దేవాలయ పతనము – ప్రభు ప్రవచనము
(మార్కు 13:1-2; లూకా 21:7-11)
24 1. యేసు దేవాలయమునుండి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి.
2. ”వీటినిఅన్నింటిని మీరు చూచుచున్నారుగదా! ఇది రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు పలికెను.
శ్రమలు – హింసలు
(మార్కు 13:3-13; లూకా 21:7-19)
3. ఓలివు కొండపై యేసు కూర్చుండియుండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి ”ఇవి అన్నియు ఎప్పుడు సంభవించును? నీ రాకకు, లోకాంతమునకు సూచనయేమి?” అని అడిగిరి.
4. యేసు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను: ”మిమ్ము ఎవ్వరు మోసగింపకుండునట్లు మెలకువతో ఉండుడు.
5. అనేకులు నా పేరట వచ్చి ‘నేనే క్రీస్తును’ అని ఎందరినో మోసగింతురు.
6. మీరు యుద్ధములను గూర్చియు,వాటికి సంబంధించినవార్తలనుగూర్చియు విందురు. కాని కలవరపడవలదు. ఇవి అన్నియు జరిగితీరును. కాని అంతలోనే అంతము రాదు.
7. ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరి యొక రాజ్యముపై దాడిచేయును. అనేక ప్రదేశములందు కరువులు, భూకంపములు వచ్చును.
8. ఇవి అన్నియు ప్రసవవేదన ప్రారంభసూచనలు.
9. అపుడు జనులు మిమ్ము శ్రమలపాలు చేసి చంపుదురు. నానిమిత్తముఅందరు మిమ్ము ద్వేషింతురు.
10.ఆ దినములలో అనేకులు పతనమగుదురు. ఒకరి నొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు.
11. కపటప్రవక్తలు అనేకులు బయలుదేరి, ఎందరినో మోసగింతురు.
12. అక్రమములు ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును.
13. కట్టకడవరకు నిలకడగా ఉన్నవాడే రక్షణము పొందగలడు.
14. రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్ష్య ముగా ప్రపంచమంతట ప్రబోధింపబడును. అపుడు అంతము వచ్చును.
మహోపద్రవము
(మార్కు 13:14-23; లూకా17:23-24,37; 21:20-24)
15. ”ప్రవక్తయగు దానియేలు వచించిన భయంకర వినాశమును పరిశుద్ధస్థలమందు నిలిచియుండుట మీరు చూచెదరు. (దీనిని చదువరి గ్రహించుగాక!)
16. అపుడు యూదయా సీమలో ఉన్నవారు పర్వత ములకు పారిపోవలయును.
17. మిద్దెపైనున్నవారు తమసామగ్రిని తీసికొనుటకు క్రిందకు దిగి రాకూడదు.
18. పొలములో పనిచేయువాడు తన పై వస్త్రమును తీసికొనుటకు వెనుకకు మరలిపోరాదు.
19. గర్భిణులకు, బాలెంతలకు ఆ రోజులలో ఎంత బాధ?!
20. మీ పలాయనము శీతకాలమునందైనను విశ్రాంతి దినమునందైనను కాకుండునట్లు ప్రార్థింపుడు.
21. ప్రపంచ ప్రారంభమునుండి ఇప్పటివరకు లేనట్టియు, ఇక ముందెన్నడును రానట్టియు మహోపద్రవము అప్పుడు సంభవించును.
22. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవడును జీవింపడు. కాని ఎన్నుకొనబడిన వారి నిమిత్తము అవి తగ్గింపబడును.
23. అప్పుడు మీలో ఎవడైనను ”ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు” లేక ”అక్కడ ఉన్నాడు” అని చెప్పినను మీరు నమ్మవద్దు.
24. కపటక్రీస్తులు, కపటప్రవక్తలు బయలుదేరి సాధ్యమయినయెడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతము మోసగించుటకు గొప్ప మహత్కార్య ములను, వింతలను చేయుదురు.
25. ఇదిగో! నేను ముందుగానే మీకు తెలియజేసితిని.
26. అతడు ఎడారియందు ఉన్నాడని చెప్పినను మీరు పోవలదు. రహస్యస్థలమందున్నాడని చెప్పినను మీరు నమ్మవలదు.
27. ఏలయన, మనుష్యకుమారుని రాకడ తూర్పు నుండి పడమి వరకు మెరుపు మెరసినట్లుండును. 28. కళేబరము ఎచట ఉండునో అచటికి రాబందులు చేరును.
పునరాగమనము
(మార్కు 13:24-26; లూకా 21:25-28)
29. ”ఆ రోజుల మహావిపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును, చంద్రుడు కాంతి హీనుడగును, అంతరిక్షమునుండి నక్షత్రములురాలును, అంతరిక్షశక్తులు కంపించును.
30. అపుడు ఆకాశమందు మనుష్యకుమారుని చిహ్నము పొడగట్టును. భూమియందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్యకుమారుడు శక్తితోను, మహామహిమతోను అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారుచూతురు.
31. ఆయన తన దూతలను పెద్ద బూరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదెసలనుండి ప్రోగుచేయుదురు.
అంజూరపు చెట్టు – ఉపమానము
(మార్కు 13:28-31; లూకా 21:29-33)
32. ”అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు: దాని రెమ్మలు లేతవై చిగురించినపుడు వసంతకాలము వచ్చినదని మీరు గుర్తింతురు.
33. ఇట్లే వీనిని అన్నింటిని మీరు చూచునపుడు ఆయన సమీపముననే ద్వారమువద్ద ఉన్నాడని గ్రహింపుడు. 34. ఇవి అన్నియు నెరవేరునంతవరకు ఈతరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
35. భూమ్యాకాశములు గతించిపోవును గాని నా మాటలు ఎన్నడును గతించిపోవు.
అనూహ్యమైన గడియ
(మార్కు 13:32-37; లూకా 17:26-27, 34-35 21:34-36)
36. ”ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలుగాని, కుమారుడుగాని, మరెవ్వరునుగాని ఎరుగరు.
37. నోవా దినములయందు ఎట్లుండెనో, అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును.
38. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించువరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచుండిరి.
39. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపోవువరకు వారు ఎట్లు ఎరుగకుండిరో, అట్లే మనుష్యకుమారుని రాకడయు ఉండును.
40. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరియొకడు విడిచిపెట్టబడును.
41. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా, ఒకతె కొనిపోబడును, మరి యొకతె విడిచిపెట్టబడును.
42. కనుక మీరు జాగరూకులై యుండుడు. ఏలయన, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు.
43. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసినయెడల అతడు మేల్కొనియుండి, తన ఇంటికి కన్నము వేయనీయడు.
44. కనుక, మీరును సిద్ధముగా ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును.
నమ్మినబంటు – నమ్మనిబంటు
(లూకా 12:41-48)
45. ”విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన యింటివారందరికి వేళకు భోజనము పెట్టుటకు నియమింప బడినవాడే.
46. యజమానుడు యింటికి తిరిగివచ్చినపుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు.
47. యజమానుడు అట్టివానికి తన ఆస్తి యంతటిపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
48. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలకాలమువరకు తిరిగిరాడని తనలో తాననుకొని, 49. తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలిడును.
50. అతడు ఊహింపని దినములలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగివచ్చి, 51. ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు, పండ్లు కొరుకుకొందురు.