విగ్రహారాధనను నిర్మూలించుట
31 1. ఉత్సవము ముగిసినపిదప ప్రజలు యూదా లోని ప్రతిపట్టణమునకు వెళ్ళి విగ్రహములను, అషేరా స్తంభములను, ఉన్నతస్థలములలోని బలిపీఠములను నిర్మూలించిరి. వారు యూదా దేశమందంతటను మరియు ఎఫ్రాయీము బెన్యామీను మనష్షే మండల ములలోను ఆ రీతినేచేసిరి. తరువాత యిస్రాయేలీయు లందరు తమ తమ నగరములకు నివాసములకు తిరిగి చేరుకొనిరి.
లేవీయులను, యాజకులను
వర్గములుగా విభజించుట
2. హిజ్కియా ఎవ్వరి పరిచర్య వారు చేయు నట్లుగా యాజకుల వరుసక్రమమును, లేవీయులను వారి వారి వరుసలనుబ్టి నియమించెను. దహన బలులును, సమాధానబలులును అర్పించుటకును, పరిచర్యచేయుటకును, దేవాలయమున స్తుతులు చెల్లించుటకును, ప్రభువు శిబిరద్వారముల వద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను.
3. ప్రతిదినము ఉదయ సాయంకాలము లందు అర్పించు దహనబలులకును, విశ్రాంతిదినము లందు, అమావాస్యలందు అర్పించు బలులకును, నియమిత పండుగలందు సమర్పించు బలులకు కావలసిన పశువులను రాజు తన సొంత మందలనుండియే ఇచ్చుటకు ఏర్పరచెను.
4. ఇంకను యాజకులకును, లేవీయులకును ముట్టవలసిన అర్పణలను యెరూషలేము పౌరులు కొనిరావలయుననియు, ఆ అర్పణలవలన వారు తమ అక్కరలను తీర్చుకొని తమ కాలము నంతిని ధర్మశాస్త్రము ఆదేశించు పరిచర్యలందు వినియోగింతురనియు రాజు హెచ్చరిక చేసెను.
5. ఆ హెచ్చరిక చెవినిబడిన వెంటనే ప్రజలు తమ ప్రథమఫలములైన ధాన్యమును, ద్రాక్షసారాయమును, ఓలివునూనెను, తేనె, పొలములో పండిన ఇతర వస్తువులును కొనివచ్చిరి. వారికి పండిన పంటమీద పదియవవంతు పన్నునుగూడ తీసికొని వచ్చిరి.
6. యూదా నగరములలో వసించు యూదీ యులును, యిస్రాయేలీయులు తమ పశువులలో పదియవవంతును తీసికొనివచ్చిరి. మరియు వారు చాల వస్తువులనుగూడ కానుకలుగా కొనివచ్చి ప్రభువు నకు అర్పించిరి.
7. మూడవ నెలనుండి కానుకలను అర్పింపమొదలిడిరి. ఏడవనెలవరకు వానిని సేకరించి కుప్పలుగాపేర్చిరి.
8. రాజు అతని ఉద్యోగులు ఆ కుప్పలను చూడవచ్చినపుడు ప్రభువును ప్రజలను కూడ కొనియాడిరి.
9. రాజు యాజకులతోను, లేవీ యులతోను కానుకల ప్రోగులగూర్చి సంభాషించెను.
10. అప్పుడు సాదోకు వంశజుడును, ప్రధాన యాజకుడునైన అజర్యా, రాజుతో ”ఈ ప్రజలు దేవాలయమునకు కానుకలు కొనివచ్చుట మొద లిడినప్పినుండియు మేము సమృద్ధిగా భుజించినను ఇంకను చాల మిగులచున్నవి. ప్రభువు ఈ ప్రజను దీవించెను గనుక ఈ వస్తువులన్నియు ప్రోగైనవి” అని చెప్పెను.
11. రాజు ఆజ్ఞపై దేవాలయము చెంత వస్తు సంభారములు నిల్వజేయుకొట్లు సిద్ధముచేసిరి.
12. కానుకలను, అర్పణములను, పన్నులుగా వచ్చిన వివిధవస్తువులను వానిలో భద్రపరచిరి. లేవీయుడైన కొనన్యాను ఆ వస్తుసముదాయమునకు అధిపతిని చేసిరి. అతని సోదరుడు షిమీ అతని క్రింది అధికారి.
13. రాజు మరియు ప్రధానయాజకుడైన అజర్యా ఆజ్ఞపై పదిమంది లేవీయులుగూడ వారిరువురికి సహాయులుగా నుండిరి. వారు యెహీయేలు, అసస్యా, నహతు, అసావేలు, యెరీమోతు, యోసాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనువారు.
14. దేవాలయ తూర్పుద్వారమునకు అధిపతి ఇమ్నా కుమారుడును లేవీయుడైన కోరె ప్రజలు తమంతట తాము కొనివచ్చిన కానుకలను స్వీకరించెడివాడు. అతడే ఆ కానుకలను, పరిశుద్ధవస్తువులను ప్రజలకు పంచి యిచ్చెడివాడు కూడ.
15. యాజకులు వసించు ఇతర నగరములలో కోరెకు సహాయులుగానున్న ఏదెను, మిన్యామీను, యేషువ, షెమయా, అమర్యా, షెకన్యా అనువారు నమ్మకస్తులైయుండి యాజకుల పట్టణములందు పిన్నపెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. వారు లేవీయుల వర్గములననుసరించి గాక వారి వారి పనులనుబ్టి వారికి ఆహారపదార్ధములను పంచిపెట్టెడివారు.
16. తెగలలో మూడు యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సు కలిగి జనసంఖ్య సరిచూడబడి ప్రతిదినమును దేవాలయమున తమకు నియమింపబడిన సేవలుచేయు పురుషులందరికి వారు ఆహారపదార్థములు పంచియిచ్చిరి.
17. యాజకులకు వారివారి వంశముల ప్రకారము పనులను ఒప్పగించిరి. ఇరువది యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సు గల లేవీయయాజకులకు వారి వారి పితరుల కుటుంబముల ప్రకారము పనులు ఒప్పగించిరి.
18. ఈ లేవీయులను వారివారి భార్యలు, పిల్లలు, బంధువులతోపాటు లెక్కించిరి. వారెల్లరును పవిత్ర నైవేద్యములను భుజించువారు కనుక ఎల్లపుడును శుద్ధినిపొంది ఉండవలయును.
19. అహరోను అనుయాయులకు ఈయబడిన నగరములలోకాని ఆ నగరములకు చెందిన పొల ములలో కాని వసించు యాజకులకు కొందరు పెద్దలుండిరి. వారు యాజకుల కుటుంబములలోని మగవారికందరికిని, లేవీయుల వంశములబ్టి సరి చూడబడిన వారికిని ఆహారపదార్థములు పంచియిచ్చిరి.
20. ఈ రీతిగా హిజ్కియా యూదా దేశమంతట ప్రభువు మెచ్చుకొను సత్కార్యములు చేసెను.
21. ధర్మశాస్త్రమును పాించుటలోగాని, దేవాలయసేవలో కాని అతడు చేసిన కార్యములెల్ల హృదయపూర్వక ముగానే చేసెను. కనుకనే అతడు విజయము పొందెను.