1  1.క్రీస్తుయేసు కొరకు బందీయైన పౌలు, మన సోదరుడగు తిమోతి: మాకు ప్రియమైన తోడిపని వాడును అయిన ఫిలేమోనునకును, 2. మన సహోదరియగు అప్ఫియకును, మన తోడిసైనికుడగు అర్కిప్పునకును, నీ ఇంట సమావేశమగు దైవసంఘమునకు వ్రాయునది:

3. మన తండ్రి దేవునినుండియు, ప్రభువగు యేసు క్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము.

ఫిలేమోనుయొక్క ప్రేమ, విశ్వాసము

4. ప్రార్థించునపుడెల్లను నిన్ను జ్ఞాపకము చేసికొని దేవునకు కృతజ్ఞతలను అర్పింతును.

5. ఏలయన ప్రభువైన యేసుక్రీస్తుయెడల, పవిత్రులందరియెడల నీకు ఉన్న ప్రేమను, విశ్వాసమును గూర్చియు నేను విని యున్నాను.

6. విశ్వాసమునందు నీతోడి మా సహవాసము, మనము క్రీస్తునందు కలిగియున్న ప్రతి ఆశీర్వాదమును మరింత సుబోధకమొనర్చునుగాక! అని నా ప్రార్థన.

7. నా సోదరుడా! నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును, ఊరటను కలిగించినది. ఏలయన పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి.

ఓనేసిమును గూర్చిన ఒక మనవి

8. ఈ కారణము వలననే, నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్నుశాసించు సాహసము నాకున్నను, 9. దానికి బదులుగా ప్రేమకొరకై ప్రాధేయపడు చున్నాను. యేసు క్రీస్తుకొరకు రాయబారి, ఇపుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు.

10. నేను చెరసాలలో ఒనేసిమునకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను.

11. పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు. కాని యిప్పుడు అతడు నీకును, నాకును ఉపయోగపడును.

12. ఇపుడు నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పిపంపుచున్నాను.

13. సువార్త కొరకు చెరయందు ఉన్నపుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు, అతనిని ఇచట నా వద్దనే ఉంచుకొనవల యునని ఉన్నది.

14. కాని నాకు సాయము చేయవలసినదిగ నిన్ను నిర్బంధింపను. నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతిలేక నేను ఏమియు చేయను.

15. ఒనేసిము నీ నుండి తాత్కాలికముగ దూరమగుట, నీవు అతనిని తిరిగి శాశ్వతముగ పొందుటకే కావచ్చును. 16. ఇప్పుడు అతడు సేవకమాత్రుడు కాడు. సేవకుని కంటె ఎన్నియోరెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగ నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున, ప్రభువు విషయమున, నీకు అతడు ఎంతటివాడు కాగలడో!

17. కనుక, నన్ను నీ భాగస్వామిగ నీవు ఎంచినచో, నాకు నీవు స్వాగతమిచ్చునట్లే అతనికి స్వాగత మిమ్ము.

18. నీ పట్ల అతడు ఎట్టి తప్పొనర్చి ఉన్నను, లేక నీకు ఏమైన ఋణపడి ఉన్నను, అది నా లెక్కలో కట్టుకొనుము. 19. పౌలునగు నేను దీనిని నా స్వహస్తముతో వ్రాయుచున్నాను. నీ ఋణమును నేను తీర్తును. ఇక నీ ఆత్మ విషయములో నీవే నాకు ఋణ పడి ఉన్నావని నేను చెప్పనేల?

20. కనుక నా సోదరుడా! ప్రభువుకొరకై నీవు నాకీ ఉపకారము ఒనర్పుము. క్రీస్తునందు నా హృదయమును సేదదీర్చుము.

21. నేను కోరినట్లు చేయుదువను దృఢమైన నమ్మకముతో ఇట్లు వ్రాయుచున్నాను. నిజముగ నేను చెప్పిన దానికంటె ఎక్కువయే చేయుదువని నాకు తెలియును.

22. అట్లే దేవుడు నీ ప్రార్థనల వలన నన్ను తిరిగి నీ కొసగునని ఆశించుచున్నాను. కనుక నా కొరకు వసతి గదిని సిద్ధము చేసియుంచుము.

తుది శుభాకాంక్షలు

23. క్రీస్తుయేసు కొరకు బందీయైన నాతోడి ఎపఫ్రా, 24. ఇంకను నా తోడి పనివారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకాలు మీకు తమ శుభాకాంక్షలను పంపుచున్నారు.

25. ప్రభువగు యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక!