శిష్యుల కొరకు ప్రార్థన

17 1. యేసు ఈ మాటలు చెప్పి, ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను: ”తండ్రీ! గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము.

2. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్యజీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవు లందరిపై అధికారమును ఒసగితివి.

3. ఏకైక సత్య దేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్యజీవము.

4. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమపరచితిని.

5. ఓ తండ్రీ! లోక ఆరంభమునకు పూర్వము నీయొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము.

6. ”ఈ లోకమునుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి.

7. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీనుండియేనని వారు ఇపుడు గ్రహించిరి.

8. నీవు నాకొసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి, నేను నిజముగ నీయొద్దనుండి వచ్చితినని తెలిసికొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి.

9. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకముకొరకుకాక నీవు నాకు అనుగ్రహించినవారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలయన వారు నీవారు.

10. నా సర్వస్వము నీది. నీది అంతయు నాది. నేను వారియందు మహిమపరుపబడితిని.

11. నేను ఇక ఈ లోకమున ఉండను. కాని, వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రీ! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామము నందు సురక్షితముగ ఉంచుము.

12. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు.

13. కాని, నేను ఇపుడు నీయొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారియందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను.

14. నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఏలయన, నావలె వారును లోకమునకు చెందినవారు కారు.

15. వారిని లోకము నుండి తీసికొనిపొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు. కాని, దుష్టునినుండి కాపాడుమని ప్రార్థించు చున్నాను.

16. నావలె వారును లోకమునకు చెందిన వారుకారు.

17. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము.

18. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపి తిని.

19. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడునట్లు వారికొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను.

20. వీరికొరకు మాత్రమేకాక, వీరి బోధద్వార నన్ను విశ్వసించు వారికొరకు ప్రార్థించుచున్నాను.

21. ”వారందరు ఒకరుగ ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రీ! నేను నీయందును, నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగ ఐక్యమై ఉండనిమ్ము.

22. మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికిని అను గ్రహించితిని.

23. వారు సంపూర్ణముగ ఐక్యమై ఉండుటకును, నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లు వారినికూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనుటకును నేను వారియందును, నీవు నాయందును ఉన్నాము.

24. ఓ తండ్రీ! వారిని నీవు నాకు ఒసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండ వలయునని కోరుచున్నాను. ఏలయన, లోకారంభము నకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి.

25. నీతి స్వరూపుడవగు తండ్రీ! లోకము నిన్ను ఎరుగదు.  కాని,  నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు.

26. నీవు నాయందు కనబరచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, నిన్ను వారికి తెలియచేసితిని. ఇక ముందును తెలియచేసెదను.”