మా కొరకు ప్రార్థింపుడు

3 1. కడన సోదరులారా! ప్రభువు వాక్కు మీ యందు వలెనే త్వరగ వ్యాపించి విజయమును పొందునట్లు మా కొరకై ప్రార్థింపుడు.

2. దుష్టులనుండియు, పాపుల నుండియు దేవుడు మమ్ము కాపాడునట్లు గూడ ప్రార్థింపుడు. ఏలయన, అందరును సందేశమును విశ్వసింపరుగదా!

3. కాని ప్రభువు విశ్వసనీయుడు. ఆయన మిమ్ము శక్తిమంతులను చేయును. దుష్టునినుండి మిమ్ము కాపాడును.

4. ప్రభువునందు మాకు మీ విషయమున నమ్మకము కలదు. మా బోధనలను మీరు ఆచరించు చున్నారనియు, ఇక ముందును అట్లే పాటింపగలరనియు మా దృఢవిశ్వాసము.

5. దేవునియందలి ప్రేమయు, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక!

పనిచేయవలసిన బాధ్యత

6. సోదరులారా! యేసుక్రీస్తు ప్రభువుయొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితములను గడపుచు, మా ఉత్తరువులను అనుసరింపని వారినుండి దూరముగ ఉండుడు.

7. మమ్ము ఎట్లు అనుసరింపవలెనో మీకు తెలియును గదా! మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగ ప్రవర్తింపలేదుగదా!

8. మేము ఎవనివద్దను ఉచితముగ ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికిని బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి.

9. మేము ఇట్లు చేసినది మీనుండి సాయమును పొందు హక్కు లేకకాదు. మీకు ఆదర్శప్రాయముగ ఉండుటకే. 10. ”పని చేయనివాడు భోజనమునకు అర్హుడుకాదు” అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమిగదా!

11. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తల దూర్చుట తప్పవేరు పనిలేదనియు, మేము విని యుండుటచే ఇట్లు చెప్పుచున్నాము.

12. క్రమబద్ధమైన జీవితమును గడపవలెననియు జీవనోపాధికై కష్టపడి పనిచేయవలెననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టివారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము.

13. సోదరులారా! మేలు చేయుటయందు మీరు విసిగిపోరాదు.

14. మేము ఈ లేఖ ద్వారా తెలియజేయు సందేశమునకు విధేయుడు కానివాడు అట ఎవ్వడైన ఉండవచ్చును. ఉన్నచో, అతడు సిగ్గుపడు నట్లుగా వానిని గుర్తించి వానితో ఎట్టి పొత్తును పెట్టు కొనకుడు.

15. కాని, వానిని శత్రువుగ చూడక, సోదరునిగ భావించి హెచ్చరింపుడు.

తుది పలుకులు

16. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగ శాంతిని ఒసగునుగాక! ప్రభువు మీకు అందరకును తోడై ఉండును.  

17. పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను. నా జాబులు అన్నికిని ఇదే గుర్తు. నేను ఇట్లే వ్రాయుదును.

18. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరకు తోడై ఉండునుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము