3. అన్యజాతులను గూర్చిన ప్రవచనములు

బబులోనియాకు ప్రతికూలముగా

13 1. ఆమోసు కుమారుడైన యెషయా

               బబులోనియాను గూర్చి వినిన దైవసందేశము.   

2.           చెట్లులేని కొండమీద యుద్ధధ్వజమును ఎత్తుడు.

               యుద్ధనాదము చేసి సైనికులను పిలువుడు.

               వారికి చేయెత్తి సంజ్ఞచేయుడు.

               ప్రముఖుల ద్వారములను ముట్టడింపుడని

               వారితో చెప్పుడు.

3.           ప్రభువు తనకు అంకితులైన

               పరాక్రమ శాలురలను పిలిచి,

               తాను కోపించినవారిని శిక్షింప ఆజ్ఞాపించెను.

4.           పర్వతములమీద సందడియగుచున్నది వినుడు.

               అది మహాజనసమూహము చేయు సందడి,

               జాతులు రాజ్యములు కలిసి చేయు సందడి.

               సైన్యములకు అధిపతియైన ప్రభువు తనసేనలను

               యుద్ధమునకు సంసిద్ధము చేయుచున్నాడు.

5.           ఆ సైన్యములు దూరదేశముల నుండి

               వచ్చుచున్నవి. నేలచెరగులనుండి వచ్చుచున్నవి.

               కోపపూరితుడైన ప్రభువు సర్వదేశములను

               నాశనముచేయుటకు వేంచేయుచున్నాడు.

6.           మీరు బిగ్గరగా అరవుడు!

               ప్రభువుదినము సమీపించినది.

               అది సర్వశక్తిమంతుని నుండి

               ప్రళయమును కొనివచ్చును.

7.            కనుక ప్రతి వాని

               బాహువులన్నియు దుర్బలమగును.

               ప్రతివాని గుండె ధైర్యమును కోల్పోవును.

8.           ఎల్లరు భయకంపితులై బాధకును,

               దుఃఖమునకును గురియగుదురు.

               ప్రసవవేదనను అనుభవించు

               స్త్రీ వలె వేదననొందుదురు.

               భయముతో ఒకరివైపొకరు చూతురు.

               ఎల్లరి మోములు సిగ్గుతో వాడిపోవును.

9.           ప్రభువుదినము వచ్చుచున్నది.

               అది అతని కోపమును,

               రౌద్రమును కొనివచ్చు క్రూరదినము.

               అది నేలను ఎడారిచేయును.

               పాపులను  వేరంట పెల్లగించును.

10.         చుక్కలు, నక్షత్రరాశులు ప్రకాశింపవు.

               సూర్యుడు ఉదయింపగనే చీకట్లు క్రమ్ముకొనును.

               చంద్రుడు వెలుగునీయడు.

11.           ప్రభువు ఇట్లనుచున్నాడు: ”నేను లోకుల

               దుష్టత్వమునకు వారిని దండింతును.

               దుర్మార్గుల పాపములకు వారిని శిక్షింతును.

               నేను గర్వాత్ముల పొగరు అణగింతును.

               క్రూరులైన అధిపతుల అహంకారమును

               అణగద్రొక్కుదును.

12.          నరులు మేలిమిబంగారముకంటెను

               అరుదగుదురు.

               శ్రేష్ఠమైన సువర్ణముకంటెను విరళమగుదురు

               నరులు అరుదుగా నుండజేసెదను.

13.          సైన్యములకధిపతియైన నేను,

               ఆ  రోజు నా ఆగ్రహమును ప్రదర్శించి,

               ఆకాశము కంపించునట్లు చేసెదను.

               నేల తావుదప్పునట్లు చేసెదను.

14.          అప్పుడు వేటగానినుండి పారిపోవు లేడివలెను,

               పోగుచేయని గొఱ్ఱెలవలెను

               ప్రతివాడు తన దేశమునకు పారిపోవును.

               సొంతజనుల యొద్దకు పరుగెత్తును.

15.          శత్రువులకు చిక్కిన వారందరును చత్తురు.

               వారికి దొరకిన వారందరును

               కత్తివాతబడుదురు.

16.          ఆ ప్రజలు చూచుచుండగనే

               విరోధులు వారి శిశువులను చితుకగొట్టుదురు.

               వారి ఇండ్లను కొల్లగొట్టుదురు.

               వారి భార్యలను చెరతురు.

17.          ఇదిగో నేను మాదీయులను

               వారిమీదికి పురికొల్పుచున్నాను.

               వారు వెండిని లక్ష్యము చేయరు.

               బంగారమును ఆశింపరు.

18.          వారు విల్లమ్ములతో యువకులను వధింతురు.

               చింబిడ్డలను కరుణింపరు.

               గర్భఫలముల చూచి జాలిచెందరు.

19.          బబులోనియా రాజ్యములలోనెల్ల శ్రేష్ఠమైనది.

               కల్దీయులకు అలంకారమును

               గర్వకారణమునైనది.

               కాని ప్రభుడనైన నేను సొదొమ గొమొఱ్ఱాలవలె

               దానినిగూడ కూలద్రోయుదును.

20.        ఇకమీదట అచట ఎవడును ఎప్పికిని వసింపడు. దేశదిమ్మరులైన అరబ్బులు అచట గుడారములు

               వేయరు.  కాపరులు అచట గొఱ్ఱెలు మేపుకొనరు.

21.          అచట ఎడారిమృగములు వసించును.

               గుడ్లగూబలు గూళ్ళుకట్టుకొనును.

               నిప్పుకోళ్ళు బ్రతుకును.

               ఎడారిమేకలు5 తిరుగాడును.

22.        ఆ నగరపు మేడలు, గోపురములు

               నక్కల కూతలతో, దుమ్ములగొండుల

               అరపులతో మారుమ్రోగును.

               దాని వినాశకాలము ఆసన్నమైనది.

               అది ఇంకెన్ని రోజులో మనజాలదు.”