యెహోయాకీము

పరిపాలనానంతర ప్రవచనములు

సిద్కియా దూతలకు యిర్మీయా జవాబు

21 1. యూదారాజగు సిద్కియా, మల్కియా కుమారుడగు పషూరును, మాసేయా కుమారుడును, యాజకుడునగు సెఫన్యాను నా యొద్దకు పంపెను.

2. వారు ”నీవు మా తరపున ప్రభువును సంప్ర తింపుము. బబులోనియా రాజగు నెబుకద్నెసరు మన మీద యుద్ధముచేయుచున్నాడు. ఒకవేళ ప్రభువు మనకొరకు అద్భుతకార్యములు చేసి శత్రువును పార ద్రోలవచ్చును” అని నన్ను అర్థించిరి.

3. అపుడు ప్రభువు నాతో మాటలాడగా నేను ఆ దూతలతో ఇట్లింని: 4. ”మీరు సిద్కియాకు ఈ కబురు చెప్పుడు. ‘యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు. నేను ప్రాకారము వెలుపల నగరమును ముట్టడించియున్న బబులోనియా రాజుతోను, అతని సైన్యముతోనుపోరాడు నీ సైన్యమును ఓడింతును. నీ సైనికుల ఆయుధములను నగరమధ్యమున కుప్ప వేయింతును.

5. నేను కోపముతోను, ఆగ్రహము తోను, రౌద్రముతోను, మహాబలముతోను నిన్నె దిరించి పోరాడుదును.

6. నేను ఈ నగరములోని నరులను, పశువులను చంపుదును. ఎల్లరును  ఘోర మైన  అంటురోగమువలన చత్తురు.

7. అటుపిమ్మట నేను నిన్నును, నీ ఉద్యోగులను అంటురోగమును, యుద్ధమును, కరవును తప్పించుకొని బ్రతికిన ప్రజ లను, బబులోనియా రాజైన నెబుకద్నెసరు, మీ విరోధులు పట్టుకొనునట్లు చేయుదును, వారు మిమ్ము చంపగోరుదురు. నెబుకద్నెసరు మిమ్ము వధించును. అతడు మీలోనెవరినీ వదలిపెట్టడు. ఎవరిమీదను దయాదాక్షిణ్యములు చూపడు. ఇది ప్రభుడనైౖన నా వాక్కు.”

8. అటుపిమ్మట ప్రభువు నన్ను ప్రజలతో ఇట్లు చెప్పుమనెను: ఇవి ప్రభువు పలుకులు. మీరిపుడు జీవనమార్గమును గాని, మృత్యు మార్గమును గాని ఎన్నుకోవచ్చును.

9. ఈ నగరమున నిలుచువాడు యుద్ధమువలనను, ఆకలివలనను, అంటురోగముల వలనను చచ్చును. కాని ఇచినుండి వెళ్ళిపోయి నగరమును ముట్టడించుచున్న బబులోనీయులను శరణువేడువాడు బ్రతికిపోవును. అతడు కనీసము ప్రాణములైన కాపాడుకోవచ్చును.

10. నేను ఈ నగ రమును కాపాడదల్చుకోలేదు. దానిని బబులోనియా రాజునకు అప్పగింతును. అతడు దానిని తగుల బెట్టును. ఇది ప్రభుడనైన నా వాక్కు .’

యూదా రాజకుటుంబమునకు శిక్ష

11. యూదా రాజకుటుంబమునకు ప్రభువు సందేశము. ‘మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు. 12. దావీదు వంశజులారా! ప్రభువు ఇట్లనుచున్నాడు:                   మీరు ప్రతిదినమును

               న్యాయమైన తీర్పులుతీర్పుడు.

               వంచనకు గురియైన వారిని

               వంచకులనుండి కాపాడుడు.

               లేదేని మీ దుష్కార్యములవలన

               నా కోపము నిప్పువలె రగుల్కొని గనగనమండును.

               దానిని ఎవడును  ఆర్పజాలడు.’ ”

13.          ”యెరూషలేమూ! నీవు లోయలకుపైన

               ఎత్తయిన తావున కూర్చుండియున్నావు.

               పొలములోని కొండవలె పైకి ఎగసియున్నావు.

               నేను నిన్నెదిరింతును.

               నిన్నెవరును ఎదిరింపజాలరనియు,

               నీ కోటను ఎవరును ఛేదింపజాలరనియు

               నీవు అనుచున్నావు.

14.          నీ చెయిదములకుగాను నేను నిన్ను శిక్షింతును.

               నేను నీ ప్రాసాదమునకు నిప్పు పెట్టుదును.

               ఆ అగ్గి చుట్టుపక్కల ఉన్న వానిని

               అన్నిని దహించును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.”