యిస్రాయేలీయుల ఉద్ధరణకొరకు ప్రార్థన

36 1.      విశ్వాధిపతివైన ప్రభూ!

                              మమ్ము చల్లనిచూపున చూచి కరుణింపుము

2.           ప్రతి జాతియు నీకు భయపడునట్లు చేయుము.

3.           అన్యజాతులను శిక్షించి,

               వారు నీ బలమును గుర్తించునట్లు చేయుము.

4.           నీ పావిత్య్రమును ప్రదర్శించినట్లే మా ఎదుట

               వారిని శిక్షించి నీ శక్తిని నిరూపింపుము.

5.           నీవుతప్ప మరియొక దేవుడులేడని

               మేము అంగీకరించినట్లే అన్యులు కూడ

               అంగీకరించునట్లు చేయుము.

6.           ఇప్పుడు నూత్నముగా అద్భుతములను

               సూచక క్రియలనుచేసి

               నీ మహాబలమును నిరూపింపుము.

7.            నీ కోపమును చూప్టిె, నీ రౌద్రమును ప్రదర్శించి

               మా శత్రువులను మట్టుపెట్టుము.

8.           నీవు నిర్ణయించిన తీర్పురోజును త్వరగా రప్పించి

               ప్రజలు నీ మహాకార్యములను

               కొనియాడునట్లు చేయుము.

9.           నీ కోపము దుర్మార్గులను కబళించివేయునుగాక! నీ ప్రజలను పీడించువారు

               సర్వనాశనమగుదురు గాక!

10.         ”మా అంతివారు లేరు” అని           

               విఱ్ఱవీగు శత్రురాజులను నలిపివేయుము.

11.           యిస్రాయేలు తెగలన్నిని

               మరల ప్రోగుజేయుము.

               నీవు పూర్వమొసగిన భూమిని వారికి

               మరల దయచేయుము.

12.          నీ పేరు మీదుగా పిలువబడు

               ఈ యిస్రాయేలీయులను,

               నీవు నీ ప్రథమ కుమారుడని చెప్పుకొనిన

               ఈ ప్రజను కరుణింపుము.

13.          నీవు నీ నివాసస్థలముగా ఎన్నుకొనినదియు

               నీ పరిశుద్ధనగరమునైన యెరూషలేమును

               కాక్షింపుము.

14.          సియోను నీ స్తుతిగానములతో

               మారుమ్రోగునుగాక!

               దేవాలయము నీ మహిమతో నిండునుగాక!    

15.          నీవు మొట్టమొదట సృజించిన

               ఈ ప్రజలను అంగీకరింపుము.

               నీ పేరిట ప్రవక్తలు పలికిన

               ప్రవచనములను నెరవేర్చుము.

16.          నీ కొరకు కాచుకొనియున్నవారిని

               బహూకరింపుము.

               నీ ప్రవక్తలు నమ్మదగినవారు అని

               ఋజువు చేయుము.

17.          అహరోను దీవెనలు పొందిన వారమును,

               నీ దాసులమయిన మా మొరనాలింపుము.

               అప్పుడు భూమిమీద నరులెల్లరు

               నీవే ప్రభుడవనియు, నిత్యుడవైన దేవుడవనియు

               నమ్ముదురు.

విచక్షణము

18.          నరుడు ఏ రకపు భోజనమునైన ఆరగింపగలడు. కాని కొన్నిరకముల ఆహారములు మెరుగైనవి.

19.          నాలుక వివిధ మాంసముల రుచిని గుర్తించును.

               అట్లే తెలివి కలవాడు అబద్ధములను గుర్తుపట్టును

20.        సంకుచిత మనస్తత్వము కలవారు

               బాధలు తెచ్చిపెట్టుదురు.

               కాని అనుభవశాలి వారికి 

               తగినట్లుగా బుద్ధిచెప్పును.

భార్యా స్వీకరణము

21.          స్త్రీ ఏ పురుషుడినైనా వరించును.

               కాని పురుషుడు తనకు నచ్చిన యువతిని

               ఎన్నుకొనును.

22.        స్త్రీ సౌందర్యము పురుషునికి

               ఆనందము కలిగించును.

               నరుని కింకి అంత  కంటె ఇంపయినది లేదు.

23.        స్త్రీ కరుణతో మృదువుగా మాటలాడగలిగినచో ఆమె భర్త మహాదృష్టవంతుడైనట్లే.

24.         భార్యను బడసిన వారు అదృష్టమును పొందినట్లే.

               ఆమె అతనికి సాయముచేసి

               అతనిని ప్రోత్సాహించును.   

25.        కంచెలేని స్థలమును అన్యులు

               ఆక్రమించుకొందురు.

               భార్యలేని పురుషుడు నిట్టూర్పులతో

               ఊళ్ళవెంట తిరుగును.

26.        సాయుధుడై ఊరినుండి ఊరికి తిరుగాడు దొంగవానిని ఎవ్వరును నమ్మరు.

27.         అట్లే సొంతయిల్లు లేక ఎక్కడ చీకిపడిన

               అక్కడనే నిద్రించు వానిని ఎవ్వరు నమ్మరు.