కనాను దేశమున వేగు నడపుట
13 1-2. ప్రభువు మోషేతో ”ప్రతి తెగకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము. నేను మీకు ఆ భూమిని ఇచ్చెదను” అని చెప్పెను.
3-15. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారినుండి తెగల నాయకులను పంపెను. వారి పేరులివి:
రూబేను తెగనుండి సక్కూరు కుమారుడగు షమ్మువా, షిమ్యోను తెగనుండి హోరి కుమారుడగు షాఫతు, యూదా తెగనుండి యెఫున్నె కుమారుడగు కాలెబు, యిస్సాఖారు తెగనుండి యోసేపు కుమారు డగు ఈగాలు, ఎఫ్రాయీము తెగనుండి నూను కుమారుడగు హోషేయ, బెన్యామీను తెగనుండి రాపు కుమారుడగు పాల్టీ, సెబూలూను తెగనుండి సోడి కుమారుడగు గద్దీయేలు, యోసేవు తెగ అనగా మనష్షే తెగనుండి సూసి కుమారుడగు గదీ, దాను తెగనుండి గెమల్లి కుమారుడగు అమ్మియేలు. ఆషేరు తెగనుండి మికాయేలు కుమారుడగు సేతూరు, నఫ్తాలి తెగనుండి వోప్సీ కుమారుడగు నాబి, గాదు తెగనుండి మాఖి కుమారుడగు గెయువేలు.
16. ఆ దేశమున వేగు నడపుటకు మోషే పంపినవారి పేరులివి. అప్పుడే మోషే నూను కుమారు డగు హోషేయకు ‘యెహోషువ’ అని పేరుపెట్టెను.
17. మోషే వీరిని వేగు నడుపుటకై కనాను దేశమునకు పంపుచు ”మీరు నేగేబు చేరి పర్వత భూములలోనికి పొండు.
18. అది ఎటువిం దేశమో, అచి ప్రజలు బలవంతులో, బలహీనులో, కొద్ది మందియో, చాలమందియో తెలిసికొనుడు.
19. వారు నివసించు దేశము మంచిదో, చెడుదో పరి కింపుడు. అందలి పట్టణములు సురక్షితములో, అరక్షితములో పరిశీలింపుడు.
20. ఆ నేల సారవంత మైనదో, నిస్సారవంతమైనదో, అచట అడవులున్నవో, లేవో గుర్తింపుడు. మీరు ధైర్యముగానుండుడు. ఆ దేశమున పండు పండ్లనుగూడ కొన్నిని మా కడకు కొనిరండు” అని చెప్పెను.
21. అది ద్రాక్షలు కాపునకువచ్చి తొలిపండ్లను ఇచ్చుకాలము. వేగు చూడబోయినవారు సీను ఎడారినుండి రెహాబు వరకు పోయి హామ్మతు కనుమ చేరిరి.
22. అక్కడినుండి నేగేబు, హెబ్రోను వరకు పోయిరి. అక్కడ అనాకీయులగు అహిమాను, షేషాయి, తల్మాయి వంశములకు చెందినవారు జీవించు చుండిరి. హెబ్రోను నగరము ఐగుప్తులోని తానీసు కంటె ఏడేండ్లకు ముందే నిర్మింపబడినది.
23. అంతట వేగులవాండ్రు ఎష్కోలులోయ చేరుకొనిరి. అక్కడ ఒక గుత్తిగల ద్రాక్షరెమ్మను ఒక దానిని కోసి. ఆ గుత్తిని ఇద్దరుమనుజులు కఱ్ఱమీద మోసిరి. మరియు దానిమ్మపండ్లను, అంజూరపు పండ్లనుకూడ కోసికొనిపోయిరి.
24. అచట యిస్రాయేలీయులు ద్రాక్షగుత్తినికోసిరి కావున ఆ తావునకు ఎష్కోలు1లోయ అని పేరువచ్చెను.
వేగులవాండ్ర సమాచారము
25. నలువదిదినములైన తరువాత గూఢచారులు వేగు ముగించుకొని తిరిగివచ్చి, 26. పారాను ఎడారిలో కాదేషువద్ద మోషేను, అహరోనును, యిస్రాయేలు ప్రజలను కలసికొనిరి. ఆ వేగులు కనాను దేశమున చూచిన వానిని వారికి విన్నవించి, తాము కొనివచ్చిన పండ్లను చూపించిరి.
27. గూఢచారులు ఇట్లు చెప్పిరి: ”మేము మీరు పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలుతేనెలు జాలువారు భూమి. ఇవిగో! అక్కడ పండిన పండ్లు కూడ చూడుడు.
28. కాని అచట నివసించుప్రజలు మహాబలవంతులు. వారి పట్టణములు చాలపెద్దవి. సురక్షితములు కూడ. పైపెచ్చు అచట అనాకీయులను గూడ చూచితిమి.
29. నేగేబు అమాలెకీయుల వశమున ఉన్నది. హిత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు పర్వతభూములను ఏలుచున్నారు. సముద్రతీరము, యోర్దానుతీరము కనానీయుల అధీనమున ఉన్నవి.”
30. కాలెబు మోషే ఎదుట ప్రజలను శాంత పరచి ”వెంటనే మనము ఆ దేశము మీదికి దండెత్తి పోవలెను. దానిని తప్పక జయింపగలము” అని అనెను.
31. కాని వేగులవాండ్రు ”మనము ఆ ప్రజలను ఎదుర్కొనలేము. వారు మనకంటె బల వంతులు” అనిరి.
32. వారు తాము చూచి వచ్చిన దేశము మంచిదికాదని రుజువు చేయుటకై నెపములు చెప్పసాగిరి. ”మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించును. ఆ దేశీయులు నెఫీలీ యులు అను మహాకాయులు.
33. మేము అచట రాక్షసుల విం దృఢకాయులను చూచితిమి. వారు అనాకు సంతతివారు. వారి ఎదుట మాకు మేము మిడుతల వలె కనిపించితిమి. నిక్కముగా వారిదృష్టికి కూడ మేమట్లే చూప్టియుందుము” అని యనిరి.