పాపి దుష్టత్వము, దేవుని మంచితనము

ప్రధానగాయకునికి యావే సేవకుడైన దావీదు కీర్తన

36 1.      దుష్టుని హృదయమున

                              పాపము మంతనము చేయును.

                              అతడికి దైవభీతి ఉండదు.

2.           అతడు తననుతాను ఘనముగా ఎంచును.

               దేవుడు తన పాపమును

               గుర్తుపట్టడనియు, తన దోషమును

               ఖండింపడనియు తలంచును.

3.           అతడి పలుకులు దుష్టత్వముతోను,

               అబద్ధములతోను నిండియుండును.

               అతడు జ్ఞానమును విడనాడెను కనుక

               ఇక మంచిని చేయజాలడు.

4.           అతడు పడకమీద పరుండి,

               చెడు పన్నాగమును పన్నును.

               దుష్టమార్గమున నడచును,

               అధర్మమును అంగీకరించును.

5.           ప్రభూ! నీ కృప ఆకాశమును అంటును.

               నీ నమ్మదగినతనము మబ్బులను తాకును.

6.           నీ నీతి మహాపర్వతములవలె స్థిరమైనది.

               నీ ఆజ్ఞలు అగాధసముద్రములవలె లోతైనవి.

               నీవు నరులను, మృగములనుకూడ కాపాడుదువు.

7.            నీ కృప ఎంతో అమూల్యమైనది.

               నరులకు నీ రెక్కలమాటున

               ఆశ్రయము దొరకును.

8.           వారు నీ ఆలయమున

               సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు.

               నీ మంచితనము అను నదినుండి

               పానీయమును సేవింతురు.

9.           నీవు జీవపు చెలమవు.

               నీ వెలుగు వలననే

               మేము వెలుగును గాంతుము.

10.         నిన్నెరిగిన భక్తులకు

               నీ కృపను దయచేయుచుండుము.

               సజ్జనులకు నీ నీతిని ప్రసాదించుచుండుము.

11.           గర్వాత్ములు నన్ను అణగద్రొక్కకుందురుగాక!

               దుష్టులు నన్ను పారద్రోలకుందురుగాక!

12.          దుష్టులు తాము పడినచోటనే పడియుందురు.

               మరల పైకిలేవరు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము