పన్నిద్దరు శిష్యులు (మార్కు 3:13-19; లూకా 6:12-16)

10 1. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు  పిలిచి, దుష్టఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను.

2. ఆ పన్నిద్దరు అపోస్తలుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రెయ, జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, 3. ఫిలిప్పు,  బర్తొలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, 4. కనానీయుడగు సీమోను, ఆయనను  అప్పగించిన యూదా ఇస్కారియోతు.

 వేదప్రచారము (మార్కు 6:7-13; లూకా 9:1-6)

5. యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: ”అన్య జనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు.

6. కాని, చెదరిపోయిన గొఱ్ఱెలవలెనున్న యిస్రాయేలు ప్రజలయొద్దకు వెళ్ళి, 7. పరలోకరాజ్యము  సమీపించినదనిప్రకటింపుడు, 8. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే  ఒసగుడు. 

9.  మీతో బంగారమును గాని, వెండినిగాని, రాగినిగాని కొనిపోవలదు.

10. ప్రయాణమునకై జోలెనుగాని, రెండు అంగీలనుగాని, పాదరక్షములనుగాని, చేతికఱ్ఱనుగాని తీసికొని పోవలదు. ఏలయన, పనివాడు తన బత్తెమునకు అర్హుడు.

11. ఏ పట్టణమునుగాని, ఏ పల్లెనుగాని మీరు ప్రవేశించినపుడు అందు యోగ్యుడగువానిని వెదకి కొనుడు. అచటినుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు.

12. మీరొక యింటిలోనికి ప్రవేశించి నపుడు, ఆ యింటినిదీవింపుడు.

13. ఆ ఇల్లు యోగ్య మైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగిచేరును.

14. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక, మీ ఉపదేశములను ఆలకింపక పోయినచో, ఆ యింటినిగాని, పట్టణమునుగాని విడిచి పొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు.

15. తీర్పు దినమున ఆ పురవాసుల గతికన్న సొదొమ గొమొఱ్ఱా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

హింసలు (మార్కు 13:9-13; లూకా 12:12-17)

16. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక  సర్పముల వలె యుక్తులై, పావురములవలె నిష్కపటులై మెలగుడు.

17. మనుష్యులను గూర్చి జాగ్రత్త  పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి, ప్రార్థనా మందిరములలో కొరడాలతోకొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు.

18. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారిఎదుటను, అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు.

19. మీరు న్యాయ స్థానములకు అప్పగింపబడినపుడు ఎట్లు మాట్లాడవలయునో, ఏమి చెప్పవలయునో, అని కలతచెంద కుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్ల మీకు అపుడు అనుగ్రహింపబడును. 

20.  మీరు మాట్లాడుమాటలు మీవి కావు; మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును.

21. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి  వారిని చంపించెదరు.

22. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు;     కాని, చివరివరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును.

23. మిమ్ము ఒకపట్టణమున హింసించినపుడెల్ల వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్యకుమారుడు వచ్చునప్పటికి యిస్రాయేలు పట్టణములన్నింటిని మీరుచుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను.

24. శిష్యుడు గురువుకంటెను అధికుడుకాడు. సేవకుడు యజమానునికంటెను అధికుడు కాడు.

25. గురువువలె శిష్యుడు, యజమానునివలె సేవకుడు అయిన చాలును. ఇంి యజమానుడు ‘బెల్జబూలు’ అని పిలువబడినయెడల, అతని ఇంటి వారు ఇంకెంత  హీనముగా పిలువబడుదురోకదా!”

ఎవరికి భయపడుట (లూకా 12:2-7)

26. ”కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు. రహస్య మైనదేదియు బట్టబయలు కాకపోదు.

27. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటిమీదినుండి ప్రకింపుడు.

28. శరీర మును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరమును కూడ నరకకూపమున నాశనము  చేయ గలవానికి ఎక్కువగా భయపడుడు.

29. ఒక కాసుతో మీరు రెండుపిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పములేనిదే వానిలో ఏ ఒక్కటియునేలకు ఒరగదు.

30. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడియేయున్నవి.

31. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకలకంటె అతి విలువైనవారు.

బహిరంగ సాక్ష్యము (లూకా 12:8-9)

32. ”కనుక ప్రజలయెదుట నన్ను అంగీకరించు ప్రతివానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును.

33. అటులగాక, ప్రజల యెదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోక మందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును.

పోరాటము (లూకా 12:51-53; 14:26-27)

34.1   ”ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని, శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు.

35. నా రాక, తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలుప్రతిఘటించునట్లు  చేయును.

36. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు.

37. తన తండ్రిని గాని, తల్లిని గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు.

38. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు.

39. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును; నాకొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును.

ప్రతిఫలము (మార్కు 9:41)

40. ”మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు.

41. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు, ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించు వాడు, నీతిమంతుని బహుమానమును పొందును.

42. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహు మానమును పోగొట్టుకొనడని  మీతో  నిశ్చయముగా చెప్పుచున్నాను.”

 

 

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము