.

16. ముద్దాయి తనపై నేరారోపణ కావించువారిని ముఖాముఖిగా కలిసికొని తన పక్షమున తాను వాదించు కొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీయులకు లేదని నేను వారితో చెప్పితిని.

17. వారందరు ఇచటకు వచ్చినపుడు నేను కాలము వృధాచేయక మరుసి దినముననే న్యాయసభలో కూర్చుండి, ఆ మనుష్యుని లోనికి తీసికొనిరమ్మని ఆజ్ఞాపించితిని.

18. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి, వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరము ఏదియు అతనిపై మోపలేదు.

19. వారు తమ మతమును గూర్చి , పౌలుచేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి.

20. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించు కొనలేక పౌలును యెరూషలేముకు పోయి ఈ నిందా రోపణలపై అచ్చట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని.

21. కాని పౌలు, తనను సంరక్షణలో ఉంచి, తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తియొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించితిని” అనెను.

22. అది విని అగ్రిప్ప, ”ఇతడు చెప్పెడు దానిని నేను స్వయముగా వినదలచి తిని” అని ఫెస్తుతో చెప్పగా, ”సరే, రేపు మీరు వినవచ్చును” అని ఫెస్తు బదులు పలికెను.

23. మరుసటిరోజు అగ్రిప్ప, బెర్నీసు, సైన్యాధి పతులతోను, పుర ప్రముఖులతోను రాజ లాంఛన ములతోను దర్బారులో ప్రవేశించిరి. పౌలును లోనికి తీసికొనిరమ్మని ఫెస్తు ఆజ్ఞాపింపగా అతడు లోనికి తీసికొని రాబడెను. 24. ఫెస్తు ఇట్లు చెప్పనారంభించెను: ”అగ్రిప్పరాజా! ఇచట మాతో ఉన్నవారలారా! ఈ మనుష్యుని మీరు చూచుచున్నారు కదా! ఇక్కడను, యెరూషలేములోని యూదజనులందరును ఇతనికి వ్యతిరేకముగ నావద్దకు ఫిర్యాదులు తెచ్చిరి. ఇతడు ఇంకేమాత్రము బ్రతికియుండరాదని అరచిరి.

25. కాని మరణశిక్ష విధింపబడుటకు తగిన నేరము ఏదియు ఇతడు చేయలేదు అని నేను గ్రహించితిని. మరియు ఇతడు చక్రవర్తి యొద్దకు పోవలెనని కోరు కొన్నప్పుడు నేను ఇతనిని అక్కడకే పంపవలెనని నిర్ణయించుకొంటిని. 26. కాని, ఇతనిని గురించి చక్రవర్తికి ఏమి వ్రాసిపంపవలెనో నాకు సరిగా తెలియుటలేదు. అందుచే ఇతనిని మీ ఎదుటకు, అగ్రిప్పరాజా! ప్రత్యేకముగా ఇతనిని మీ సమక్షమునకు తెచ్చితిని. కనుక, ఇతనిని విచారించిన పిదప, చక్రవర్తికి వ్రాయుటకు ఏదైన కొంతవిషయము దొరక వచ్చును.

27. ఏలయన, ముద్దాయికి వ్యతిరేకముగ ఆరోపింపబడిన నేరములను స్పష్టము చేయకయే ఇతనిని అక్కడకు పంపుట ఉచితము కాదని నాకు తోచుచున్నది” అనెను.